Friday, February 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచేనేతల రుణ విముక్తి ఎప్పుడు?

చేనేతల రుణ విముక్తి ఎప్పుడు?

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణమాపీ ప్రకటించి నిధులు కేటాయించినా..క్షేత్ర స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. గత మార్చిలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించి, అధికారులు జీవో జారీ చేసి పదకొండు నెలలు కావస్తున్నా..కార్యాచరణకు నోచుకోలేదు. ఆయా జిల్లాలోని లబ్ధిదారులు రుణ విముక్తి కోసం అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగి వేసారుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యుల్‌కు ముందే ఆయా బ్యాంకుల్లోని ఖాతాల్లో నిధులు జమ చేస్తుందని ఎదురు చూసిన నేతన్నలకు నిరాశే ఎదురైంది. మరో నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున సీఎం, సంబంధిత మంత్రి చొరవ చూపి రుణ విముక్తి కల్పించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.

తెలంగాణలోని వస్త్ర పరిశ్రమ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులోనూ చేనేత రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నేతన్నలు తీసుకున్న అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేనేత రుణమాఫీని ప్రకటించింది. గత మార్చి 9న హైదరాబాద్‌లో అఖిల భారత పద్మశాలి మహాసభకు హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి చేనేత రుణమాఫీని ప్రకటించారు. తొలుత ప్రాథమికంగా అంచనా వేసిన అధికార యంత్రాంగం వెంటనే రూ. 33 కోట్లు మంజూరు చేస్తూ జీవో 56ను జారీ చేసింది. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం మరో రూ.16. 27 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని మొత్తం 6784 మంది చేనేత కార్మికులకు రూ. 49.31 కోట్ల నిధులు మంజూరు చేసింది సర్కారు. అయితే రెండో దశలో రుణమాఫీ నిధులు మంజూరు అయినప్పటికీ.. క్షేత్ర స్థాయిలో కార్మికులకు రుణ విముక్తి కాలేదు. దీనిపై గత మండలి సమావేశంలో ఎమ్మెల్సీ సత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన చేనేత-జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు త్వరలో అమలు చేస్తామని హామీనిచ్చారు. 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 మధ్య కాలంలో ఆయా బ్యాంకుల్లో రూ. లక్ష వరకు తీసుకున్న రుణాలు మాఫీ అయ్యేలా జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రూ. లక్ష కు పైగా తీసుకున్న అప్పు,వడ్డీని కార్మికుడే చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో తీసుకున్న రుణాల్లో కొన్ని కిస్తీలను కొంత మంది కార్మికులు చెల్లించారు. బ్యాంకులకు తిరగి చెల్లించిన డబ్బును సైతం చేనేత కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.

దీంతో కార్మికులకు కొంత స్వాంతన లభించేలా జీవో జారీ చేసింది సర్కారు. కాగా.. కార్మికులు తీసుకున్న అప్పుపై అయిన వడ్డీని మాఫీ చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసింది సర్కారు. దీనిపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మెలిక పెట్టింది. కార్మికులు తీసుకున్న రుణంపై అయిన వడ్డీ మాఫీ చేసే విషయమై క్షేత్ర స్థాయిలోని ఆయా బ్యాంకర్ల నిర్ణయానికే వదిలేస్తున్నట్లు బ్యాంకుల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. జిల్లా స్తాయిలో కలెక్టర్ల అధ్యక్షతన చేనేత జౌళిశాఖ ఏడీ కన్వీనర్‌తో ఏర్పాటు చేసిన డీఎల్‌సీ సమావేశంలో బ్యాంకర్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. యూబీఐ, మరికొన్ని బ్యాంకులు కార్మికుల వడ్డీ మాఫీపై స్ఫష్టత ఇవ్వలేదు. వడ్డీ కార్మికులు, లేదంటే ప్రభుత్వమే చెల్లించాలనే నిబంధనలు పెట్టాయి. దీనిపై అనేక జిల్లాల్లో చేనేత జౌళిశాఖ అధికారులు బ్యాంకర్లను ఒప్పించగలిగారు.

రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి-భువనగిరి జిల్లా చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతోంది. ఈ జిల్లాలో అత్యధికంగా 2380 మంది కార్మిక కుటుంబాలకు రూ.19.26 కోట్ల లబ్ధి చేకూరనుంది. ఈ జిల్లాలోని పోచంపల్లి, కోయలగూడెం తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది చేనేత కార్మికులున్నారు. సిల్క్‌ టై అండ్‌ డై వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. పెట్టుబడి కోసం కార్మికులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోనూ 1761 మంది చేనేత కార్మికులకు రూ.11.75 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

నల్గొండ జిల్లాలో 515 మంది నేతన్నలకు రూ. 3.79 కోట్లు, వనపర్తి జిల్లాలో 338 మందికి రూ. 2.54 కోట్లు..ఇలా తెలంగాణాలోని ఆయా జిల్లాలోని మొత్తం 6784 మంది చేనేత కార్మికులకు రూ. 49.31 కోట్ల రుణాలు మాఫీ అవుతాయి. చిన్న మధ్య తరగతి చేనేత కార్మికులు ఆయా బ్యాంకుల్లో వృత్తి పరంగా ముద్ర, ఇతర వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. వారికి రూ. లక్ష వరకు రుణ మాఫీ కొంత ఉపశమనం కలిగించినా..కొత్త రుణాలు మంజూరు చేయించేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సి ఉంది. వస్త్ర పరిశ్రమలో నూలు, రసాయనాలు, ఇతరాత్ర అవసరాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించి పెట్టుబడులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని నేతన్నలు కోరుతున్నారు.

చిలగాని జనార్ధన్‌
8121938106

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -