నవతెలంగాణ-సదాశివపేట
పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. మంగళవారం ఉదయం సమయంలో సదాశివపేట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ కు పట్టణంలోని బస్‌స్టాండ్ సమీపంలో ఉన్న చాన్‌భారు చాయ్ హోటల్ వద్ద జగ్గారెడ్డి కొంతమందితో కలిసి డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. తనిఖీల సమయంలో అక్కడ జగ్గారెడ్డి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే, ఆయన ఎవరికి డబ్బులు పంపిణీ చేయలేదని ప్రాథమిక విచారణలో తేలినట్టు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ, ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు సంబంధిత ఎన్నికల ప్రాంతానికి చెందని రాజకీయ నాయకులు ఆ ప్రాంతంలో ఉండకూడదనే నిబంధనను జగ్గారెడ్డి ఉల్లంఘించినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జగ్గారెడ్డిపై సదాశివపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సదాశివపేట సీఐ డి. వెంకటేష్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. జగ్గారెడ్డిపై కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



