Wednesday, March 4, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

- Advertisement -

అమెరికా, ఇజ్రాయిల్‌ మిలిటరీ ఫిబ్రవరి 28న అడ్డగోలుగా ఇరాన్‌పై దాడులను ప్రారంభించాయి. ఆ దేశ సుప్రీమ్‌ నేత అయాతుల్లా అలీ ఖమేనితో పాటు కుటుంబ సభ్యులు, ఇతర సీనియర్‌ నేతలను అనేకమందిని హత్య చేశాయి. దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా తనకున్న సత్తామేరకు ఆత్మరక్షణ ఎదురుదాడులు చేస్తోంది. అమెరికా దాడుల ఆంతర్యం గురించి మీడియాలో రోజూ వస్తున్న వార్తల పూర్వరంగంలో మరోసారి చెప్పనవసరం లేదు. అనేక కోణాల గురించి చర్చ జరుగుతున్నది. దానిలో ముందుకొచ్చిన కొన్ని అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్దనలు చోటు చేసుకుంటున్నాయి. ‘అంతా వారే చేశారంటూ’ అమెరికా మాజీ అధ్యక్షులైన బరాక్‌ ఒబామా, జో బైడెన్‌ల మీద డోనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడ్డాడు. వారిద్దరూ నిద్రపోయిన కారణంగానే ఇరాన్‌ అణుముప్పు తలెత్తిందని ఆరోపించాడు.

ఈ పెద్దమనిషి టెహరాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి 2018లో ఏకపక్షంగా తప్పుకొని చేసిందేమిటి? తాను గనుక వైదొలగకపోతే ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందం మేరకు ఈ పాటికే ఇరాన్‌ అణుబాంబులను తయారు చేసి ఉండేదని పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. ఆ ఒప్పందం అత్యంత ప్రమాదరకమైనదని, అది కుదరకపోతే నేడు ప్రపంచం మరోవిధంగా ఉండేదంటూ తన అడ్డగోలు చర్యలకు సమర్ధనగా వాదిస్తున్నాడు. ఇప్పటికే ఇరాన్‌ తయారు చేసిన క్షిపణులు ఐరోపాను, విదేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను తాకగలవని, అడ్డుకోకపోతే అమెరికాను చేరేవి తయారు చేయగలదన్నాడు. ప్రపంచంలో ఏమూలకైనా వెళ్ల గల ఆయుధాలను రూపొందించుకోవటం తమ హక్కని, ఇతరులకు అది లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. సుదూర ప్రాంతాల లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను మనం కూడా తయారు చేస్తున్నాం, ఏదో ఒక రోజు ఇరాన్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌గాకపోతే మరొకడు మనకూ వర్తింపచేయడని గ్యారంటీ ఏముంది?

ఇజ్రాయిల్‌ ఉనికిని దెబ్బతీసేందుకు ఇరాన్‌ చర్యలే తాజా పరిణామాలకు కారణమన్నది ఒక ఆరోపణ. చరిత్రను చూసినపుడు ఎలాంటి కవ్వింపులు లేకుండా ఇజ్రాయిల్‌పై దాడులకు దిగిన ఉదంతం ఉందా? లేదు. ఐరాసలో ఇజ్రాయిల్‌ ఏర్పాటును వ్యతిరేకించిన 13దేశాలలో ఇరాన్‌ ఒకటి. దానికి ప్రతిగా అక్కడ అమెరికా, బ్రిటన్‌ గూఢచార సంస్థలు కుట్రపన్ని మొసాదిక్‌ ప్రభుత్వాన్ని కూలదోసి 1953లో ఇరాన్‌ షా తొత్తు పభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇజ్రాయిల్‌ను గుర్తించింది. షా ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడటంతో తలెత్తిన తిరుగుబాటును మతఛాందస శక్తులు తమకు అనుకూలంగా మార్చుకొని 1979లో అయాతుల్లా ఖొమైనీ సుప్రీమ్‌ నేతగా అధికారానికి వచ్చాయి.

