Saturday, April 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసాంస్కృతిక సైన్యం తయారు కావాలి

సాంస్కృతిక సైన్యం తయారు కావాలి

- Advertisement -

– కళారూపాల్లో సృజనాత్మకతను జోడించాలి : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌
– దోపిడీ, ఆధిపత్యం దుర్మార్గమైనవి
– వాటిపై ఎక్కుపెట్టేందుకు సరైన ఆయుధం కళారూపాలే
– కళాకారులకు సైద్ధాంతిక అవగాహన, నిరంతర అధ్యయనం, సాధన అత్యావశ్యకం : నాటక రచయిత, దర్శకులు కె.శాంతారావు
– ప్రజాకళలను బతికించుకుంటాం : ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా
– మహాసభలో ఐదు తీర్మానాలకు ఆమోదం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజానాట్యమండలి ద్వారా సాంస్కృతిక సైన్యం తయారు కావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పీఎన్‌ఎమ్‌ రాష్ట్ర మూడో సభలో ఆయన శుక్రవారం మాట్లాడారు. కళారూపాల్లో సృజనాత్మకతను జోడించి ముందుకెళ్తేనే ప్రజలకు మరింత చేరువ కాగలుగుతారని చెప్పారు. పాలకవర్గాల దుర్మార్గమైన విధానాలను ఎత్తిచూపేలా, ప్రశ్నించేలా, ఆలోచింపజేసేలా కళారూపాలుండాలన్నారు. సామాజిక రుగ్మతలను పారదోలేలా, మూఢనమ్మకాలపై ప్రజల్ని చైతన్యపరిచేలా ప్రజానాట్యమండలి కళాకారులు పనిచేయాలని ఆకాంక్షించారు. జానపద కళలపై కేంద్రీకరించి పనిచేయాలని ప్రజానాట్యమండలి కళాకారులకు సూచించారు. కళాకారులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కృషిచేయాలని కోరారు. నాటక రచయిత, దర్శకులు కె.శాంతారావు మాట్లాడుతూ..దోపిడీ, ఆధిపత్యం దుర్మార్గమైనవనీ, వాటిపై ఎక్కుపెట్టి ప్రజల్ని చైతన్యపరిచేందుకు సరైన ఆయుధం కళారూపాలేనని అన్నారు. వీధినాటికలు 21వ శతాబ్ధపు ప్రజాయుధాలు అని సఫ్దార్‌ హష్మీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కళాకారులకు సైద్ధాంతిక అవగాహన ఉండాలనీ, నిరంతర అధ్యయనం, సాధన అత్యావశ్యకం అని నొక్కి చెప్పారు. ప్రజాకళాకారుడు ఎల్లప్పుడూ తన ఆలోచనల్ని చెక్‌ చేసుకోవాలనీ, స్వేచ్ఛగా ఆలోచించాలని సూచించారు. ప్రజలు రీల్స్‌కు అడిక్ట్‌ కావడం, యువత డ్రగ్స్‌కు అలవాటు పడుతుండటం, అశ్లీల సాహిత్యం పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో డ్రగ్స్‌ వ్యతిరేకంగా కళారూపాలు రూపొందించాలన్నారు. లేబర్‌ కోడ్‌ల రద్దు, రైతులకు న్యాయం జరిగేలా, ఆదివాసీల హక్కులను కాపాడేలా, ప్రజలను చైతన్యపరిచేలా ప్రజానాట్యమండలి కళారూపాలు ఉండాలని ఆకాంక్షించారు. సామాజికవేత్త పీఏ.దేవి మాట్లాడుతూ.. ప్రతి ప్రజా కళాకారుడు కూడా తాజా రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి జిల్లాలోనూ పీఎన్‌ఎమ్‌ కళాకారులు తమ ప్రత్యేకత నిలుపుకునేలా కళారూపాలను రూపొందించుకునీ, దాన్ని పీఎన్‌ఎమ్‌ కళాకారులు తప్ప ఎవ్వరూ ప్రదర్శించలేరనే భావనను ప్రజలకు కలిగించేలా సాధన ఉండాలని సూచించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ మాట్లాడుతూ.. జానపద కళలను బతికించుకుంటామని హామీనిచ్చారు. జానపద కళాకారుల దళాలను ప్రత్యేకంగా తయారు చేస్తామనీ, వారి హక్కుల కోసం పోరాడుతామని తెలిపారు. కళారూపాలను కొత్తపద్ధతుల్లో రూపొందించి ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. కుల, మతోన్మాదాలకు వ్యతిరేకంగా, ఉచిత విద్య, వైద్యం కోసం పాలకులపై పోరాటం చేసేలా, డబ్బు రాజకీయాలను దూరం చేసేలా కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తామన్నారు. ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రజల్లో పెంపొందిస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌జే.ఆనంద్‌ మాట్లాడుతూ..తనపై గురుతర బాధ్యత పెట్టారనీ, ఎన్ని ఆటంకాలెదురైనా సంఘం విస్తరణ కోసం పనిచేస్తానని ప్రతినబూనారు. నూతన కమిటీ సహకారం, సంఘంలో గతంలో పనిచేసిన పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని పనిచేస్తానని హామీనిచ్చారు. మహాసభ ముగింపు సందర్భంగా రాష్ట్ర కమిటీ నుంచి రిలీవ్‌ అయినవారికి జ్ఞాపికగా మెమొంటోలు అందజేశారు.
మహాసభలో ఐదు తీర్మానాలకు ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలని మహాసభలో సహాయ కార్యదర్శి సదానంద్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రభాకర్‌ బలపర్చారు. ఈ తీర్మానాన్ని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ‘జానపద కళలను కాపాడాలి..కళాకారులను ఆదుకోవాలి’ అనే తీర్మానాన్ని పీఎన్‌ఎమ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు యాదగిరి ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఉపాధ్యక్షులు వెంకన్న బలపర్చారు. మహాసభ తీర్మానాన్ని ఆమోదించింది. ‘చిన్నసినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ప్రోత్సహించాలి’ అనే తీర్మానాన్ని కూడా మహాసభ ఆమోదించింది. ప్రజాకళలను కాపాడాలి..కళాకారుల కోసం వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలనే తీర్మానానికి మహాసభ ఆమోదం తెలిపింది. ంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో కళారంగం అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే తీర్మానాన్ని పీఎన్‌ఎమ్‌ సహాయ కార్యదర్శి ఆశన్న ప్రవేశపెట్టగా రాష్ట్ర కమిటీ సభ్యులు దుర్గేశ్‌ బలపర్చారు. మహాసభ ఆమోదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -