Wednesday, March 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమన సమాజంలోని డార్క్‌ సైడ్‌ని చూపిస్తున్నాం

మన సమాజంలోని డార్క్‌ సైడ్‌ని చూపిస్తున్నాం

- Advertisement -

డైరెక్టర్‌ పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘కాక్రోచ్‌’. అభిలాష్‌ సుంకర, ప్రేమసన్‌, నవీన్‌, తీర్థ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్‌ బ్యానర్‌ పై బి.బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 6న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత బి.బాపిరాజు మీడియాతో మాట్లాడుతూ,’ మా కాంబినేషన్‌లో చేస్తున్న మరో వినూత్న సినిమా ఇది. కొందరు క్రిమినల్స్‌, వేశ్య మధ్య సాగిన ప్రేమ కథ ఈ సినిమాకు నేపథ్యం. ఈ కథను వీలైనంత బోల్డ్‌గా తెరకెక్కించారు మా దర్శకుడు సునీల్‌ కుమార్‌ రెడ్డి. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం.

రియల్‌ లైఫ్‌ స్టోరీని రా అండ్‌ రస్టిక్‌ మేకింగ్‌తో చూడాలనుకునే ప్రేక్షకులకు మా మూవీ బాగా నచ్చుతుంది’ అని తెలిపారు. ‘నేను విశాఖలో జర్నలిస్ట్‌గా పనిచేశాను. వార్తల సేకరణలో భాగంగా పోలీసులు, నేరస్తులతో మాట్లాడుతుండేవాడిని. ఈ క్రమంలో వారు చెప్పే విషయాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తుండేవి. కొందరు పోలీసులు, నేరస్తులతో కలిసి నేరాలు చేసేవారు. అలాంటివన్నీ విన్న తర్వాత ఈ నేపథ్యంతో సినిమా రూపొందిస్తే బాగుంటుంది అనిపించింది. మన నేరస్తుల గురించి ఒక అభిప్రాయం ఏర్పర్చుకుని ఉంటాం. కానీ వాళ్ల జీవితాలను దగ్గరగా చూశాక నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. వాళ్లలో కొందరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కలగన్న వారున్నారు. డాక్టర్‌ చదివి వైద్య సేవ చేయాలనుకునే వారూ ఉన్నారు.

వాళ్ల కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో జరిగిన అనేక సంఘటనల వల్ల అనుకున్న దారిలో వెళ్లలేక క్రిమినల్స్‌గా మారారు. మన సినిమాల్లో సమాజంలో ఉండే పువ్వుల్లాంటి జీవితాలే చూపించారు. కానీ మొక్క దగ్గర ఉండే మట్టిని, పువ్వు చుట్టూ ఉండే ముల్లు లాంటి జీవితాలను ఎవరూ తెరకెక్కించలేదు. ఈ సినిమాతో నేను ఆ ప్రయత్నం చేశాను. ఈ సినిమా పిల్లలకు, సున్నిత మనస్కులకు కాదని ప్రచార కార్యక్రమాల్లోనే స్పష్టంగా చెబుతున్నాం. ప్రస్తుతం మలయాళంలో ఒక మూవీ, చదలవాడ శ్రీనివాసరావుకి ఒక సినిమా చేశాను. బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడి అర్బాజ్‌ ఖాన్‌తో ఒక సినిమాకు వర్క్‌ చేశాను’ అని దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -