నవతెలంగాణ-హైదరాబాద్ : షంటింగ్‌కు వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు ధ్వంసం అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో గల ప్రముఖ ‘యోగ్ నగరి రిషికేశ్’ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వారంలో రెండు రోజులు నడిచే ఈ ‘ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్’కు చెందిన ఇంజన్‌తో పాటు మూడు బోగీలు అదుపుతప్పి పట్టాలు తప్పాయి. తదుపరి ప్రయాణం కోసం లోకో పైలట్ ఈ ఖాళీ రైలును మెయింటెనెన్స్ యార్డ్ వైపు షంటింగ్ (పట్టాలు మార్చే ప్రక్రియ) చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. రైలు కొంత వేగంగా వెళ్లడంతో, పట్టాలు తప్పిన ఒక బోగీ పక్కనే ఉన్న పీలర్‌ను బలంగా ఢీకొట్టి తీవ్రంగా ధ్వంసమైంది. అయితే, ప్రమాద సమయంలో రైలు పూర్తిగా ఖాళీగా ఉండటం, ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పెను ముప్పు తప్పింది.
ఈ ప్రమాదం కారణంగా బోగీలు రైల్వే ట్రాక్ పై పడిపోవడంతో యోగ్ నగరి మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, రైల్వే సాంకేతిక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే ఇంజనీర్లు భారీ క్రేన్ల సహాయంతో పట్టాలపై పడిపోయిన బోగీలను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాథమిక విచారణ ప్రకారం, మెయింటెనెన్స్ సమయంలో రైలు ‘బ్రేక్ సిస్టమ్’ ఫెయిల్ అవ్వడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు పూర్తిస్థాయి సాంకేతిక విచారణకు ఆదేశించారు.