అప్పటి నుంచి అమెరికా, ఇజ్రాయిల్‌ కుట్రలు తిరిగి ప్రారంభమయ్యాయి, తాజాగా హత్యకు గురైన అలీ ఖమేనీ 1989లో సుప్రీమ్‌ లీడర్‌గా ఎన్నికయ్యాడు. ఇరాన్‌ షా పాలనా కాలంలో పాలస్తీనా విముక్తియోధులకు వ్యతిరేకంగా ఇరాన్‌ చేయాల్సిందంతా చేసింది. ఆ పాలన అంతమైన తరువాత అదే ఇరాన్‌ విముక్తి యోధులకు, వారికి మద్దతు ఇస్తున్న సాయుధబృందాలకు చేస్తున్న సాయం బహిరంగమే. ఈ క్రమంలో గత పదిహేనేళ్లుగా శత్రుత్వం పెరిగింది. అమెరికా ఆంక్షలకు ప్రతిగా ఎన్‌పిటి నుంచి వైదొలిగి అణుకార్యక్రమాన్ని ఇరాన్‌ చేపట్టింది. అమెరికా-ఇజ్రాయిల్‌ రెండూ కలసి 2010లో టక్స్‌నెట్‌ కంప్యూటర్‌ వైరస్‌ను తయారు చేసి ఇరాన్‌ అణుకేంద్రాల్లోని సెంట్రిఫ్యూజెస్‌ను నాశనం చేశాయి. అయినప్పటికీ ఆ కార్యక్రమం కొనసాగటంతో అమెరికాతో సహా మరికొన్ని దేశాలు దాన్ని నిలిపివేసేందుకు 2015లో ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నాయి.

ఇదే డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో ఏకపక్షంగా దాన్నుంచి వైదొలిగే నిర్ణయం తీసుకున్నాడు. ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేస్తే వాటిని ఇజ్రాయిల్‌ మీద ప్రయోగిస్తుందన్నది ఒక ఆరోపణ. మరి ఇజ్రాయిల్‌ ఎవరిమీద ప్రయోగించేందుకు అణుబాంబులను తయారు చేసినట్లు? అణ్వాయుధాలను రూపొందించిన వారందరూ ఎవరో ఒకరిమీద ప్రయోగించేందుకు అన్న అమెరికా అడ్డగోలు వాదనలను సమర్ధించే మన దేశంలోని కొందరు మనం ఎవరిమీద వేసేందుకు రెండు సార్లు అణుపరీక్ష జరిపినట్లు? ఉత్తర కొరియా, పాకిస్తాన్‌ కూడా బాంబులను కలిగి ఉన్నాయి, వాటి గురించి అమెరికా మాట్లాడదేం! అనేక సార్లు ఇరాన్‌ అణుకేంద్రాలపై అమెరికా-ఇజ్రాయిల్‌ తమ ఏజెంట్లను ప్రయోగించి దాడులు చేశాయి. అనేక మంది శాస్త్రవేత్తలను చంపివేశాయి. కాస్పియన్‌ సముద్రంలో ఇరాన్‌ సహజవాయువు పైప్‌లైన్లను 2024 ఫిబ్రవరిలో ఇజ్రాయిల్‌ ధ్వంసం చేసింది, ఏప్రిల్‌ నెలలో సిరియా రాజధాని డెమాస్కస్క్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం మీద దాడికి ప్రతిగా ఇరాన్‌ ఎదురుదాడి చేసింది తప్ప ఇతర ఏ సందర్భంలోనూ ముందుగా అది టెల్‌అవీవ్‌ మీద దాడులు చేయలేదు.

అమెరికా, ఇజ్రాయిల్‌ను వ్యతిరేకించే దేశాలు, సాయుధ బృందాలకు ఇరాన్‌ సాయం చేయటం సరైంది కాదు కదా! ఈ వాదన చేస్తున్న వారు ఐరాస నిర్దేశించిన పాలస్తీనా ప్రాంతాలను తీర్మానం చేసిన మరుసటి రోజు నుంచే ఇజ్రాయిల్‌ ఎందుకు ఆక్రమించుకొని పాలస్తీనియన్లను ఆప్రాంతాల నుంచి తరిమి వేస్తున్నట్లు? దానికి పశ్చిమదేశాలు ఎందుకు మద్దతిస్తున్నట్లు? తమ మాతృభూమి కోసం పోరాడుతున్న వారికి మద్దతు ఇస్తున్నది ఇరాన్‌, అడ్డుకొనే దుర్మార్గానికి ఆసరా ఇస్తున్నవి అమెరికా, దాని మిత్రదేశాలు. పాక్‌ నియంతల నుంచి విముక్తికోసం పోరాడిన బంగ్లాదేశ్‌ పోరాట యోధులకు మద్దతుగా మన దేశం మిలిటరీని కూడా దింపి తోడ్పడిన సంగతి తెలిసిందే. ఈ చర్య సరైనదే అయినపుడు పాలస్తీనా విముక్తికోసం ఇరాన్‌ లేదా మరొక దేశం ఏదైనా మిలిటరీని నడిపినా తప్పులేదు, కానీ వెలుపలి నుంచి మాత్రమే మద్దతిస్తున్నది.

పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలను ఆక్రమించుకొని అవి మావే అని చెబుతున్న ఇజ్రాయిల్‌ దుండగాలను సమర్ధిస్తున్నవారు ఏదో ఒక సాకుతో మరోదేశాన్ని ఆక్రమించరనే హామీ ఏముంది? కెనడాను తమ 51వ రాష్ట్రంగా మార్చాలని ట్రంప్‌ అంటే తప్పుపట్టిన అదే కెనడా నేడు అమెరికా దుందగానికి, పాలస్తీనా ఆక్రమణలో ఇజ్రాయిల్‌కు మద్దతిస్తున్నది. పాలస్తీనా ప్రాంతాలు తమ రక్షణకు హామీగా కావాలని యూదు దురహంకారులు చెబుతున్నట్లే అమెరికా రక్షణకు గ్రీన్‌లాండ్‌ అవసరమంటున్న అమెరికా చర్యను విమర్శించిన ఫ్రాన్సు,బ్రిటన్‌, జర్మనీ ఇప్పుడు ఇరాన్‌పై దాడిని సమర్ధిస్తున్నాయి, తమ స్థావరాలను వినియోగించుకొని మరింత మంది పసిపిల్లలను చంపమని, గాజాను నాశనం చేసిన మాదిరి ధ్వంసం చేయమని చెబుతున్నట్లు కాదా!

చరిత్రలో యూదులకు అన్యాయం జరిగిందని, ఇజ్రాయిల్‌ బాధిత దేశం అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. యూదులు నీచులంటూ మధ్యయుగాల్లోనే పశ్చిమాసియా ప్రాంతం నుంచి మధ్యయుగాల్లో జరిగిన మత యుద్ధాల్లో తరిమివేశారు, నాజీ మూకలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక దేశాల్లో ఊచకోత కోశాయి. వారికి న్యాయం చేసే పేరుతో మాతృభూమిగా ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేశారన్నది ఒక వాస్తవం. అదే సమయంలో పాలస్తీనా కూడా అవతరించాలని ఐరాస చేసిన నిర్ణయం గడచిన ఎనిమిది దశాబ్దాలుగా అమల్లోకి రాకపోతే ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు ఎందుకు ప్రశ్నించరు? వారికి మాతృభూమి లేకనే ఇరుగుపొరుగు దేశాల్లో తలదాచుకుంటున్నారు,తమ దేశ ఏర్పాటుకోసం సాయుధపోరాట మార్గాన్ని కొందరు చేపట్టారు.

అలాంటి సంస్థలలో ఒకటైన హమాస్‌ 2023 అక్టోబరు ఏడున దాడి చేసి 1200 మందిని హతమార్చి 250 మందిని బందీలుగా పట్టుకోవటాన్ని ప్రపంచంలో ఎవరూ సమర్ధించలేదు. కానీ, ఆ పేరుతో గాజాలో 70వేల మందిని ఊచకోత కోసిన ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని హమాస్‌ చర్యను ఒకే గాటన కట్టడం ఏ విధంగా సమర్ధనీయం? నాడు మనదేశం పాలస్తీనా ఏర్పాటును పూర్తిగా సమర్ధించింది. కానీ ఇటీవల ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లి హమాస్‌ దురాగతాన్ని ఖండించారు తప్ప ఇజ్రాయిల్‌ మారణకాండ గురించి పల్లెత్తుమాట అనలేదు, మానవత్వం గురించి కబుర్లు చెబితే ఎలా! దాడులు ప్రారంభమైన తరువాత ఇజ్రాయిల్‌, ఇతర దేశాలతో మాట్లాడారు తప్ప ఇరాన్‌ నేతలకు మోడీ ఎందుకు ఫోన్‌ చేయలేదు! నిజంగా తటస్తంగా ఉంటే రెండు పక్షాలతో మాట్లాడాలి. భారతీయులు ఉన్నది ఒక్క గల్ఫ్‌దేశాల్లోనే కాదుగా ఇరాన్‌లో కూడా వేలాది మంది ఉన్నపుడు వారి మంచి చెడ్డల గురించి అయినా కనీసం ఇరాన్‌ నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదా? పోనీ ఇరాన్‌ మన శత్రుదేశమా? కాదే, అమెరికా బెదిరించేవరకు 2019కు ముందు చమురు దిగుమతి చేసుకున్నాంగా!

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు, అందువలన అతగాడు మరణిస్తే సంతాపం తెలపాల్సిన అవసరం లేదు, ఖండించాల్సిన పని కూడా లేదంటున్నారు. కాసేపు అదే నిజమనుకుందాం. వెనెజులా అధ్యక్షుడు మదురో మన వ్యవహారాల్లో వేలుపెట్టలేదుగా, చమురు సరఫరా చేశాడు. అతన్ని అమెరికా కిడ్నాప్‌ చేస్తే ఎందుకు ఖండించలేదో ఎవరైనా చెప్పగలరా ? ఆర్టికల్‌ 370 రద్దును ఖమేనీ వ్యతిరేకిం చాడని అంటున్నారు. ఆ మాటకు వస్తే చైనా కూడా వ్యతిరేకించింది, అయినా షీ జిన్‌పింగ్‌తో మోడీ చెట్టపట్టాలు వేసుకోలేదా? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును పాక్‌ పాలిత ప్రాంతమని, మన అంతర్భాగంగా ఉన్న కాశ్మీరును భారత పాలిత ప్రాంతంగా అమెరికా వర్ణించింది, అంటే కాశ్మీరు మనది అని చెప్పకపోయినప్పటికీ అమెరికాతో రాసుకుపూసుకు తిరుగుతున్నాం.

ఖమేని మరణానికి సంతాపం తెలపాలా లేదా అన్నది ఒక సమస్య, కచ్చితంగా చెప్పాలని ఎవరూ అనటం లేదు, అయితే హత్యను, ఇరాన్‌ మీద దాడిని ఖండించాలా లేదా, ఎందుకు నోరువిప్పటం లేదు! ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతగా మోడీ గురించి ప్రచారం జరుగుతోంది. డోనాల్డ్‌ ట్రంప్‌ను కూడా కాళ్ల దగ్గరకు తెచ్చుకోగలిగిన సమర్ధుడన్నారు. దేశాన్ని విశ్వ గురువుగా మార్చానని, అంతర్జాతీయ వ్యవహారాల్లో దేశానికి ఒక స్థానం కల్పించానని పదే పదే చెప్పారు. ఉక్రెయిన్‌-రష్యా పోరులో రెండు దేశాలూ మిత్రులే గనుక తటస్తం అని చెబితే నిజమే కదా అనుకున్నార. ఇప్పుడు కూడా మిత్రదేశాల మధ్యనే పోరు మొదలైంది. మన వైఖరి ఏమిటి ? నెతన్యాహుకు ఫోన్‌ చేసి మాట్లాడినందుకు నా గొప్ప స్నేహితుడు మోడీ అంటూ ఆ పెద్దమనిషి ప్రశంసలు కురిపించాడు. కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఇరాన్‌ మన మిత్రదేశమే అని చెబుతున్నారు కదా? ఎందుకుని వారితో మాట్లాడలేదు! ఈ వైఖరి ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటంటే మనం అమెరికా చంకనెక్కాం, దాని హత్యాకాండను సమర్ధించాం అని కాదా!

ఇరాన్‌కు కోపం ఉంటే అమెరికా, ఇజ్రాయిల్‌ మీద తీర్చుకోవాలిగానీ గల్ఫ్‌దేశాల మీద దాడులు చేయటం ఏమిటన్నది మరొక అతి తెలివి వాదన. ఒక వేళ తమ మీద దాడిచేస్తే అమెరికా వైమానిక స్థావరాలు, నౌకల మీద విరుచుకుపడతామని పదేపదే ఇరాన్‌ ముందే ప్రకటించింది. అలాంటపుడు గల్ఫ్‌ దేశాలు తమ గడ్డ మీద ఉన్న స్థావరాల నుంచి అమెరికన్లను ఎందుకు ఖాళీ చేయించలేదు. స్థావరాలు ఎందుకంటే అమెరికా పెట్టుబడులు ఆ ప్రాంతంలో ఉన్నాయి గనుక వాటిని రక్షించుకొనేందుకని అతనికంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లుగా సమర్ధిస్తున్నారు. అమెరికా పెట్టుబడులు మనదేశంలో, చైనాలో కూడా ఉన్నాయి, మరి వాటి రక్షణకు మిలిటరీ స్థావరాలను నెలకొల్పలేదేం! మనకు పదిహేడు వందల కిలోమీటర్ల దూరంలో హిందూమహా సముద్రంలోని డిగోగార్షియా దీవుల్లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉంది, అక్కడ ఏం పెట్టుబడులు ఉన్నట్లు? తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డికోసం అన్నట్లుగా కుంటి సాకులు చెబుతున్నారు. గల్ఫ్‌దేశాల్లోని స్థావరాలను ఉపయోగించుకొని అమెరికా ఇప్పుడు ఇరాన్‌ మీద దాడులు చేస్తున్నది, అందుకే వాటిని టెహరాన్‌ లక్ష్యంగా చేసుకుంది తప్ప ఆ దేశాల మీద యుద్ధం ప్రకటించలేదు. యుద్ధమంటే అంతమయ్యేది ముందు అమాయక జనం. అందువలన ఏ మాట, ఏ చర్య వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోవాలి!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -