Wednesday, January 7, 2026
E-PAPER
Homeజాతీయంవెనిజులాపై అమెరికా కన్ను ఎందుకు?

వెనిజులాపై అమెరికా కన్ను ఎందుకు?

- Advertisement -

ఆ దేశంతో ఘర్షణ వెనుక చమురు, డాలర్‌ రాజకీయాలు
నికోలస్‌ మదురోను అదుపులోకి తీసుకోవడం దీనిలో భాగమే!
యూఎస్‌ చర్యలపై నిపుణులు

గత కొంత కాలంగా వెనిజులాను లక్ష్యంగా చేసుకుంటూ అమెరికా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. డ్రగ్‌ నార్కో టెర్రరిజం, భద్రతా కారణాలను పేర్కొంటూ వేలెత్తి చూపే ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా పలు దాడులకూ పాల్పడింది. ఇప్పుడు వెనిజులా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్నది. అయితే వెనిజులాలో అపారమైన చమురు నిల్వలు, డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఆ దేశం చేస్తున్న చమురు విక్రయ ప్రయత్నాలే అమెరికా సైనిక చర్యకు అసలు కారణాలుగా అంతర్జాతీయ అంశాలపై అవగాహన కలిగిన పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

న్యూఢిల్లీ : కొత్త ఏడాదిలో ప్రపంచ శాంతి స్థాపనే తన లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ న్యూఇయర్‌ సందర్భంగా చెప్పారు. ఆయన ఆ మాట చెప్పిన 72 గంటల్లోనే అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఈనెల 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్నది. ఇది లాటిన్‌ అమెరికాలో దశాబ్దాల తర్వాత జరిగిన అతిపెద్ద అమెరికా సైనిక జోక్యంగా మారింది. ఈ చర్య వెనుక భద్రతా కారణాలకన్నా చమురు రాజకీయాలు, ముఖ్యంగా పెట్రోడాలర్‌ వ్యవస్థకు వెనిజులా విసిరిన సవాల్‌ కీలకంగా మారిందని నిపుణులు చెప్తున్నారు.

వెనిజులా చమురు ఉత్పత్తిదారు మాత్రమే కాదు…
వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద నిర్ధారిత చమురు నిల్వలు కలిగిన దేశం. గ్లోబల్‌ ఎనర్జీ డేటా ప్రకారం.. అక్కడ సుమారు 303 బిలియన్‌ బ్యారెల్స్‌ చమురు నిల్వలు ఉన్నాయి. ఇది అమెరికా చమురు నిల్వల కన్నా ఐదు రెట్లు ఎక్కువ. ఇటీవలి సంవ్సతరాలలో, వెనిజులా.. అమెరికన్‌ డాలర్‌ను పక్కన పెట్టి చైనా యువాన్‌, డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థలను ఉపయోగించి చమురు విక్రయించేందుకు ప్రయత్నించింది. అపారమైన చమురు సంపద, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం అనే ఈ రెండు అంశాలు వెనిజులాను ఒక బృహత్తర ఆర్థిక, వ్యూహాత్మక చర్చకు కేంద్రంగా నిలిపాయి.

పెట్రోడాలర్‌ అంటే ఏమిటి?
ఒకసారి ఊహించండి.. ప్రపంచమంతా భూమిపై అత్యంత ముఖ్యమైన వస్తువును కొనడానికి కేవలం ఒకే కంపెనీ వోచర్లను ఉపయోగించాల్సి వస్తే ఎలా ఉంటుంది. ఆ సమయంలో ఆ కంపెనీ ఆధిపత్యం పెరిగిపోతుంది. గత 50 ఏండ్లుగా పెట్రోడాలర్‌ వ్యవస్థ కూడా సరిగ్గా ఇలాగే ఉంది. 1970 నుంచి ప్రపంచ చమురు వ్యాపారం ఎక్కువగా అమెరికన్‌ డాలర్‌లోనే జరుగుతోంది. దీనినే పెట్రోడాలర్‌ వ్యవస్థ అంటారు. చమురు కొనాలంటే దేశాలు ముందుగా డాలర్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

ఒక దేశానికి రవాణా, శక్తి, పరిశ్రమల రంగాలలో చమురు చాలా తప్పనిసరి. దీంతో ప్రపంచవ్యాప్తంగా డాలర్‌కు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటోంది. చమురు ఎగుమతి దేశాలు తాము పొందిన డాలర్లను తిరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థలో, ప్రధానంగా అమెరికా ప్రభుత్వ బాండ్లు, ఫైనాన్షియల్‌ మార్కెట్ల ద్వారా పెట్టుబడులుగా పెడతాయి. ఇది నిరంతరాయంగా జరుగుతోంది. ఈ చక్రం వల్ల డాలర్‌ ప్రపంచ ప్రధాన కరెన్సీగా కొనసాగుతోంది. ఫలితంగా అమెరికా తక్కువ వడ్డీ రేట్లతో భారీగా అప్పులు తీసుకునే అవకాశం పొందుతోంది. మొత్తానికి ఈ వ్యవస్థ అమెరికాకు చాలా అనుకూలంగా ఉన్నది.

సౌదీ అరేబియా నుంచి సంకేతాలు
2024లో సౌదీ అరేబియా పెట్రోడాలర్‌ వ్యవస్థకు ముగిం పు పలికిందన్న కథనాలు వచ్చాయి. అధికారిక ఒప్పందం ముగి యకపోయినా, సౌదీ అరేబియా ఇతర కరెన్సీల్లో చమురు విక్రయాలపై ఆలోచన మొదలుపెట్టింది. చైనాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారం ఎక్కువగా డాలర్లలోనే కొనసాగుతున్నా.. చమురు ఉత్పత్తి దేశాల్లో మార్పు నెమ్మదిగా మొదలైందని విశ్లేషకులు చెప్తున్నారు. యూఎస్‌ కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న ఆలోచన, ధైర్యం ఆయా దేశాలకు కలిగిందని అంటున్నారు.

గతంలోనూ అమెరికా జోక్యాలు
అమెరికా సైనిక, రాజకీయ జోక్యాలకు బలైన చమురు సంపన్న దేశాలలో వెనిజులా మొదటిది కాదు. 2003లో ఇరాక్‌పై అమెరికా చర్యలకు దిగింది. భద్రతా కారణాల పేరుతో సమర్థించుకునే యత్నం చేసినా.. ఇందులో చమురు నియంత్రణ కీలకపాత్ర పోషించింది. ఇక 2011లో లిబియాలో నాటో జోక్యం చేసుకున్నది. ఆ తర్వాత చమురు సంపన్న దేశమైన లిబియా దీర్ఘకాలిక రాజకీయ అస్థిరతలో చిక్కుకున్నది. చమురు వనరులపై నియంత్రణ కోల్పోవడమే దేశాన్ని అస్తవ్యస్తం చేసిందని నిపుణులు చెప్తున్నారు. ఇక క్యూబాలో పరిమిత చమురు నిల్వలే ఉన్నప్పటికీ.. ఆ దేశంపై దశాబ్దాల పాటు అమెరికా ఆంక్షలు కొనసాగాయి. ఇవి కేవలం ఆర్థిక ఆంక్షలు కాకుండా, లాటిన్‌ అమెరికా ప్రాంతంపై వ్యూహాత్మక నియంత్రణ సాధించాలన్న లక్ష్యంతో విధించబడ్డాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ ఉదాహరణలన్నీ చమురు వంటి శక్తి వనరులు ఎలా దేశాల విదేశాంగ విధానాలతో ముడిపడి ఉంటాయో స్పష్టంగా చూపిస్తున్నాయి.

వెనిజులా ఘటన ఏం చెప్తున్నది?
వెనిజులా ఘటన చమురు, డబ్బు, సైనికశక్తి మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. పెట్రోడాలర్‌ వ్యవస్థ ఆధిపత్యం ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేనప్పటికీ… దాని ఆధిపత్యంపై ప్రశ్నలు మరింత బహిరంగంగా వినిపిస్తున్నాయి. దీని ఫలితంగా ప్రపంచ ఎనర్జీ ట్రేడ్‌లో నెమ్మదిగా, కీలకమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయనీ, అది అమెరికాకు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.

డాలర్‌ వ్యవస్థకు వెనిజులా సవాల్‌
ఏండ్ల తరబడి ఆంక్షలను ఎదుర్కొన్న వెనిజులా.. డాలర్‌ ఆధారిత వ్యవస్థను తప్పించేందుకు కొత్త మార్గాలను అన్వేషించింది. యువాన్‌, యూరో, డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించడం ద్వారా అమెరికా నియంత్రణలో లేని లావాదేవీలు చేపట్టింది. వెనిజులా చమురులో ఎక్కువ భాగం కొనుగోలు చేసే చైనా ఈ మార్పునకు మద్దతిచ్చింది. ఆంక్షలు ఉన్నప్పటికీ.. వెనిజులా రోజుకు సుమారు 9 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని కొనసాగించింది. ఇది డాలర్‌పై ఆధారపడకుండా ఒక చమురు సంపన్న దేశం వ్యవస్థను కొనసాగించగలదని చూపించింది. ఇది అమెరికాలో వణుకు పుట్టించింది. ఇతర దేశాలు కూడా వెనిజులా దారిలోనే పయనించొచ్చన్న ఆందోళన వాషింగ్టన్‌లో కలిగింది.

పెట్రోడాలర్‌ ఎందుకు అమెరికాకు కీలకం?
పెట్రోడాలర్‌ వ్యవస్థ వల్ల అమెరికాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లతో అప్పులు, భారీ ప్రభుత్వ ఖర్చులకు అవకాశం, ప్రపంచంపై అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని బలోపేతం చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. డాలర్‌ ఆధారిత చమురు వ్యాపారం వల్లే అమెరికా ఆంక్షలు, ఆస్తుల స్వాధీనం వంటి ఆర్థిక ఆయుధాలను సమర్థవంతంగా వినియోగించగలుగుతోంది. ఒకవేళ ఆయా దేశాలు ఆయిల్‌ కొనుగోళ్లను డాలర్‌తో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చేపడితే అమెరికాకు ఈ ప్రత్యేక ప్రయోజనాలు పలుచన కావడం, దూరమవ్వటం వంటివి జరుగుతాయి. కాబట్టి డాలర్‌ను పక్కనబెట్టే ప్రయత్నాలు అమెరికా దృష్టిలో కేవలం వ్యాపార నిర్ణయాలుగా కాకుండా వ్యూహాత్మక సవాళ్లుగా మారుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -