సీపీఐ ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎరువుల యాప్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. బుధవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ యాప్ వల్ల ఎరువులను బుకింగ్ చేసుకునేందుకు క్షేత్ర స్థాయిలో రైతులు సెల్ఫోన్లతో కుస్తీలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన యాప్‌ను రైతాంగ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొనసాగిస్తామని తెలిపారు. యాప్‌లో ఏమైనా సాంకేతిక సమస్యలుంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామనీ, భవిష్యత్‌లో రైతులకు మరింత సమర్థవంతంగా సేవలందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎరువుల అక్రమ తరలింపు, బ్లాక్‌మార్కెటింగ్, అవసరానికి మించి నిల్వ చేసుకోవడం వంటి సమస్యలను అరికట్టమే యాప్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. యాప్ ద్వారా ఇప్పటికే 50 లక్షలకు పైగా రైతులు ఎరువులు కొనుగోలు చేశారనీ, యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రంలో 16 నుంచి 17 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల నిల్వలు ఉండేవనీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిల్వలను 22 నుంచి 23 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేల ఎరువుల విక్రయ అవుట్లెట్లలో 900 వరకు మాత్రమే సొసైటీలు ఉన్నాయని వివరించారు. రైతులు ఒకే రకమైన ధరకు ఎక్కడైనా యూరియా కొనుగోలు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. కౌలు రైతులకు కూడా ఎరువుల బుకింగ్ లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
ఎరువుల యాప్ ఇబ్బందులను తొలగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



