Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణపై తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు

తెలంగాణపై తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు

- Advertisement -

బీజేపీ నాయకులపై ప్రొఫెసర్‌ కోదండరాం ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణపై తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ నాయకులపై టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీజేఎస్‌ మే 12న నిర్వహించనున్న నాలుగో ప్లీనరీ పోస్టర్‌ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనీ, ఇంగిత జ్ఞానం లేకుండా బ్రిటిష్‌ కాలం నాటి పరిస్థితులకు తెలంగాణ ఏర్పాటును ముడిపెడుతూ తేజస్వీ సూర్య అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. పార్లమెంట్‌లో ఎంపీ మాట్లాడుతున్న సమయంలో కేంద్ర మంత్రులు ఆయనను నిలవరిం చకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ సీనియర్‌ నాయకులు సుష్మా స్వరాజ్‌, వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించి, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డీలిమిటేషన్‌తో సీట్ల కేటాయింపు జనాభా ప్రాతిపదికన జరుగుతుందనీ, అది 2011 జనాభా లెక్కల ప్రకారమా లేదా 2026 జనాభా లెక్కల ప్రకారమా అన్న విషయంలో స్పష్టత అవసరమని తెలిపారు. 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్‌ చేపట్టాలని కోరారు. ఈ ప్రక్రియ ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అసమానతలను పెంచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు సముచిత భాగస్వామ్యం ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సీట్ల పెంపు ద్వారా శాశ్వతంగా అధికారంలో కొనసాగాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో సీట్లు పెంచుకుని ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్స్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం కూడా ఇదే ధోరణికి ఉదాహరణ అన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట తేజస్వీ సూర్య దిష్టిబొమ్మ దహనం నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -