ఆర్టీసీ కార్మికుల రోజు వారి సమస్యలకన్నా కేంద్ర ప్రభుత్వ విధానాలపైనే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ఎక్కువగా స్పందిస్తున్నదని, దీని గురించి ఆ నాయకత్వం ఆలోచించాలని సామాజిక మాధ్యమంలో కొంతమంది సూచనలు, సలహాలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేస్తున్నప్పటికీ, అసలు విషయాన్ని కార్మికులకు, ప్రజలకు తెలియజేయడం అవసరమని సంఘం భావించింది. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల రూపం ఏదైనా వాటివెనక ఒక విధానం, ఆ విధానానికి ఒక రాజకీయ ఉద్దేశం ఉంటుంది. సమస్య పరిష్కారం కావాలన్నా, దాని వెనుకున్న విధానంలో మార్పు కోసం పోరాడాలి. ఇది అర్థం చేసుకోవడం అత్యంత అవసరం.
1979 సెప్టెంబర్ 16 ఆర్టీసీలో సీఐటీయూకు అనుబంధంగా ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించింది. రెండు శత్రు శిబిరాలుగా ఉన్న ఆర్టీసీ కార్మికోద్యమాన్ని ఐక్యం చేయడంతో పాటు సమాజ మార్పు లక్ష్యంగా ”ఐక్యత- పోరాటం” నినాదంతో సంఘం ఏర్పాటయింది. ‘ఉన్న సంఘాలను చీల్చి కొత్త సంఘం పెట్టిన వీరు యూనియన్ బోర్డు ఎక్కడ పెడతారని’ కొంతమంది ఎద్దేవా చేశారు. అటువంటి వ్యాఖ్యలకు వెరవకుండా చేసిన కృషి ఫలితంగానే ఈరోజు ఏ సంఘంలో ఉన్న కార్మికుడైనా, సమస్యల పరిష్కారానికి ఐక్యత తప్ప మరోదారి లేదని ముక్తకంఠంతో చెప్తున్నారు. ఆనాటి ఎస్‌డబ్ల్యూఎఫ్ నినాదం ఈరోజు కార్మికుల సొంత నినాదంగా మారింది. సంఘం పుట్టిన రెండేండ్లలోనే 1981లో జరిగిన సార్వత్రికసమ్మెకు ఆర్టీసీలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌తో పాటు ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ మద్దతిచ్చి సమ్మెలో భాగస్వాములైంది. ఇది చరిత్ర, ఎస్‌డబ్ల్యూఎఫ్ సాధించిన మొదటి విజయం.
ఆర్టీసీ రెగ్యులేషన్స్ వల్లనే ఉద్యోగ భద్రత లేదని, రాజ్యాంగానికి, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని, ఎస్‌డబ్ల్యూఎఫ్ ముందునుంచే చెబుతూ వచ్చింది. రెగ్యులేషన్స్‌లో మార్పులు చేయాలని ఆందోళన చేయడంతో ఆపకుండా, వాటి పరిధిలో కూడా తమ ఉద్యోగాలను కాపాడు కోవడం కోసం ఏం చేయాలనే విషయంపై వందల క్లాసులు నిర్వహించి వేలాదిమందికి చైతన్యాన్ని కలిగించింది. ఆర్టీసీ రెగ్యులేషన్స్‌ను రద్దుచేయాలని రాష్ట్ర హైకోర్టు మెట్లెక్కింది. ఎస్‌డబ్ల్యూఎఫ్ ఒక్కటే రెగ్యులేషన్స్‌లో మార్పులు కోరుతున్నదని మిగిలిన ఏ సంఘం అలా అడగడం లేదనే కారణంతో ఆ కేసుని కొట్టివేసింది. సుప్రీంకోర్టులో అప్పీలు కూడా తిరస్కరించబడింది. కానీ, ఈ రోజున ఆర్టీసీలోని మొత్తం కార్మికవర్గం రెగ్యులేషన్స్ సవరించాలని, అప్పుడే ఉద్యోగ భద్రత వస్తుందని నమ్ముతూ ఆ డిమాండ్ పరిష్కారం చేయాలని కోరుతున్నది.46 ఏండ్లుగా రెగ్యులేషన్‌కు వ్యతిరేకంగా సంఘం చేసిన కృషి ఫలితమే ఈ మార్పు. కాదని చెప్పగలరా?
నూతన ఆర్థిక విధానాల ప్రభావం
1991లో నూతన ఆర్థిక విధానాలు దేశంలో అమల్లోకి వచ్చాయి. వీటివలన మొత్తం ప్రభుత్వ రంగసంస్థలు అన్ని ప్రయివేటుపరం అవుతాయని, ఉద్యోగ, ఉపాధి భద్రత ఉండదని, ఆర్టీసీ కూడా ప్రయివేటుపరం అవుతుందని, ఆర్టీసీ పరిరక్షణ ప్రమాదంలో పడుతుందని ఎస్‌డబ్ల్యూఎఫ్ చెబుతూ వచ్చింది. ఎంతమంది ఎన్నిరకాలుగా నిందించినా, అవమానించేలా మాట్లాడినా తన లక్ష్యాన్ని విడనాడలేదు. నూతన ఆర్థిక విధానాల ప్రభావాన్ని కార్మికులను అర్థం చేయించింది, ఇంకా చేయిస్తూనేవుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన 23 దేశవ్యాప్త సమ్మెల్లోనూ ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకత్వంలో ఆర్టీసీ కార్మికవర్గం పాల్గొన్నది. 34ఏండ్ల అనుభవం చూస్తే పాలించే నాయకులు ఎవరైనా, పాలించే పార్టీ ఏదైనా అవే ఆర్థిక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తున్న అనుభవం మన ముందుంది. ఆనాడు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రయివేటీకరించడానికి ”ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్” పేరుతో ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందాన్ని ఎస్‌డబ్ల్యూఎఫ్ వెలుగులోకి తెచ్చింది. 2001లో ఎస్‌డబ్ల్యూఎఫ్, ఈయూ, ఎన్‌ఎంయూలతో కూడిన జేఏసీ నాయకత్వంలో చారిత్రాత్మక 24 రోజుల సమ్మె జరిగింది.
ఆ ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు పడుతున్న అనేక సెక్షన్స్ ఉద్యోగ, కార్మికులు ఈ సమ్మెకు మద్దతిచ్చాయి. ప్రభుత్వ నిర్భందానికి వ్యతిరేకంగా సీఐటీయూ ఆఫీసులే ఉద్యమాలకు కేంద్రాలయ్యాయి. సుమారు 8600 మందికి పైగా జైలు పాలయ్యారు. ఆ ప్రభుత్వ విధానాలను వెనక్కికొట్టి సమ్మె విజయవంతమైంది. అప్పటివరకు ఆదాయంపై పదిహేను శాతం వసూలు చేస్తున్న పన్నులు సగానికి తగ్గించడమే కాక ఆర్టీసీ ఇస్తున్న రాయితీలలో యాభై శాతం ప్రభుత్వం తిరిగి చెల్లించేలా ఒప్పందం జరిగింది. అప్పటివరకు వేతనఒప్పందాల పేరుతో గుండుగుత్తగా సొమ్ము ఇచ్చే పద్ధతి మార్చి మొదటిసారిగా తొమ్మిది శాతం బేసిక్‌లో పెరుగుదలతో వేతన ఒప్పందానికి సంఘం కృషి చేసింది. ఈ విజయం ఒక చరిత్ర. ఆ సమ్మె అనంతరం అన్ని పక్షాల మద్దతును పొందిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఆర్టీసీ ప్రయివేటీకరణ విధానాలు ముందుకు తెచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా చైతన్యపరిచింది. ఆ నేపథ్యంలోనే 2005లో రెండు దఫాలుగా ఐదు రోజుల సమ్మె జరిగింది. పన్నుల భారం తగ్గింపు, వందశాతం రాయితీలు తిరిగి చెల్లింపు వంటివి సాధించింది. రూట్లు ప్రయివేటు వారికి ఇవ్వకుండా నిరోధించగలిగింది. ఇందులో ఎస్‌డబ్ల్యూఎఫ్‌నే కీలకపాత్ర వహించిందన్నది జగమెరిగిన సత్యం.
పోరాటాలు, విజయాలు
కార్మికవర్గ చిరకాల కోరికైన పెన్షన్ సమస్యను పాలకులు పరిష్కరించకపోగా కాంట్రిబ్యూటరీ పద్ధతిలో 1995లో ఎంప్లారు పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చారు. అన్ని యూనియన్లు ఆ స్కీమ్‌ను స్వాగతించినా, ఈ స్కీంవల్ల జరిగే నష్టాన్ని ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్మికులకు తెలియజేయడమే కాక 1996 ఫిబ్రవరిలో జరిగిన జాతీయసమ్మెకు ఆర్టీసీ కార్మికులను సమీకరించింది. 2014 సవరణలకు వ్యతిరేకంగా కార్మికుల కోర్టుకెళ్లగా 2022లో కార్మికులను హయ్యర్ పెన్షన్‌ను అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు అమలులో వస్తున్న సమస్యలన్నింటిపైన ఆర్టీసీలో ఒక్క ఎస్‌డబ్ల్యూఎఫ్ మాత్రమే స్పందించి కృషిచేసింది. ఆందోళనలు చేసి కొన్ని సమస్యల్ని పరిష్కరించింది.
పెన్షన్ లెక్కింపులో జరుగుతున్న అన్యాయం, 2014లో హయ్యర్ పెన్షన్ రిజెక్ట్ చేసిన 16,300 మంది సమస్య పరిష్కారానికి మూడేండ్లుగా కృషి చేస్తున్నది. ఆర్టీసీలోకి వచ్చిన అద్దె బస్సులు, ఇప్పుడు తీసుకొస్తున్న విద్యుత్ బస్సులు, వాటి వెనకున్న రాజకీయ అంశాలపై నిరంతరం ప్రచారం చేస్తున్నది. కార్మికుల ఉద్యోగ భద్రతకు పొంచిన ముప్పును వెలుగులోకి తెస్తున్నది. 2005లో కాంట్రాక్ట్ డ్రైవర్, కండక్టర్ల పద్ధతి వచ్చింది. వారిని బానిసలుగా చూస్తూ ఎటువంటి హక్కులు లేకుండా పనిచేయించే ప్రయత్నం జరిగింది. ఆ విధానానికి వ్యతిరేకంగా సీఐటీయూ నాయకత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ యూనియన్ ఏర్పాటు చేసి ఏడేండ్లపాటు పోరాటం నిర్వహించింది. దాని ఫలితంగా అనేక రాయితీలను సంపాదించడంతోపాటు మొత్తం ఇరవై మూడువేల మంది రెగ్యులర్ కావడానికి కృషి చేసింది.
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు ప్రభుత్వ విధానాల్లో నుండి వచ్చినవే. గత పదకొండేండ్లుగా దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేకం విధానాలలో భాగమే తప్ప మరొకటి కాదు. బీజేపీ సర్కార్ లేబర్ కోడ్‌లను 2019, 2020 సంవత్సరాలలో ఆమోదింపచేసుకున్నది. ఆ సమయంలో టీజీఎస్‌ఆర్టీసీలో 49 వేల మంది కార్మికులు సంపూర్ణ ఐక్యతతో నిరవధిక సమ్మెకు దిగారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నప్పటికీ కార్మికుల ఐక్యతను దెబ్బతీయ లేకపోయారు. 55 రోజుల సమ్మె తర్వాత సమ్మె విరమణ చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఆనాడు పాలక పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ కేంద్రం ఆమోదించిన కోడ్‌లలోని అంశం ద్వారానే ఆర్టీసీ యూనియన్లపై ఆంక్షలు విధించింది. యూనియన్ స్థానంలో వెల్ఫేర్ కమిటీలను వేసింది. కార్మిక సంఘాల కార్యకలాపాలను నిర్వీర్యం చేసి, కార్మిక సంఘాలను కార్మికుల నుండి దూరం చేసే కుట్రకు తెరదీసింది. సంఘటిత కార్మికోద్యమం ఉండకూడదు. ప్రభుత్వ, యాజమాన్య విధానాలను ప్రశ్నించే శక్తులను బలహీనపరచడం, కార్మిక ఐక్యతను విచ్ఛిన్నం చేయడం కోసమే బీజేపీ తెచ్చిన లేబర్ కోడ్‌లు, టీఆర్‌ఎస్ తెచ్చిన ఆంక్షలు అనేది అర్థం చేసుకోవాలి. ఇది ఒక రాజకీయ అంశం.నయా ఉదారవాద విధానాల అమలులో పరాకాష్ట.
ఐక్యప్రతిఘటన అనివార్యం
రాష్ట్రంలో పాలక పార్టీ మారినా, ఆర్టీసీ కార్మిక ఉద్యమంపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కార్మిక సంఘాలతో ద్వైపాక్షిక చర్చలు లేకుండానే 2017 వేతన ఒప్పంద ప్రకటన, పనిగంటల పెంపు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లేకుండానే ట్రస్ట్‌ల నిర్వహణ, నిధులను ఆర్టీసీ వాడుకోవడం వంటివి జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగానే సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు కూడా మూడేండ్లపాటు కన్సాల్డేటెడ్ వేతనంపై పనిచేయాలని, శాశ్వత ఉద్యోగుల స్థానంలో గ్రాడ్యుయేట్ అప్రెంటీసులు పేరుతో ఉద్యోగులను నియామకాలు జరుగుతున్నాయి. అంతేకాదు, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్, కండక్టర్‌ల నియామకాలు కూడా అలాగే అవుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిం టికీ కొంతమంది వ్యక్తులు కారణమని, వారిని మార్చేస్తే లేదా వారు మారిపోతే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని కొన్ని కార్మిక సంఘాలు ప్రచారం చేస్తున్నాయి.
ఇటువంటి ప్రచారం సత్యదూరమే కాక కార్మికుల పోరాటశక్తిని నిర్వీర్యం చేస్తాయి. ఆర్టీసీ పరిణామాలు చూస్తే ఇవి నిజమని కూడా అర్థమవుతాయి. రాష్ట్రంలో పాలక పార్టీ మారింది. పాలించే నాయకత్వం మారింది. అయినా, ఆర్టీసీ కార్మికులపై ఆంక్షలు ఎత్తివేయబడలేదు. కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించడం లేదు. అసలు కార్మిక సంఘాలనే గుర్తించడం లేదు. శాశ్వత ఉద్యోగుల రిక్రూట్ మెంట్ లేదు. కార్మికులను ఇంటికి పంపించి, ఆర్టీసీని ప్రయివేటు కార్పొరేట్లకు అప్పచెప్పేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ బస్సుల విధానాన్ని రాష్ట్రంలో మరింత గట్టిగా అమలు చేస్తామని సర్కార్ పదే పదే ప్రకటనలు చేస్తున్నది.
2025లో కూడా 2013 నాటి అలవెన్స్‌లనే కార్మికవర్గం పొందుతున్నది. 2021, 2025లో జరగాల్సిన వేతన ఒప్పందాల ఊసే లేదు. 2017 వేతన ఒప్పంద ఏరియర్స్ చెల్లింపు ఎండమావిలాగే ఉంది. అందుకని సమస్య పరిష్కారానికి డిమాండ్ చేయడం, ఆందోళన నిర్వహించడంతో పాటు సమస్యలకు మూలమైన పాలకుల విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులను సన్నద్ధం చేయడం అత్యంత ఆవశ్యం. ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆర్టీసీ కార్మికులను ఆ బాటలోనే నడుపుతున్నది. అందుకని సంఘాన్ని విమర్శించడం సరికాదు. ఇప్పటికైనా ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలు ఏకమవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమైక్య పోరాటానికి నడుం కట్టాలి. ఎస్‌డబ్ల్యూఎఫ్ నినాదమే ఐక్యత, కోరుకుంటున్నదీ అదే.
వి.ఎస్.రావు
9490098890



