అధికధరలు, అమెరికా యుద్దోన్మాదంపై 16న నిరసనలు
ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఇంటింటికీ సీపీఐ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కేరళంలో పినరయి విజయన్ సర్కార్ భేష్ : జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాస్వామ్య పద్ధతిలో సమసమాజాన్ని సాధించేందుకు మాజీ మావోయిస్టులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు కొనసాగిస్తున్న యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నా మోడీ సర్కారు పట్టించుకోకపోవడాన్ని నిలదీస్తూ ఈ నెల 16న అన్ని కేంద్రాల్లోనూ నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.బాల్‌రాజ్ అధ్యక్షతన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన ప్రముఖులకు, సీపీఐ నేతలకు రాష్ట్ర కౌన్సిల్ సంతాపం తెలిపింది. ఈ సమావేశాల్లో సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మెన్ డాక్టర్ కె.నారాయణ, జాతీయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ, సీనియర్ నేతలు అజీజ్‌పాషా, చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు టి. శ్రీనివాసరావు, ఈటీ నరసింహా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. శంకర్, బాల నరసింహా, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూనంనేని మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలమేంటో నిరూపించుకున్నామనీ, తమతో పొత్తు లేకుంటే ఏం జరుగుతుందో జలకు ఇచ్చామని తెలిపారు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆ ధర్మాన్ని తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మానికి విఘాతం కలిగించిందన్నారు. రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో సొంతంగా బలపడేందుకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 15 రోజుల పాటు ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహిస్తామనీ, ప్రజల నుంచి ఉద్యమ నిధి సేకరిస్తామని వెల్లడించారు. కాలేజీల్లో స్టూడెంట్ యూనియన్ల ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టునేనని స్పష్టం చేశారు.
కె.రామకృష్ణ మాట్లాడుతూ…ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కేరళంలో ఎల్‌డీఎఫ్ నేతృత్వంలోని పినరయి విజయన్ సర్కారు భేష్‌గా పనిచేస్తున్నదని కొనియాడారు. అతిపేదరికాన్ని నిర్మూలించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. డిగ్రీ వరకు ఉచిత విద్య అందించడం, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో తీర్చిదిద్దడం గొప్ప విషయన్నారు. త్వరలో రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు కమ్యూనిస్టులకు అత్యంత కీలకమని చెప్పారు. విదేశాంగ విధానంలో మోడీ సర్కారు విఫలమైందని విమర్శించారు. మోడీ తన 12 ఏండ్ల పాలనలో అర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎత్తిచూపారు. ఆధునిక యుగ నరరూప రాక్షసుడిగా అమెరికా అధ్యక్షులు ట్రంప్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అమెరికాను తిరిగి శక్తివంతమైన దేశంగా చేయాలనే లక్ష్యంతో ట్రంప్ తలపెట్టిన యుద్ధంతో 30కిపైగా దేశాలు ప్రభావితం అవుతున్నాయని తెలిపారు.
మాజీ మావోయిస్టులను సీపీఐలోకి ఆహ్వానిస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



