మహాసభల నేపథ్యంలో నల్లగొండ పట్టణం ఎర్రజెండాలు, ఎర్ర తోరణాలు, స్వాగత బ్యానర్లతో అరుణమయంగా మారుతోంది. ప్రతి పల్లె నుంచి ‘ఇంటికో మనిషి.. ఊరికో బండి’ అన్న పిలుపు గ్రామగ్రామాన రైతాంగంలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఎర్రచొక్కాలు ధరించి, ఎర్రజెండాలు చేతబూని మహాసభలకు తరలివచ్చేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ప్రచారం విస్తృతంగా సాగుతోంది. గోడ రాతలు, పోస్టర్లు, కరపత్రాల పంపిణీతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా మహాసభల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గ్రామాల్లో రైతు సంఘాల సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసమీకరణకు కృషి చేస్తున్నారు.
భూమి కోసం... భుక్తి కోసం... విముక్తి కోసం! నైజాం నిరంకుశ పాలనపై తిరగబడి, భూస్వాముల దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాటాల పురిటిగడ్డగా నిలిచిన నల్లగొండ మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. దొడ్డి కొమురయ్య, వీరనారి చిట్యాల ఐలమ్మ వంటి వీరుల త్యాగాలు, కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ నేల చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. ఆ పోరాట వారసత్వాన్ని నేటి రైతాంగ సమస్యలతో అనుసంధానిస్తూ నవంబర్ 15 నుంచి 18 వరకు జరగనున్న 36వ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు దేశవ్యాప్త రైతాంగ ఉద్యమానికి దిశానిర్దేశం చేయనున్నాయి. నాటి భూస్వామ్య దోపిడీపై ఎగిసిన తిరుగుబాటు స్ఫూర్తి, నేడు వ్యవసాయ సంక్షోభం, రైతుల హక్కుల పరిరక్షణ కోసం మరోసారి ప్రతిధ్వనించబోతోంది.
నల్లగొండ పేరు వినగానే గుర్తుకొచ్చేది వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. నైజాం నిరంకుశ పాలనలో భూస్వాములు, జమీందార్ల దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, పేద ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో సంఘటితమై తిరుగుబాటు చేశారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన ఆ మహాసంగ్రామంలో నాలుగు వేల మంది అమరులయ్యారు. మూడు వేల గ్రామాల్లో భూస్వామ్య ఆధిపత్యానికి చరమగీతం పాడి, పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత ఆ ఉద్యమానిది. స్వాతంత్ర్య సంగ్రామం, సాయుధ పోరాటం నుంచి అనేక ప్రజా ఉద్యమాలకు నల్లగొండ కేంద్ర బిందువుగా నిలిచింది. పోరాటాల చరిత్రతోపాటు ప్రాచీన కట్టడాలు, విశిష్ట సాంస్కృతిక వారసత్వం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి.
అప్పుల ఊబిలో అన్నదాత.. ఆగని ఆత్మహత్యలు
దేశ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, కూలీ ఖర్చులు పెరుగుతుండగా పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు లభించడం లేదు. కరువు, వరదలు, అకాల వర్షాలు, తెగుళ్లతో పంటలు దెబ్బతింటున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అప్పులు తీర్చే మార్గం కనిపించక, కుటుంబాలను పోషించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషాదం కొనసాగుతోంది. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) 2023 నివేదిక ప్రకారం దేశంలో 10,786 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 4,690 మంది రైతులు, 6,096 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఈ మరణాలు రైతు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయిన భార్యాపిల్లలు అప్పుల భారం, జీవనాధారం లేక మరింత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభానికి దారితీస్తున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిష్కరించి రైతులకు రుణ విముక్తి, గిట్టుబాటు ధర, పంటల బీమా, ఆదాయ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఏదీ?
