Friday, January 23, 2026
E-PAPER
Homeఆటలుజోరు సాగేనా?

జోరు సాగేనా?

- Advertisement -

మరో విజయంపై భారత్‌ గురి
న్యూజిలాండ్‌తో రెండో టీ20 నేడు
రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

టీ20 సిరీస్‌లో అదిరే విజయంతో బోణీ కొట్టిన టీమ్‌ ఇండియా.. రాయ్ పూర్‌లో సిరీస్‌కు చేరువ కావాలనే లక్ష్యంతో ఆడనుంది. బ్యాట్‌తో, బంతితో కివీస్‌ను చిత్తు చేసిన భారత్‌ అదే జోరు కొనసాగించాలని ఎదురుచూస్తుంది. తొలి మ్యాచ్‌లో తేలిపోయిన న్యూజిలాండ్‌ నేడు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత్‌, న్యూజిలాండ్‌ రెండో టీ20 నేడు.

నవతెలంగాణ-రాయ్ పూర్‌
అమీతుమీ తప్పదనిపించిన టీ290 సమరం నాగ్‌పూర్‌లో ఏకపక్షంగా ముగిసింది. ఆతిథ్య భారత్‌ బ్యాట్‌తో, బంతితో తిరుగులేని ప్రదర్శన చేసింది. న్యూజిలాండ్‌తో బ్యాట్‌తో ఫర్వాలేదనిపించినా.. బంతితో పూర్తిగా తేలిపోయింది. పొట్టి ఫార్మాట్‌లో కివీస్‌, భారత్‌ నాణ్యమైన జట్లు. గత మ్యాచ్‌ ప్రభావం నేడు పెద్దగా ఉండకపోవచ్చు. దీంతో ఇటు భారత్‌, అటు న్యూజిలాండ్‌ గెలుపు వేటలో మరో ఉత్కంఠ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గితే భారత్‌ సిరీస్‌కు చేరువ కానుండగా.. న్యూజిలాండ్‌కు మరింత కఠినంగా ఉండనుంది. భారత్‌కు అభిషేక్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, జశ్‌ప్రీత్‌ బుమ్రా కీలకం కాగా.. డార్లీ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, జాకబ్‌ డఫ్ఫీ, మిచెల్‌ శాంట్నర్‌లు న్యూజిలాండ్‌కు కీలకం.

కెప్టెన్‌ మెరిసేనా?
టీ20 ఫార్మాట్‌లో భారత్‌ భీకర ఫామ్‌లో ఉంది. వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ ఇండియాకు నాయకుడి ఫామ్‌ ఆందోళనగా మారింది. గత ఏడాది ఆస్ట్రేలియాపై 39 పరుగుల ఇన్నింగ్స్‌ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ ఉత్తమ గణాంకాలు న్యూజిలాండ్‌పై నాగ్‌పూర్‌లోనే సాధించాడు. తొలి టీ20లో 32 పరుగులు చేసిన సూర్య 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిశాడు. నం.3 స్థానం ఇషాన్‌ కిషన్‌కు వదిలేసిన సూర్య.. నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. నాణ్యమైన కివీస్‌ బౌలర్లపై ఫామ్‌ సాధిస్తేనే రానున్న టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు అవకాశం మెండు. అందుకే ఈ సిరీస్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌ భారత్‌కు అత్యంత కీలకం.

దేశవాళీ మెరుపులతో నేరుగా టీ20 ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కించుకున్న ఇషాన్‌ కిషన్‌.. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఐదు బంతుల్లో రెండు బౌండరీలు బాదినా.. వికెట్‌ నిలుపుకోలేదు. మరో ఓపెనర్‌ సంజు శాంసన్‌ సైతం తొలి మ్యాచ్‌లో అంచనాలను అందుకోలేదు. లోయర్‌ ఆర్డర్‌లో రింకు సింగ్‌ ఫినిషర్‌గా సత్తా చాటాడు. 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. అభిషేక్‌ శర్మ, రింకు సింగ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. నేడు సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌లు మెరిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌ విభాగంలో జశ్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌లు గొప్పగా రాణిస్తున్నారు. అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి మాయాజాలంతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సమిష్టిగా రాణిస్తే రాయ్ పూర్‌లో భారత్‌ 2-0 ఆధిక్యం అందుకోవటం లాంఛనమే.

పుంజుకుంటారా?
భారత్‌లో ఏడాది వ్యవధిలో చారిత్రక టెస్టు, వన్డే సిరీస్‌ విజయాలు సాధించిన న్యూజిలాండ్‌.. టీ20 సిరీస్‌ను సైతం టైటిల్‌పై కన్నేసి షురూ చేసింది. కానీ తొలి మ్యాచ్‌లోనే ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌ చేతిలో 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గ్లెన్‌ ఫిలిప్స్‌ జోరు కొనసాగించాడు. కానీ ఇతర బ్యాటర్లు విఫలం అయ్యారు. డెవాన్‌ కాన్వే, టిమ్‌ రాబిన్సన్‌ సహా రచిన్‌ రవీంద్ర, డార్లీ మిచెల్‌లు రాణిస్తే న్యూజిలాండ్‌ గట్టి పోటీ ఇవ్వగలదు. బౌలర్లలో జాకబ్‌ డఫ్ఫీ మినహా ఎవరూ పెద్దగా ప్రభావం చూపించలేదు. కైల్‌ జెమీసన్‌, ఇశ్‌ సోధి, మిచెల్‌ శాంట్నర్‌లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. భారత బ్యాటర్లను కట్టడి చేసేందుకు బౌలర్లు నేడు స్పష్టమైన ప్రణాళికలతో రావాల్సి ఉంది. లేదంటే, నాగ్‌పూర్‌ టీ20 ఫలితం పునరావృతం ఖాయం.

తుది జట్లు (అంచనా)
భారత్‌ : అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హర్దిక్‌ పాండ్య, శివం దూబె, రింకు సింగ్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
న్యూజిలాండ్‌ : డెవాన్‌ కాన్వే (వికెట్‌ కీపర్‌), టిమ్‌ రాబిన్సన్‌, రచిన్‌ రవీంద్ర, గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్‌, డార్లీ మిచెల్‌, మిచెల్‌ శాంట్నర్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌, కైల్‌ జెమీసన్‌, ఇశ్‌ సోధి, జాకబ్‌ డఫ్ఫీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -