జీసీసీ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
న్యూఢిల్లీ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ పాల్పడిన సైనిక దురాక్రమణను సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అక్రమం, అమానవీయమని, ఐరాస చార్టర్, ముఖ్యంగా ఏ దేశ ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా జరిగే బలప్రయోగాన్ని, బెదిరింపును నిషేధించే ఆర్టికల్ 2(4)ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని సీఐటీయూ విమర్శించింది. ఈ మేరకు సీఐటీయూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ సుమారు తొమ్మిది కోట్ల జనాభా కలిగిన సార్వభౌమ దేశమని, ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మక, ఇంధన ఉత్పత్తి దేశాల్లో ఒకటని సిఐటియు గుర్తు చేసింది. ఇరాన్‌లో సంభవించే అస్థిరత ప్రపంచ ఇంధన భద్రతకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
నాలుగు దశాబ్దాలకు పైగా ఇరాన్ నిరంతర ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనాలను, అస్థిరత ప్రయత్నాలను ఎదుర్కొంటుందని, ముఖ్యంగా 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగినప్పటి నుంచి ఇవి తీవ్రమయ్యాయని సీఐటీయూ తెలిపింది. తాజా దాడుల్లో ఇరాన్‌లోని పాఠశాలలను కూడా లక్ష్యంగా చేసుకోవడం అమెరికా-ఇజ్రాయిల్ క్రూరత్వం, అనాగరికతను వెల్లడిస్తుందని సీఐటీయూ విమర్శించింది. మినాబ్ నగరంలో ఒక బాలికల పాఠశాలపై చేసిన దాడిలో 165 మందికి పైగా చిన్నారులు మరణించారని తెలిపింది. ఇరాన్‌పై దాడుల విషయంలో మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఖండించింది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఏర్పడిన సంక్షోభం గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాలైన యుఎఇ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమెన్, బహ్రెయిన్‌ల్లోని లక్షలాది మంది భారతీయులను అభద్రత, అనిశ్చితిలోకి నెట్టాయని సీఐటీయూ ఆవేదన వ్యక్తం చేసింది. జీసీసీ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటియు డిమాండ్ చేసింది. అలాగే, ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్ చేస్తున్న దారుణమైన దాడికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో తీవ్రతరమవుతున్న యుద్ధ పరిస్థితులను, ఈ సంక్షోభ సమయంలో మోడీ ప్రభుత్వ విఫల పాత్రను ఖండించాలని సీఐటీయూ స్పష్టం చేసింది.



