Sunday, July 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ లక్ష్యంగా అమెరికా దాడులు..50 మంది మృతి

ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా దాడులు..50 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు జరుపుతున్న వరుస దాడుల్లో ఇప్పటివరకు కనీసం 50 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ అధికారికంగా వెల్లడించారు. గత 24 గంటల్లోనే 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, గాయపడిన వారిలో 37 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శనివారం అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడి సంతకానికి ‘విలువ లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య గతంలో జరిగిన అవగాహన ఒప్పందాలను అమెరికా పదేపదే ఉల్లంఘించిందని, ఆ దేశాన్ని నమ్మలేమని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) స్పష్టం చేసింది. మరోవైపు, ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు, సైనిక రవాణా వ్యవస్థలు, భూగర్భ ఆయుధశాలలను లక్ష్యంగా చేసుకుని వరుసగా 7వ రాత్రి కూడా విజయవంతంగా దాడులు పూర్తి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో ఏ క్షణమైనా ఎదురుదాడికి సిద్ధంగా 50,000 మందికి పైగా అమెరికా సైనికులు మోహరించి ఉన్నారని హెచ్చరించింది.

అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం కూడా ఎదురుదాడికి దిగింది. కువైట్‌లోని అల్ అహ్మది రేవులో ఉన్న అమెరికా నావికాదళ ఇంధన సపోర్ట్ పీర్‌ను, అలాగే బహ్రెయిన్‌లోని షేక్ ఈసా ఎయిర్ బేస్‌లో ఉన్న అమెరికా యుద్ధ విమానాల స్థావరాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను జోర్డాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూల్చివేయగా, బహ్రెయిన్ కూడా ఇరాన్ వైమానిక దాడులను తిప్పికొట్టింది. అయితే, ఇరాన్ దాడి కారణంగా కువైట్‌లోని ఒక విద్యుత్, నీటి శుద్దీకరణ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అమెరికా బలగాలకు ఆశ్రయం ఇస్తున్న దేశాలు, తమ భూభాగాన్ని ఇరాన్‌పై దాడులకు ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -