Sunday, November 2, 2025
E-PAPER

యువత

- Advertisement -

ఇటీవల కాలంలో విద్యార్థులు మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అలాగే ఆన్లైన్‌ బెట్టింగ్‌ల వంటి మోసాలకు గురవుతున్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చట్టపరమైనటువంటి అనేక నిబంధనలు ఉన్నప్పటికీ ఇవేవీ సమస్యను అదుపు చేయలేకపోతున్నాయి. బాధ్యతారాహిత్యం, ఉపాధి లేకపోవడం, తల్లిదండ్రుల అతిగారాబంతో పాటు మన విద్యా వ్యస్థలోని లోపాలు కూడా తోడయ్యి సమస్యలను మరింత పెంచుతున్నాయి. ఇలా కారణాలు ఏమైనప్పటికీ యువత చెడుమార్గం పడుతున్నారనేది మాత్రం వాస్తవం.

సిలబస్‌ యాంత్రికంగా ఉండడం, సంస్కృతి, నాగరికత, ఆరోగ్యం, నైతిక విలువలకు సంబంధించిన అంశాలు పాఠ్యాంశాల్లో లేకపోవడంతో ఉన్నత విద్యా విధానం చాలా మందికి ఆటవిడుపుగా మారిపోయింది. ఈ కారణంగా విద్యార్థుల్లో మానవీయ విలువలు కొరవడుతున్నాయి. సమాజ పోకడలను అవగాహన చేసుకోకపోవడం, స్వార్థం, త్వరగా సంపాదించాలనే అత్యాశతో కొన్ని తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. క్లబ్బులు, పబ్బులు వంటి వాటిని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం కూడా యువతను సృజనాత్మకత వైపుకు వెళ్లనీయడం లేదు. కారణంగా మానసిక ఒత్తిడికి గురౌతూ ప్రత్యామ్నాయాలు వెదుక్కొంటూ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. కండ్ల ముందు కనబడుతున్న తాత్కాలిక ఆనందానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. విలువైన జీవితాన్ని చిన్న వయసులోనే బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

ఎంతోమంది తల్లిదండ్రుల కడుపుకోతకు పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది యువత ఉన్న దేశం మనది. ఇలా గొప్పగా చెప్పుకోవడానికి తప్ప ఉత్పత్తిలో, సమాజ సంక్షేమంలో, అభివృద్ధిలో మన పాలకులు వారిని భాగస్వామ్యం చేయడం లేదు. దీనివల్ల దేశం ఎంత నష్టపోతున్నదో అర్థం చేసుకోవడం లేదు. యువత ఒత్తిడికి గురికావడం, ఆత్మన్యూనతకు బలైపోవడం అనేది కేవలం మన దేశానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. సౌత్‌ ఆస్ట్రేలియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఇటీవలి పరిశోధనల ఫలితాలను మనదేశానికి అన్వయించుకొని మన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత పాలకులకు ఉంది.

తొందరగా ఆవేశ పడడం, ఆత్మన్యూనతకు గురికావడం, తనను తాను బలహీనునిగా పరిగణించడం, జీవితంపై విరక్తి చెందడం, బాధ్యతల నుండి తప్పించుకోవడం వంటివి యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమస్య తీవ్రతను బట్టి బిహేవియర్‌ థెరపీతో పాటు మందులు కూడా ఇస్తున్నప్పటికీ కనీసం 40 శాతం యువతలో కూడా ఫలితం కనపడడం లేదని సౌత్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వారి పరిశీలన ప్రకారంగా సుమారు 32 వేల మంది యువతపై జరిపిన అధ్యయనం ప్రకారం ఒత్తిడిని ఎదుర్కొనడానికి వ్యాయామమే సరైన ఔషధం అని తేలింది.

శ్రమతో కూడిన ఏరోబిక్‌, బరువులు ఎత్తే వ్యాయామాలు వారిని అద్భుతంగా తీర్చిదిద్దగలవని నిరూపించారు. అలాగే నడక, జాగింగ్‌ లాంటి తేలికపాటి వ్యాయామాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. అంటే యువత తమ రోజువారి జీవితంలో వ్యాయామానికి కొంత సమయం కేటాయించగలిగితే చక్కటి ఫలితాలు ఉంటాయి. కనుక యువతను ఆ వైపుగా ప్రోత్సహించడంలో కుటుంబ సభ్యులు, విద్యా సంస్థలు బాధ్యత తీసుకోవాలి. వ్యాయామం కోసం ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అప్పుడే మనం ఆరోగ్యకరమైన యువతను దేశానికి అందించగలం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -