– ప్లానింగ్ వింగ్‌లో అధికారులకు కొత్త బాధ్యతలు
– వేగవంతం కానున్న అనుమతులు, భూ వినియోగ మార్పులు..!
నవతెలంగాణ- సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లో పరిపాలనా సౌలభ్యం కోసం కీలక మార్పులు జరిగాయి. ప్లానింగ్ విభాగం లో సిబ్బంది పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు మెట్రోపాలిటన్ కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. నగర శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న నిర్మాణాల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, జోన్ల వారీగా బాధ్యతలను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఐదుగురు డైరెక్టర్లకు ప్రత్యేక విభాగాలు
హెచ్‌ఎండీఏలోని ప్లానింగ్ వింగ్‌ను ఐదు ప్రధాన విభాగాలుగా విభజించారు. ఐదుగురు డైరెక్టర్లకు బాధ్యతలను అప్పగించారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో డైరెక్టర్-1 ఎంఎంసీ, పాలసీ మ్యాటర్స్, మాస్టర్ ప్లాన్, ఆర్‌డీ ప్లాన్స్ బాధ్యతలను పర్యవేక్షిస్తారు. వీరికి రవీందర్‌రెడ్డి, గోపిక రమ్య, కల్పనా కౌడి వంటి సీపీవో, పీవోలు సహకరిస్తారు. డైరెక్టర్‌్-2 శంకర్‌పల్లి జోన్, అత్యంత కీలకమైన శంషాబాద్ పాలసీ మ్యాటర్స్ వ్యవహారాలు చూస్తారు. వీరికి ప్రసాద్‌రావు, రవీందర్‌రెడ్డి సహకారంతోపాటు కళ్యాణి రాణి, స్వరూప, స్నేహలత, సురేష్ తదితర ఏపీవోలు పనిచేస్తారు. కె.యశ్వంత్‌రావు (డైరెక్టర్) సీఎంసీ, ల్యాండ్ పూలింగ్, జీహెచ్‌ఎంసీ విభాగాలను పర్యవేక్షిస్తారు. వీరికి ప్రసాద్‌రావు, (సీపీవో), షాలిని(పీవో)తో పాటు రాజశేఖర్, ఖుద్దుస్, కౌసల్య వంటి ఏపీవో సహకారం ఉంటుంది. వికాస్ (డైరెక్టర్) మేడ్చల్, ఘట్‌కేసర్ జోన్లతో పాటు ఎల్‌ఆర్‌ఎస్ బాధ్యతలను చూడనున్నారు. ఈ జోన్లలోని పెండింగ్ అనుమతులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. వీరికి గోపిక రమ్య, షాలిని(పీవో)తోపాటు విజయశ్రీ, సత్యనారాయణ, రాజీవ్‌రెడ్డి, శైలజ, రాధాబాయి, శ్రీకాంత్(ఏపీవో) సహకారం ఉంటుంది. భవానీ రాణి (డైరెక్టర్) హెరిటేజ్, ప్రాజెక్ట్ ఫార్ములేషన్ యూనిట్, గ్రిడ్, స్లిప్ రోడ్లు, లింక్ రోడ్ల విభాగాలకు బాధ్యత వహించనున్నారు. వీరికి పద్మరాణి, సత్యనారాయణ సహకారం అందించనున్నారు.
పరిపాలనాపరమైన మార్పులు.. వేగం పెరిగేనా?
సాధారణంగా హెచ్‌ఎండీఏలో ప్లానింగ్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రజలు, వివిధ స్థాయిల్లో ఫైళ్లు పెండింగ్‌లో ఉండటం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు జోన్ల వారీగా అధికారులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించడం ద్వారా, క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త పని విభజనతోనైనా, హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంలో ‘రెడ్ టేపిజం’ తగ్గి, సామాన్యులకు సేవలు త్వరగా అందుతాయో లేదో వేచి చూడాలి.



