Magazines

విద్వేషపు గంతలు

1 గంట క్రితం

Blindfolds
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 6 నిమిషాల చదవడం

సిఇసి జ్ఞానేష్ ‌కుమార్‌ ‌ను బర్తరఫ్‌ ‌చేయాలన్న డిమాండ్‌తో వామపక్ష విద్యార్ధి, యువజన సంఘాలు, కాక్రోచ్‌ ‌జనతా పార్టీ అక్టోబర్‌ 10‌వ తేదీన ప్రారంభించిన ఉద్యమం వెనుక ‘విదేశీ శక్తుల ప్రోద్బలం’ ఉందంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌వ్యాఖ్యానించడం ఊహించనిదేమీ కాదు. ఇక ఇతర చిన్నా చితకా బిజెపి నాయకులన బడే వారంతా అతడి బాటలోనే నడుస్తూ ఉద్యమ కారులందరూ సమాజంలో అరాచకత్వాన్ని సృష్టిస్తున్నారంటూ నిందించారు. అది ప్రజాస్వామ్య రక్షణ కోసం, సార్వత్రిక వోటింగ్‌ ‌హక్కు కోసం సాగుతున్న పోరాటం. అసలు ఉద్యమం చేయడం అనేదే ప్రజానీకపు ప్రజాస్వామిక హక్కు. అటువంటి ఉద్యమం చేయడం అరాచకత్వాన్ని రెచ్చగొడుతుందని నిందించడం, అది ‘జాతి’ ని బలహీనపరుస్తుందని ఆరోపించడం బిజెపి పనిగా పెట్టుకుంది. దాని ప్రకారం ఈ ఆందోళనలో పాల్గొంటున్న వారందరూ ‘‘జాతి వ్యతిరేకులు’’. ఇటువంటి వ్యాఖ్యలు ‌చేయడాన్ని కేవలం తిట్టిపోయడం గానో, ఉద్యమానికి వక్రభాష్యాలు చెప్పడంగానో మాత్రమే చూడలేం. బిజెపి ఆలోచనా విధానపు సారాంశానికి ఆ వ్యాఖ్యలు ‌ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఆ పార్టీ ఫాసిస్టు సిద్ధాంతపు సారాంశానికి అనుగుణంగానే ఈ కామెంట్లు ‌వస్తున్నాయి. ఈ ఫాసిస్టు సిద్ధాంతం ఎంత ప్రమాదకరమో అవి సూచిస్తున్నాయి. గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాలను, అందునా ముఖ్యంగా వారిలోని ‘‘నయా గుత్త పెట్టుబడిదారుల’’ ప్రయోజనాలను బాహాటంగా బలపరచడం, ప్రతిఘటించే శక్తి లేని మైనారిటీ ప్రజానీకాన్ని లక్ష్యంగా చేసుకుని వారిని ‘‘పరాయివారి’’గా చిత్రించి వారిపై మెజారిటీ ప్రజల్లో విద్వేషాన్ని సృష్టించడం, రాజ్య వ్యవస్థ యంత్రాంగంతోబాటు ఫాసిస్టు దుండగ మూకలను జత చేసి ప్రజలపైకి ఉసిగొల్పి ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి పూనుకోవడం-ఇవన్నీ ఫాసిస్టు లక్షణాలు.

వీటితోబాటు ‘‘నాయకుడి’’కి, ‘‘జాతి’’కి నడుమ ఉండవలసిన సంబంధాన్ని అది తలకిందులు చేసివేస్తుంది. జాతి లేదా దేశం అనేది ప్రజలకు చెందినదిగా ఫాసిజం పరిగణించదు. దానికి బదులు జాతి లేదా దేశం అనేది ‘‘నాయకుడికి’’ చెందినదిగా అది పరిగణిస్తుంది. అందుచేత ఎవరైతే నాయకుడికి వ్యతిరేకంగా నిరసిస్తారో వారంతా ఆటోమేటిక్‌ ‌గా జాతి ద్రోహులు లేదా దేశద్రోహులు అయిపోతారు! అటువంటి వారు చేసే కార్యక్రమాలన్నీ దేశద్రోహ కార్యక్రమాలుగా, ఎవరో ‘‘విదేశీ శక్తుల’’ పనుపున చేస్తున్న విగా, దేశానికి ప్రమాదకరంగా లెక్కించడం జరుగుతుంది. ఇటువంటి దృష్టిలోనే అప్రజాస్వామికత ఇమిడివుంది. అక్టోబర్‌ 10‌న డిల్లీలో నిరసనకారులు శాంతియుతంగా చేపట్టిన ఉద్యమం మీద ప్రభుత్వం విరుచుకుపడిన సందర్భంగా ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు ‘‘మనం నియంతృత్వ పాలనలో ఉన్నాం’’ అంటూ విమర్శించారు. ఈ విమర్శ ప్రస్తుత వాస్తవికతకు పూర్తి న్యాయం చేయడం లేదు. ఫాసిజం, లేదా ప్రస్తుత కాలపు నయా ఫాసిజం కేవలం నియంతృత్వం మాత్రమే కాదు. కొద్ది మధ్యతరగతి వర్గాల నుండి మనం వింటున్నట్టు ఇది ‘‘సమర్ధవంతమైన రీతిలో’’ సాగుతున్న నియంత పాలన కాదు. ఇక్కడ ఫాసిజం ‘‘జాతి’’ లేదా ‘‘దేశం’’ అన్నదానికి, ‘‘నాయకుడు’’ అన్నదానికి మధ్య ఉండే సంబంధాన్ని నిర్వచించే తీరు మౌలికంగానే ప్రజాస్వామ్యానికి బద్ధవిరుద్ధం.

వాల్టేర్‌ ‌బాజెహాట్‌ అనే 19వ శతాబ్దపు ఇంగ్లీషు మేథావి ప్రజాస్వామ్యం అంటే ‘‘చర్చల ద్వారా కొనసాగే పరిపాలన’’ అని నిర్వచించాడు. దీనినే ప్రొ. అమర్త్యసేన్‌ ఉటంకిస్తుంటారు. ప్రజాస్వామ్యాన్ని చూసే ఒకానొక సరైన దృక్కోణం అది. కాని ఫాసిజానికి లేదా నయా ఫాసిజానికి ఈ చర్చలంటేనే పడదు. ప్రభుత్వం అంటే ‘‘నాయకుడి ’’ ఇచ్ఛను వ్యక్తం చేసే యంత్రాంగం అని అది భావిస్తుంది. ఆ ‘‘నాయకుడు’’ తాను కావాలనుకుంటే ఇతరులను ఎవరినైనా సంప్రదించవచ్చు. అది వేరే విషయం (సాధారణంగా ఫాసిజం పెత్తనం నడుస్తున్నప్పుడు ‘‘నాయకుడు’’ ఉంటాడు తప్ప ‘‘నాయకురాలు’’ ఉండదు). కాని ‘‘చర్చల ద్వారా పరిపాలన’’ అనే భావననే అది నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. ఫ్రాన్స్‌ ‌దేశానికి ఒకప్పుడు రాజుగా ఉండిన 14వ లూయీ ‘‘రాజ్యం అంటే నేనే ’’ అని (లెటాట్‌ ‌సెస్ట్‌ ‌మొయ్‌ -ఫ్రెంచి భాషలో) ప్రకటించాడు. అది అప్పటి పురాతన ఫ్యూడల్‌ ‌దృక్పథం. అప్పట్లో రష్యాను పాలించిన జారు 1వ అలెగ్జాండర్‌....ఫ్రాన్స్‌ ‌చక్రవర్తి నెపోలియన్‌ ‌కు రాసిన లేఖలో ‘‘యూరప్‌ అంటే ఏమిటి? అది నువ్వు, నేను. అంతే’’ అని పేర్కొన్నాడు. ఇటువంటి భావజాలాన్ని ఈ ఆధునిక కాలంలో తిరిగి ప్రతిష్ఠించడానికి జరుగుతున్న ప్రయత్నానికి ప్రతిరూపమే నయా ఫాసిజం. రాజ్యం అంటే పాలకుడే అన్న భావం ఫ్యూడల్‌ ‌వ్యవస్థ మలి దశలో ముందుకొచ్చింది. అదే సమయంలో పెట్టుబడిదారీ వర్గం పుట్టుకొచ్చింది. దానితోబాటు ‘‘జాతి’’ (నేషన్‌) అన్నది కూడా రూపొందింది. ‘‘దైవాదేశంతో పాలించే ప్రభువు’’ అని అంతకు ముందువరకూ ఉండిన పాత భావన స్థానంలో ‘‘రాజ్యం అంటే నాయకుడు’’ అన్న భావన వచ్చింది.

ఈ కాలం చెల్లిన పాత దృక్పథాన్నే ఇప్పుడు నయా ఫాసిజం మళ్ళీ ముందుకు తెస్తోంది. అయితే ఒక్కటే తేడా. గతంలో పాలకుడు రాచకుటుంబానికి చెందినవాడైనందువలన పాలించడానికి అర్హత కలిగివుండేవాడు. ఇప్పుడు పాలకుడు రాచకుటుంబీకుడు కానవసరం లేదు. సాధారణ వ్యక్తి కూడా పాలకుడు కావచ్చు. తనను తాను చాయ్‌‌వాలా గా (నరేంద్ర మోడీ అభివర్ణించు కున్నట్టు) చెప్పుకునే వ్యక్తి కూడా పాలకుడు కావచ్చు. ఎవరైనప్పటికీ, అతగాడి చేతుల్లోనే అధికారం మొత్తం ఉంటుంది. ‘ప్రజలను బట్టి నాయకుడు’ అనే సూత్రాన్ని అటునుండి ఇటు తిరగేసి ‘నాయకుడే దేశం’ అనే విధంగా చేయడం వెనుక హేతుబద్ధతను ధ్వంసం చేయడం అనే మరింత విస్తృతమైన ధోరణి ఉంది. హేతుబద్ధతకు ఆధారం, లేదా సాక్ష్యం ప్రధానం. కాని ఫాసిజానికి సాక్ష్యం లేదా రుజుత్వం అంటేనే తీవ్ర విద్వేషం. ‘‘హేతుబద్ధతను ధ్వంసం చేసే దీర్ఘకాలిక ప్రక్రియ అంతిమ పర్యవసానమే ఫాసిజం’’ అని ప్రముఖ మార్క్సిస్టు సిద్ధాంతవేత్త జార్జ్‌ ‌లూకాక్స్‌ 1952 లో రచించిన ‘‘హేతువు విధ్వంసం’’ (డిస్ట్రక్షన్‌ ఆఫ్‌ ‌రీజన్‌) అన్న గ్రంథంలో పేర్కొన్నాడు. అలా హేతు విధ్వంసం జరుగుతున్న క్రమంలో భాగంగానే ‘‘నాయకుడి’’కి, ‘‘దేశానికి’’ మధ్య ఉండవలసిన సంబంధం తలకిందులై మన దేశంలో సాక్షాత్కరిస్తోంది. కళ్ళ ముందు కనిపించే ఆధారాలను కూడా లెక్క చేయకపో వడం, తానే దేశం అన్న తరహాలో వ్యవహరిస్తూ హేతు విరుద్ధంగా నడుచుకోవడం, దీన్నంతటినీ సమర్ధించు కోడానికి దేశంలో హేతువిరుద్ధతను పెంచి పోషించడం వలన మన జాతి జీవనం దారుణంగా చితికిపోతున్నది.

మైనారిటీగా ఉండే ప్రజలను దారుణంగా అణచివేయడం, సాధారణ ప్రజలు గొంతెత్తకుండా నోళ్ళు మూయించడం, ప్రజాస్వామిక వ్యవస్థ లను నాశనం చేయడం, ప్రజానీకం చుట్టూ ఒక భీతిగొలిపే వాతావరణాన్ని నెలకొల్పడం, అడ్డగోలుగా బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు పట్టం కడుతూపోవడం -ఇవన్నీ ఇప్పటికే ధృవీకరించబడ్డాయి. వీటితోబాటు మన దేశ ఆలోచనా క్రమాన్ని, జ్ఞాన సంపదను కూడా దెబ్బతీస్తూ కొన్ని శతాబ్దాల వెనక్కు నెట్టివేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇది చరిత్ర పాఠ్యాంశాల విషయంలో బాగా కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. తక్కిన విద్యా రంగ విభాగాలు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఉదాహరణకు ‘‘ఆర్యులు’’ ఇండియాలోనే ఉద్భవించారని, ఇక్కడినుంచే మొత్తం ప్రపంచానికంతటికీ విస్తరించారని నయా ఫాసిస్టులు భావిస్తారు. అందుచేత నేడు ప్రపంచం మొత్తం మీద నెలకొన్న ‘నాగరికత’ మూలాలు ఇండియాలోనే ఉన్నట్టు ప్రకటిస్తారు. ఈ అవగాహన వాస్తవం కాదని, వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయని మనం ఎన్ని ఆధారాలు, సాక్ష్యాలు చూపించినా వాళ్ళు వాటిని అంగీకరిం చరు. ఈ ఉప ఖండంలోకి ఆర్యులు వలస వచ్చిన కాలానికి పూర్వమే ఇక్కడ సింధు నాగరికత విలసిల్లిందని, దానికి ప్రత్యేమైన నగర స్వభావపు సమాజం ఉందని చరిత్రకారులు ఆధారాలు చూపించినా, దాన్ని తోసిరాజని, విద్యార్థులకు సింధు నాగరికత కూడా ఆర్య సమాజంలో అంతర్భాగమేనంటూ బలవంతంగా బోధిస్తున్నారు. మనం చూపే ఆధారాల నిగ్గు తేల్చమని కూడా వాళ్ళు విద్యార్థులకు చెప్పరు. అసలు ఈ ఆధారాలనే లెక్క చేయవద్దంటూ బోధిస్తున్నారు.

ఇది హేతు విరుద్ధత ఉచ్ఛదశకు చేరిందనడానికి నిదర్శనం. నయా ఫాసిస్టులు ఏ ప్రచార సామాగ్రినైతే సృష్టించారో దానిని తప్ప తక్కిన దేనినీ పట్టించుకోకూడదని వాళ్ళు బోధిస్తున్నారు. దీనివలన కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇందువల్లే నయా ఫాసిస్టులు తక్కిన అన్ని రాజకీయ శక్తులకన్నా, బూర్జువా రాజకీయ గ్రూపుల కన్నా భిన్నమైనవారు. ఇటువంటి శక్తులు అధికారంలో ఉండడం అంటే అది దేశాన్ని సామాజికంగా, ఆర్థికంగా అధోగతిపాలు చేయడమే కాదు, ఆలోచనలో, జ్ఞానంలో కూడా దేశాన్ని అధోగతిపాలు చేస్తుంది. హేతుబద్ధతను పెంపొందించడం, శాస్త్రీయ దృక్పధాన్ని వ్యాపింపజేయడం, అందరికీ ప్రజాస్వామిక హక్కులు ఉండేవిధంగా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, సార్వత్రిక వయోజన వోటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం. దేశంలో అసమానతలు లేని సామాజిక, ఆర్థిక వ్యవస్థను నిర్మించడం అనే లక్ష్యాల ప్రాతిపదిక పైన మన జాతీయోద్యమం నడిచింది. ఈ లక్ష్యాలేవీ విడివిడిగా, దేనికదే అన్నట్టు ఉండేవి కావు. ఇవన్నీ ఒకే ఒక సమీకృత కూర్పుగా ఉన్నాయి. వాటినే స్వాతంత్ర్యానంతరం రూపొందించుకున్న రాజ్యాంగంలో పొందుపరిచారు. మన రాజ్యాంగంలో ఉన్న ఆ యా ఆంశాల పట్ల ఎవరికైనా, ఎటువంటి భిన్నాభిప్రాయాలైనా ఉండవచ్చుగాక. కాని మన రాజ్యాంగం ఏ లక్ష్యాల దార్శనికతతో ఉందో ఆ లక్ష్యాల ప్రాధాన్యత మాత్రం తిరుగులేనిది.

నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ లోనే స్వతఃసిద్ధంగా అసమానతలను మరింత పెంచే లక్షణం ఉంది. మన రాజ్యాంగ లక్ష్యం అసమానతలను తొలగించడం. అందుచేత నయా ఉదారవాద విధానాలు అమలు చేయడం అన్నది మన రాజ్యాంగానికి చేసిన మొదటి విద్రోహం. ఈ నయా ఉదారవా దపు గతితర్కం అసమానతలను పెంచడంతోబాటు నిరుద్యోగా న్ని ఉధృతం చేస్తుంది. ఈ విధానాలను కొనసాగించినందువల్లే మన దేశం (ఒక్క మన దేశమే కాదు, ప్రపంచంలో అనేక దేశాలు కూడా), నయా ఫాసిస్టు శక్తుల రాజకీయ పెత్తనంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. మన దేశంలో పెత్తనం సాగిస్తున్న హిందూత్వ నయా ఫాసిస్టు శక్తులకు ఈ దేశంలో సాగిన వలస విముక్తి పోరాటంతో ఎటువంటి సంబంధమూ లేదు. పైగా మన దేశ ప్రజలు సుదీర్ఘ కాలంగా సాగిస్తున్న విప్లవ పోరాటానికి వ్యతిరేకంగా ఒక ప్రతీఘాత విప్లవాన్ని నడపాలని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, యువజనులు సాగిస్తున్న పోరాటాలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేష్ ‌కుమార్‌ ‌రాజీనామా చేయాలి వంటి కొన్ని పరిమితమైన నిర్దిష్ట డిమాండ్ల చుట్టూ నడుస్తు న్నా.... అవి వాస్తవానికి ఈ నయా ఫాసిస్టు శక్తులు సాగిస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రతీఘాత విప్లవానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టినవే. ఆ ప్రతీఘాత విప్లవాన్ని ఓడించకపోతే మన దేశం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి దిగజారిపోతుంది. (స్వేచ్ఛానుసరణ)


ప్రభాత్‌ పట్నాయక్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్