ఎన్నికలవేళ ఇరాన్‌పై దాడులు
రక్షణాత్మక చర్యేనని సమర్ధించుకున్న అమెరికా
టెహ్రాన్ : మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడి చేయబోమంటూ పలు సందర్భాలలో చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ తాజాగా దానిని బేఖాతరు చేశారు. కీలకమైన మధ్యంతర ఎన్నికల పోలింగ్‌కు కొద్ది గంటలు మాత్రమే వ్యవధి ఉన్న తరుణంలో అమెరికా సేనలు సోమవారం రాత్రి ఇరాన్‌పై దాడి చేశాయి. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఖెష్మ్ దీవిలోలక్ష్యాలపై దాడి చేశామని వాషింగ్టన్ తెలిపింది. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక ఆస్తులను పరిరక్షించుకోవడానికి చేపట్టిన రక్షణాత్మక చర్యగా ఈ దాడులను అభివర్ణిం చింది. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ సేనలు క్షిపణులను ప్రయోగి స్తున్నాయని, ఈ చర్యకు వ్యతిరేకంగా తాము రక్షణాత్మక దాడులు చేశామని సమర్ధించుకుంది. కాగా అమెరికా దాడుల కారణంగా దీవిలో వెంటవెంటనే పేలుడు శబ్దాలు వినిపించాయని ఇరాన్ మీడియా తెలియజేసింది. ఓడరేవు నగరమైన బందర్ లెంగెహ్లో కూడా పేలుళ్లు జరిగాయని చెప్పింది. ఖెష్మ్పై రెండు యుద్ధ విమానాలు ఎగరడం చూశామని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అయితే ఇవి తీవ్రమైన దాడులేమీ కావు. ఈ ఏడాది ఫిబ్రవరి - ఏప్రిల్ మధ్య కాలంలో ఇరాన్‌పై అమెరికా జరిపిన సైనిక చర్యలతో పోలిస్తే వీటి తీవ్రత చాలా తక్కువ. ఖెష్మ్ దీవి మీదుగా వచ్చిన రెండు అమెరికా నిఘా డ్రోన్లను, హార్ముజ్ జలసంధికి తూర్పున మరో డ్రోన్‌ను కూల్చివేశా మని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తెలిపింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని దక్షిణ తీరంలో ఉన్న ఖెష్మ్ దీవి ఇరాన్ సైన్యానికి కీలక వ్యూహాత్మక ఔట్‌పోస్టుగా ఉంటోంది.
మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌పై నియంత్రణ సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రిపబ్లికన్ పార్టీకి ట్రంప్ నిర్ణయాలు, చర్యలు రాజకీయ భారంగా మారాయి. ఇరాన్‌పై ట్రంప్ మొదలు పెట్టిన యుద్ధం కారణంగా దేశంలో ఇంధనం, సేవల ధరలు ఇప్పటికే బాగా పెరిగాయి. దీంతో అమెరికాలో జీవనవ్యయ సంక్షోభం తలెత్తిందన్న అభిప్రాయం కలుగుతోంది. ఇరాన్‌పై యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని రిపబ్లికన్ సెనెట్ అభ్యర్థులు అష్లే హిన్సన్ (అయోవా), మైక్ రోజర్స్ (మిచిగాన్) సహా పలువురు నేతలు కోరుతున్నప్పటికీ ట్రంప్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇరాన్‌పై పూర్తి స్థాయిలో దాడులు చేసే విషయాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. ఈ విషయంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. ఇదిలావుండగా యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తుల ద్వారా చర్చలు జరుగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారు. దౌత్య యత్నాలకైనా, సైనిక చర్యకైనా తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. దేనిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సింది అమెరికాయేనని ఆయన అన్నారు.







కామెంట్లు (0)