– వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం రూ.60వేలు డిమాండ్
– ముందుగానే రూ. 40వేలు చెల్లించిన రైతు
– మిగిలిన రూ.15వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
నవతెలంగాణ-ములకలపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రామ పరిపాలన అధికారి (జీపీవో) లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో దాడులు నిర్వహించింది. జీపీవో బానోత్ శ్రీనివాస్ నాయక్ పూసుగూడెంకు చెందిన ఓ రైతు వద్ద వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్, పాస్‌బుక్ ఇప్పిస్తానని చెప్పి రూ.60 వేలు లంచం డిమాండ్ చేశాడు. ముందుగా రూ.40వేలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని రైతు.. ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా సోమవారం మిగిలిన బ్యాలెన్స్ రూ.15 వేలు బానోత్ శ్రీనివాస్ నాయక్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జీపీవో శ్రీనివాస్ నాయక్ గతంలో బూర్గంపాడు మండలంలో వీఆర్వోగా పనిచేశాడు. ఆ సమయంలో ఆయన.. పలు అవినీతి, ఆరోపణలు ఎదుర్కొన్నట్టు సమాచారం. ఏసీబీ అధికారులు ఇతనిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ మాట్లాడుతూ బానోత్ శ్రీనివాస్ వ్యవహారంలో పై అధికారుల పాత్ర ఏమైనా ఉన్నదా అనే కోణంలో విచారిస్తున్నామని తెలియజేశారు. అలాగే ఎవరైనా అధికారులు లంచం అడిగితే 1064 నెంబర్‌కు ఫోన్ చేయగలరని చెప్పారు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.
ఏసీబీకి చిక్కిన గ్రామ పరిపాలన అధికారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



