దేశంలో చుట్టుముడుతున్న ఆరోగ్య సంక్షోభం కేంద్ర పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఎందుకంటే, ఏ ప్రభుత్వానికైనా ప్రజల ఆరోగ్యమే మౌలిక బాధ్యత. కానీ, ఆ బాధ్యతనుంచి రోజురోజుకూ తప్పించుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. తాజా కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే, ఆరోగ్యం పేరుతో ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తూనే, అదే స్థాయిలో ఆ రంగానికి నిధులు కేటాయిం చడంలో వెనుకంజ వేసింది. ముఖ్యంగా ”హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్సు” పేరుతో వసూలు చేస్తున్న మొత్తం, ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి తగిన విధంగా వినియోగించబడటం లేదన్న విమర్శలకు తాజా గణాంకాలే నిదర్శనం. ప్రస్తుతం ఆదాయపన్ను, కార్పొరేట్ పన్నులపై నాలుగు శాతం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్సును కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. 2023- 24లో ఈ సెస్సు ద్వారా సుమారు ఒక లక్షా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వసూలయ్యాయి.
2024-25లో ఇది లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. 2026 బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ ఆదాయం లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలను దాటే అవకాశం ఉంది. అంటే ప్రజలు ప్రతి సంవత్సరం లక్ష కోట్లకు పైగా మొత్తాన్ని ప్రత్యేకంగా ”ఆరోగ్యం” పేరుతో చెల్లిస్తున్నారు.అయితే ఇదే బడ్జెట్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం సుమారు తొంభై రెండు వేల కోట్ల రూపాయలకే పరిమితమైంది. ఆరోగ్యసెస్సు ద్వారా వసూలు చేస్తున్న మొత్తంతో పోలిస్తే ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు తక్కువగా ఆరోగ్య రంగానికి నేరుగా కేటాయిస్తున్నారు. ఇది కేవలం లెక్కల తేడా కాదు, ఆరోగ్యం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఎంత వెనుకబడి ఉందో చెప్పే స్పష్టమైన సూచిక.
కేంద్రం, రాష్ట్రాలు కలిపి ప్రభుత్వ ఆరోగ్య వ్యయం దేశ జీడీపీలో ఇంకా రెండు శాతంలోపే ఉంది. జాతీయ ఆరోగ్య విధానం-2017 ప్రకారం 2025 నాటికి ఈ వ్యయాన్ని జీడీపీలో రెండున్నర శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, తాజా బడ్జెట్ తర్వాత కూడా ఆ లక్ష్యం నెరవేరలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఐదు శాతం లక్ష్యంతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడి ఉంది. ప్రభుత్వ ఆరోగ్య వ్యయం తక్కువగా ఉండటంతో దాని ప్రభావం నేరుగా ప్రజలపై పడుతోంది. ప్రస్తుతం దేశంలో మొత్తం ఆరోగ్య ఖర్చుల్లో వ్యక్తిగత జేబు ఖర్చు సుమారు నలభై ఏడు శాతం వరకు ఉంది. అధికారిక ఆరోగ్య ఖాతాల ప్రకారం ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఏడు కోట్ల మంది వైద్య ఖర్చుల కారణంగా పేదరికంలోకి జారిపోతున్నారు.
ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో కీలకమైన భాగమైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్ల పరిస్థితి కూడా ఆందోళన కలిగించేదే. కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నప్పటికీ, వాటికి తగిన నిధులు, అధ్యాపకులు, పరికరాలు సమకూరడం లేదు. అనేక కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరత, ల్యాబ్‌లు, లైబ్రరీలు, హాస్టళ్ల లోపం స్పష్టంగా కనిపిస్తోంది. టీచింగ్ హాస్పిటళ్లలో పడకలు, ఐసీయూ సదుపాయాలు, ఆధునిక పరికరాల కొరత వల్ల రోగుల సంరక్షణతో పాటు వైద్య విద్య నాణ్యత కూడా దెబ్బతింటోంది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులపై రోగుల భారం రోజురోజుకీ పెరుగుతోంది. కానీ, ఆ భారం మోయడానికి అవసరమైన బడ్జెట్, మానవ వనరులు అందుబాటులో లేవు. ఫలితంగా విద్యార్థులు సరైన క్లినికల్ అనుభవం పొందలేకపోతున్నారు, అధ్యాపకులు బోధనకంటే సేవల భారంతో అలసిపోతున్నారు.
ఇది భవిష్యత్తు వైద్యుల తయారీపైనే ప్రభావం చూపుతోంది. ఇంత జరుగుతున్నా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్సు ద్వారా వచ్చిన నిధులు చట్టపరంగా ప్రత్యేక ఆరోగ్యనిధిగా కేటాయించబడటం లేదు. ఈ మొత్తం కేంద్ర సమగ్రనిధిలో కలిసిపోతుంది. అంటే ఆరోగ్య పేరుతో వసూలు చేసిన డబ్బులో ఎంత భాగం నిజంగా ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, ప్రజారోగ్య కార్యక్రమాలకు ఖర్చయిందో ప్రజలకు స్పష్టమైన సమాచారం లేదు. ఈ పారదర్శకత లోపమే అసలు సమస్య. దేశంలో నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు మొత్తం మరణాల్లో అరవై శాతం కంటే ఎక్కువకు కారణమవుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు, వృద్ధుల ఆరోగ్య అవసరాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజారోగ్య వ్యవస్థను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బలోపేతం చేయడం తప్పనిసరి. కానీ, తాజా బడ్జెట్‌లో ఆ దిశగా అవసరమైన పెట్టుబడి కనిపించడం లేదు.
ప్రజల నుంచి ఆరోగ్యం పేరుతో ఏడాదికి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తూనే, అదే ఆరోగ్య రంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం పాలనా వైఫల్యమే తప్ప వేరేకాదు. హెల్త్ సెస్సు పెరుగుతున్నప్పుడు ఆరోగ్య వ్యయమూ అదే స్థాయిలో పెరగాలి. కానీ, ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఆరోగ్యం వెనుకబడినట్టే కనిపిస్తోంది. ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వం మోయాల్సిన చోట, అది నెమ్మదిగా ప్రజల జేబుల పైకి మళ్లుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. హెల్త్ సెస్సును ప్రత్యేక ఆరోగ్య నిధిగా మార్చి, ప్రతి రూపాయి ఎలా ఖర్చవుతుందో ప్రజలకు చెప్పే పారదర్శక వ్యవస్థ కావాలి. అది లేకపోతే, ఈ సెస్సు ప్రజల ఆరోగ్యానికి కాదు, బడ్జెట్ లెక్కలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ప్రజల ప్రాణాల మీద వసూలు చేసే పన్నుకు ఇది తగిన న్యాయం కాదు.
డాక్టర్ ఎం.రమాదేవి
9490300863



