Sunday, September 21, 2025
E-PAPER
Homeజాతీయంఫిర్యాదు చేస్తే వేటు వేస్తారా?

ఫిర్యాదు చేస్తే వేటు వేస్తారా?

- Advertisement -

ఇది ప్రతీకార చర్యే
ఆ మహిళా ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
సాహిత్య అకాడమీ చర్యను తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు
అకాడమీ కార్యదర్శి మీద లైంగికవేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశం

న్యూఢిల్లీ : లైంగికవేధింపులకు గురి చేశాడని సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌. కె శ్రీనివాస్‌రావుపై గతంలో ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిపై వేటు వేయడాన్ని ‘ప్రతీకార చర్య’గా ఢిల్లీ హైకోర్టు అభివర్ణించింది. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనీ, ఈ అంశంపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. శ్రీనివాస్‌రావు 2018లో తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ సదరు మహిళ స్థానిక ఫిర్యాదుల కమిటీ (ఎల్‌సీసీ)కి కూడా ఫిర్యాదు చేసింది. అయితే పేలవమైన పనితీరును కారణంగా పేర్కొంటూ అకాడమీ సదరు మహిళను 2020లో సర్వీసు నుంచి తొలగించింది. అయితే ఇటీవల ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అకాడమీ చర్యను న్యాయస్థానం తప్పుబట్టింది. అకాడమీ తీరు అన్యాయం, చట్టవ్యతిరేకమే కాకుండా ప్రతీకార చర్య అని అభివర్ణించింది.

అలాగే అకాడమీ, కార్యదర్శి ఇద్దరూ చేసిన వాదనలను పూర్తిగా తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఆ మహిళను తిరిగి తన సర్వీసులో చేరేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఉత్తర్వుల నుంచి అకాడమీ, కార్యదర్శి పేర్లను తొలగించాలని ఆదేశించిన న్యాయస్థానం.. వారి గురించి నివేదించే విషయంలో మాత్రం ఎలాటి ఆంక్షలనూ విధించలేదు. అయితే ఈ విషయంలో దర్యాప్తును సాహిత్య అకాడమీ వ్యతిరేకించింది. ఎల్‌సీసీ న్యాయపరిధిని ప్రశ్నించింది. ఈ అంశాన్ని అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ద్వారా పరిష్కరించాలని అకాడమి తెలిపింది. అయితే అకాడమీ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దర్యాప్తు నిర్వహణ ఎల్‌సీసీ పరిధిలో ఉంటుందనీ, ఐసీసీకి సంబంధం లేదని స్పష్టం చేసింది.

సదరు మహిళ ఫిబ్రవరి 2018లో అకాడమీలో విధుల్లో చేరింది. అయితే అదే అకాడమీ కార్యదర్శి నుంచి వరుస లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. అలాగే సీనియర్‌ అధికారులు, అకాడమీ అధ్యక్షులు, ఎస్‌సీసీ సభ్యుల పైనా ఆమె ఆరోపణలు చేసింది. తన ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా వీరు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. ఆమెను విధుల నుంచి తొలగించిన ఆదేశాలను కొట్టివేసిన న్యాయస్థానం.. పెండింగ్‌లో ఉన్న ఆమె వేతన బకాయిలను నాలుగువారాల్లోగా ఆమెకు అందేలా చూడాలని వివరించింది. ఎల్‌సీసీ ద్వారా సురక్షితమైన పని వాతావరణం ఏర్పడేవరకు ఆమె పెయిడ్‌ లీవ్‌లో ఉన్నట్టుగా చూడాలని తెలిపింది. ఈ అంశం ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉన్నందును తాను మాట్లాడకూడదనీ, కోర్టు ధిక్కరణ అవుతుందని శ్రీనివాస్‌రావు చెప్పటం గమనార్హం.
కాగా శ్రీనివాస్‌రావుపై ఆరోపణలు వచ్చి, దీనిపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ.. ఆయనకు ప్రభుత్వాల నుంచి గౌరవాలను అందుకుంటుండటం గమనార్హం. గత నెల 23న బీహార్‌ ప్రభుత్వం ఆయనకు బాబు గంగా శరణ్‌సింగ్‌ అవార్డును ప్రదానం చేసింది. అంతక ముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో స్వాగతించే కార్యక్రమంలో ఆయన అన్నారు. రష్యాలో జరిగిన 2024 బ్రిక్స్‌ సాహిత్య ఫోరమ్‌లో శ్రీనివాస్‌రావు భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -