‘అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు’ అని ఓ పాత సామెత. ప్రస్తుతం దేశంలోని రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుకు ఇది సరిగ్గా అతికినట్టుంది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను అమ్మలా అక్కున చేర్చుకోవాల్సిన మోడీ సర్కార్ వారిపై కక్ష కట్టింది. పైగా ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలపై నియంతృత్వపు కొరడా ఝళిపిస్తోంది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం తమ రాష్ట్రంలోని వరి రైతులకు ఇస్తున్న బోనస్‌ను వెంటనే నిలిపి వేయాలంటూ కేంద్రం హుకూం జారీ చేసింది. పండిన పంటకు లాభాల వర్షం కురిపిస్తానంటూనే బీజేపీ సర్కార్ రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించింది. కేంద్రం ఎలాగో పట్టించుకోవడం లేదు, కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా రైతులకు అండగా నిలబడుతుంటే, అదీ భరించలేక పోతోంది. ఇలా ఉత్తర్వుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలపై నియంతృత్వంగా వ్యవహరిస్తూ రైతుల కడుపు కొడుతున్నది.
వాస్తవానికి వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నంలో ఉంది కేంద్ర సర్కారు. ఆ కుట్రలో భాగంగానే గతంలో మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చింది. వీటికి వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున తిరగబడింది. దిమ్మతిరిగిన మోడీ సర్కారు కాస్త వెనక్కు తగ్గింది. కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని స్పష్టమైన హామీ కూడా ఇచ్చింది. కానీ దాన్ని ఎప్పుడో అటకెక్కించింది. రైతులను వ్యవసాయా నికి దూరం చేసేందుకు కుట్రలు సాగిస్తోంది. ఏదో ఒక రూపంలో రైతులను ఇబ్బందులు పెట్టి ‘ఇక మేము ఈ వ్యవసాయం చేయలేము బాబో’ అనేట్టు చేయదల్చుకుంది. భారం భరించలేక రైతులు తప్పుకుంటే వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు గద్దలా కాచు కూర్చున్నది. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్ చట్టంలో సవరణలు తీసుకొచ్చి వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టింది. కరెంటు బిల్లుల రూపంలో రైతుల రక్తాన్ని జలగల్లా పట్టి పీడుస్తున్నది. మిగిలిన రాష్ట్రాలను కూడా భయపెట్టో, బుజ్జగించో తమ పంచన చేర్చుకోవాలని చూస్తున్నది. అయితే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ పప్పులుడకడం లేదు. ఇందులో కేరళ కొరకరాని కొయ్యగా మారింది.అదే కేంద్రానికి కడుపుమంటగా మారింది కాబోలు!
బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, ముఖ్యంగా రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడంలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది. ఒకపక్క సాగు ఖర్చులు పెరిగిపో యాయి. మరో పక్క కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర చాలక రైతులు అప్పులపాలవు తున్నారు. అందుకే కేరళ ప్రభుత్వం రైతులకు బోనస్ అందిస్తూ అండగా నిలిచింది. దాంతో ఆ రాష్ట్రం మోడీ కంట్లో నలుసుగా మారింది. అందుకే ఉత్తర్వుల రూపంలో హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే బోనస్ ఆపివేయకపోతే ధాన్యం కొనుగోలు చేసేదే లేదని బెదిరింపులకు పాల్పడింది. అయితే కేంద్రం తమపై ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతులకు కనీస మద్దతు ధరతో పాటు బోనస్ కూడా కచ్చితంగా చెల్లించి తీరుతామని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. కేంద్రం కొనుగోలు చేయకపోతే సహకారం సంఘాల ద్వారా పైలట్ పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేసుకోవాలని నిర్ణయించుకుంది. గతంలోనూ కేంద్రం పెట్టిన ఇలాంటి ఎన్నో ఆంక్షలను కేరళ తిప్పికొట్టింది. తన రాష్ట్ర ప్రజాప్రయోజనాలకే మద్దతిచ్చింది. ఇది కదా అసలైన ప్రజానుకూల ప్రభుత్వమంటే.
తన అనుంగు మిత్రులైన కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలు రాయితీలిస్తున్న మోడీకి, రైతులను ఆదుకుంటే మాత్రం మింగుడు పడడం లేదు. ఇప్పటికే రైతులకు బోనస్ ఇస్తున్న రాష్ట్రాలలో కేరళ, తెలంగాణతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే గుజరాత్, రాజస్థాన్‌లో కూడా కొద్దో గొప్పో బోనస్ అందిస్తున్నారు. అయితే ఈ రాష్ట్రాల వారికి ఎవ్వరికీ అందని ఉత్తర్వులు కేవలం ఒక్క కేరళకు మాత్రమే ఎందుకు జారీ చేశారో ఆలోచిం చాల్సిన అవసరమైతే ఉంది. అంటే కేంద్ర సర్కారు ముందు బీజేపీయేతర రాష్ట్రాలనే టార్గెట్ చేసిందనేది ఇక్కడ స్పష్టం. త్వరలో తెలంగాణపై కూడా ఆంక్షలు విధించే ప్రమాదం లేకపోలేదు!
సామాన్యులకు అండగా నిలబడుతున్న రాష్ట్ర ప్రభుత్వా లపై ఆంక్షలు పెట్టేందుకు, ప్రశ్నలను కట్టడి చేసేందుకు మోడీ సర్కారు రోజురోజుకూ బరితెగిస్తోంది. ఇందులో కేరళ రాష్ట్రంపై ఆంక్షలు ఒకటైతే, పీఎం కేర్స్‌ను పార్లమెంటులో ప్రశ్నించే హక్కు లేదంటూ లోక్‌సభ సచివాలయానికి ఉత్తర్వులు జారీ చేయడం మరో దారుణం. అంటే మోడీ సారథ్యంలో నడిచే సహాయ నిధుల వివరాలను ఎవరూ ప్రశ్నించడానికి వీలు లేదని అల్టిమేట్ ఇచ్చింది. కేంద్రం అనుసరిస్తున్న ఈ నియంతృత్వ పోకడలు ఇలాగే కొనసాగితే దేశం మరింత ప్రమాదంలోకి నెట్టివేయబడటం ఖాయం. కనుక ఈ రకమైన చర్యలను ప్రజామద్దతుతో ఎదుర్కోవాలి.
రైతుల కడుపు కొడతారా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



