నవతెలంగాణ – హైదరాబాద్ : బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. యాపిల్ ఐఫోన్లను అసెంబుల్ చేసే ఫాక్స్‌కాన్ కంపెనీ ఫ్యాక్టరీలో ఓ యువతి తాను ప్రసవించిన పసికందును దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన దేవనహళ్లిలోని ఫ్యాక్టరీలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే… ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 19 ఏళ్ల రేణుక అనే యువతి టాయిలెట్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన వెంటనే, బిడ్డ గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని ఓ బ్యాగులో పడేసింది. ఈమె అవివాహిత కావడంతో సామాజిక అవమానానికి భయపడి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
కొంతసేపటి తర్వాత టాయిలెట్‌కు వెళ్లిన మరో ఉద్యోగిని, బ్యాగులో ఉన్న శిశువు మృతదేహాన్ని చూసి భయంతో పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విచారణ చేపట్టారు. శిశువు పుట్టిన తర్వాతే హత్యకు గురైనట్టు నిర్ధారించారు. విచారణలో నిందితురాలిని రేణుకగా గుర్తించి, ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.



