Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంఎందుకీ వివక్ష..!

ఎందుకీ వివక్ష..!

- Advertisement -

పార్లమెంటులో మహిళల సంఖ్య తగ్గుతోంది
మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లో జాప్యం
రిజర్వేషన్లు లేకుండా ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వకూడదు?
నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు చేస్తారో చెప్పండి : కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు రిజర్వేషన్లు లేకుండా పార్లమెంటులో ఎందుకు ప్రాతినిధ్యం కల్పించరని అడిగింది. దేశంలోనే అతిపెద్ద మైనారిటీలుగా మహిళలు ఉన్నారనీ, వారిపై ఎందుకీ వివక్ష అని నిలదీసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి. నాగరత్న కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. మహిళా రిజర్వేషన్‌ చట్టం అమలులో ఆలస్యం, చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

చట్టం అమలులో జాప్యంపై స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ‘నారీ శక్తి వందన్‌ అధినియం’గా పిలవబడే మహిళా రిజర్వేషన్‌ చట్టం (రాజ్యాంగ 106వ సవరణ చట్టం) అమలులో ఆలస్యం, అందులోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ జయా ఠాకూర్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)ను జస్టిస్‌ బి.వి.నాగరత్న నేతృత్వంలోని న్యాయమూర్తి ఆర్‌.మహాదేవన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎదురు చూడకుండా చట్టాన్ని అమలు చేయాలని జయా ఠాకూర్‌ తన పిల్‌లో కోరారు. ఈ మేరకు కేంద్రం నుంచి స్పందన కోరుతూ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

33 శాతం రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలిపినా..
లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు, ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కల్పించే ఈ చట్టానికి 2023 సెప్టెంబర్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన విషయం విదితమే. అయితే ఈ చట్టం తదుపరి జనగణన, ఆ తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరమే అమలు కానున్నది. అయితే చట్టం అమలును ఎందుకు ఆలస్యం చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ అడ్వొకేట్‌ శోభా గుప్తా ప్రశ్నించారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా మహిళా ప్రాతినిధ్యం కోసం పిటిషనర్‌ కోర్టును ఆశ్రయించాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు.

”ఇది మహిళలకు రాజకీయ న్యాయం కల్పించడానికి ఒక ఉదాహరణ. రాజకీయ న్యాయం కూడా సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయాలతో సమానం, ముఖ్యమైనది. మహిళలు దేశంలోనే అతిపెద్ద మైనారిటీ. దేశ జనాభాలో వీరు 48.44 శాతంగా ఉన్నారు” అని జస్టిస్‌ బి.వి. నాగరత్న అన్నారు. మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు, అనుకూలమైన నిబంధనలు తీసుకొచ్చేలా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(3) ప్రభుత్వానికి అధికారాన్ని కల్పిస్తుందని ఆమె వివరించింది. ఈ మేరకు కేంద్ర హౌం, న్యాయ మంత్రిత్వ శాఖల ద్వారా కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు నిర్వహిస్తారని ప్రభుత్వం నుంచి సమాధానం కోరింది. కాగా చట్టం అమలు కార్యనిర్వాహక శాఖ బాధ్యత అని, కోర్టు మాండమస్‌ ఆదేశాలు ఇవ్వలేదని ధర్మాసనం స్పష్టం చేశారు.

జనగణన,నియోజకవర్గాల పునర్విభజనపై కాలపరిమితి ఎక్కడా..?
ఈ చట్టంలో జనగణన, నియోజకవర్గాల పునర్విభజన గురించి నిర్దిష్టమైన కాల పరిమితి ఎక్కడా పేర్కొనలేదని అడ్వొకేట్‌ గుప్తా కోర్టుకు వివరించారు. జనగణన ద్వారా దేశంలోని జనాభా సంఖ్య ఆధారంగా మహిళలకు సీట్లను శాస్త్రీయంగా కేటాయించొచ్చని జస్టిస్‌ నాగరత్న తెలిపారు. అయితే ఈ ప్రక్రియను చట్టం అమల్లోకి రాకముందు చేయాల్సిందని గుప్తా ప్రతిస్పందించారు. ఇందుకు 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా మహిళలకు స్థానిక సంస్థల్లో ఇచ్చిన రిజర్వేషన్లను, అలాగే 77వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ ప్రమోషన్లలో ఇచ్చిన రిజర్వేషన్లను ఆమె ఉదహరించారు. అలాగే ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) పది శాతం రిజర్వేషన్‌ కూడా జనగణన డేటా ఎదురు చూడకుండానే జరిగిందని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -