ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, సమస్యలపై
ప్రభుత్వం సత్వరమే స్పందించాలి : టీజీఈ జేఏసీ
కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు
రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా శాంతియుత నిరసనలు
నవతెలంగాణ- సిటీబ్యూరో/విలేకరులు
”రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించాలి.. ఐక్యతతోనే హక్కులను సాధించుకుంటాం..” అని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి(టీజీఈ జేఏసీ) స్టేట్ చైర్మెన్ ఎం.జగదీశ్వర్ రావు అన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ల వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద మధ్యాహ్నం విరామ సమయంలో జిల్లా అధ్యక్షులు కృష్ణ యాదవ్, సెక్రటరీ విక్రమ్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. స్టేట్ జనరల్ సెక్రెటరీ ఏలూరి శ్రీనివాసరావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని (ముజీబ్), బి.శ్యామ్, కో-చైర్మెన్, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవితో కలిసి ఎం.జగదీశ్వర్ రావు ప్రసంగించారు.
రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది : జగదీశ్వర్‌రావు
రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని జగదీశ్వర్‌రావు అన్నారు. 30 నెలలుగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.13 వేల కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేసి, 15 లక్షల మంది ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ప్రాణం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ప్రజల సమస్యలుగా పరిగణించి, తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రధానంగా పీఆర్సీ అమలు, పెన్షనర్లకు ఈహెచ్‌ఎస్ వర్తింపజేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు ఏక మొత్తంలో బెనిఫిట్స్ చెల్లించాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని, పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పోరాటం ఆరంభమే..: టీజీఈ జేఏసీ కో-చైర్మెన్ చావ రవి
”ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు విజయవంతమయ్యాయి. తెలంగాణ వచ్చాక మొదటిసారి హైదరాబాద్ సచివాలయంలో ఉద్యోగులందరూ సింహద్వారం వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేయడం విశేషం. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు, పెన్షనర్లకూ పలు హామీలు ఇచ్చింది. కానీ నెల మొదటి తేదీన వేతనాలు తప్ప మరే హామీ నెరవేర్చలేదు.. ముఖ్యమంత్రి మాట ప్రకారం రెండేండ్లు ఓపిక పట్టామని, ఉద్యోగుల సహనాన్ని చేతగానితనంగా భావించడం సమంజసం కాదు..” అని టీజీఈ జేఏసీ కోచైర్మెన్ చావ రవి అన్నారు. ఆర్థిక సమస్యలే కాదు, ఆర్థికేతర సమస్యలూ పరిష్కారం చేయటానికి శ్రద్ధ వహించకపోవడం విచారకరమన్నారు. వెంటనే పీఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని, కనీసం పదివేల కోట్లు విడుదల చేసి పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2004 సెప్టెంబర్‌కు ముందు నోటిఫికేషన్ ద్వారా తర్వాత నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింపజేయాలన్నారు. హెల్త్ కార్డులను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేఏసీ ప్రస్తుత పోరాట కార్యక్రమం కేవలం ఈ నాలుగు సమస్యలపైనే కేంద్రీకరించామన్నారు. ఈరోజు జరిగిన నిరసన ప్రదర్శనలు పోరాటానికి ఆరంభం మాత్రమేనని, అన్ని సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నిరసనలు విజయవంతం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఐక్యతను ప్రదర్శించారు. సెక్రటేరియట్, బీమా భవన్, హైదరాబాద్ కలెక్టరేట్‌లో పెద్దసంఖ్యలో ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. విజయవంతం చేసిన వివిధ సంఘాల నాయకులకు టీజీఈ జేఏసీ చైర్మెన్, జనరల్ సెక్రటరీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వివిధ సంఘాల నేతలు తమ సమస్యలతో కూడిన మెమోరాండాన్ని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) జితేందర్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా సెక్రటరీ ఎం.ఏ. ఖాదర్, కె.శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఈ.ఆశన్న, ట్రెజరర్ ఎం.వి. రమణ, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకట్, రాష్ట్ర కార్యదర్శి సింహాచలం, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
జిల్లాల్లో నిరసనలు..
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బేల, నేరడిగొండ, బోథ్, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. కాగజ్‌నగర్‌లో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి తహసీల్దార్ వినతిపత్రం అందించారు. మున్సిపల్ ఎంప్లాయీస్ డిస్ట్రిక్ట్ ఫోరం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎంప్లాయీస్ జాక్ ఉద్యోగులు, నాయకులు నిరసన తెలిపారు. మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దేవరకొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. సూర్యాపేటలో స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వేణు మాధవరావు, తహసీల్దార్ కృష్ణయ్యకు వినతిపత్రాలు సమర్పించారు. కోదాడలో నిరసన ప్రదర్శన చేపట్టారు. తుంగతుర్తిలో ర్యాలీ నిర్వహించారు. యాదాద్రిభువనగిరి జిల్లా వ్యాప్తంగా నిరసన చేపట్టి వినతిపత్రాలు అందజేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా అన్ని ఎమ్మార్వో కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో నిరసన తెలిపారు. ఖమ్మంలో ఉపాధ్యాయుల ఆందోళన చేశారు. కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఐక్యతతోనే హక్కుల సాధన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