22 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ అన్నింటికీ ప్రభుత్వ కొనుగోలు హామీ లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించి, దానికి చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో సాగిన చారిత్రక రైతాంగ ఉద్యమం వాటి ఉపసంహరణకు దారితీసింది. అయితే కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీతోపాటు ఇతర హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ప్రయత్నాలూ రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కార్పొరేట్ అనుకూల విధానాలు, విదేశీ వాణిజ్య ఒప్పందాలు దేశ వ్యవసాయ రంగంపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. తెలంగాణలోనూ రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, రైతుభరోసా నిధుల విడుదలలో జాప్యం, సాగునీటి కొరత, పంటల కొనుగోళ్ల సమస్యలు, పంట నష్టపరిహారం అందడంలో ఆలస్యం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కౌలు రైతులకు గుర్తింపు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందడం లేదు. మహిళా రైతులకు గుర్తింపు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలనే డిమాండ్లు కూడా కీలకంగా ఉన్నాయి.
తొమ్మిది దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం
1936లో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన అఖిల భారత కిసాన్ సభ తొమ్మిది దశాబ్దాలుగా రైతుల హక్కుల కోసం పోరాడుతోంది. భూమి, కూలి, గిట్టుబాటు ధర, రుణ విముక్తి, సాగునీరు వంటి సమస్యలపై రైతాంగాన్ని సంఘటితం చేస్తోంది. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఎనభై ఏళ్ల చారిత్రక సందర్భం తోడవడంతో ఈ మహాసభలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. గత పోరాటాల అనుభవాలను సమీక్షించడంతోపాటు భవిష్యత్ ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది. మహాసభల నేపథ్యంలో నల్లగొండ పట్టణం ఎర్రజెండాలు, ఎర్ర తోరణాలు, స్వాగత బ్యానర్లతో అరుణమయంగా మారుతోంది. ప్రతి పల్లె నుంచి ‘ఇంటికో మనిషి.. ఊరికో బండి’ అన్న పిలుపు గ్రామగ్రామాన రైతాంగంలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఎర్రచొక్కాలు ధరించి, ఎర్రజెండాలు చేతబూని మహాసభలకు తరలివచ్చేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ప్రచారం విస్తృతంగా సాగుతోంది. గోడ రాతలు, పోస్టర్లు, కరపత్రాల పంపిణీతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా మహాసభల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గ్రామాల్లో రైతు సంఘాల సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసమీకరణకు కృషి చేస్తున్నారు. ప్రతి ఇంటికీ మహాసభల సమాచారం చేరేలా కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. రైతులు మాత్రమే కాకుండా వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
భవిష్యత్ పోరాటాల వేదిక
నల్లగొండ పట్టణంలోని ప్రధాన కూడళ్లు ఎర్రజెండాలతో కళకళలాడుతున్నాయి. క్లాక్‌టవర్ సెంటర్లో మూడు రోజుల పాటు రైతులకు ఉపయోగపడే ప్రత్యేక ఎగ్జిబిషన్, వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రదర్శనలు, రైతులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రతినిధులకు వసతి, భోజనం, రవాణా వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఆహ్వాన సంఘం శ్రమిస్తోంది. పట్టణమంతా స్వాగత తోరణాలు, ఎర్రజెండాలు, అలంకరణలతో మహాసభల సందడిని సంతరించు కుంటోంది. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 12వందల మందికి పైగా ప్రతినిధులు పాల్గొనే ఈ మహాసభల్లో దేశవ్యాప్త రైతాంగ సమస్యలు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నారు. నవంబర్ 15న జరిగే భారీ బహిరంగ సభతో ఈ మహాసభలు ప్రారంభం కానున్నాయి. నాటి వీర తెలంగాణ పోరాట స్ఫూర్తిని గుర్తుచేస్తూ నల్లగొండలో జరగనున్న ఈ రైతాంగ సమాగమం దేశ వ్యవసాయ ఉద్యమ చరిత్రలో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలవనుంది.
జూలకంటి రంగారెడ్డి, 9490098349







కామెంట్లు (0)