పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీఆర్ఎస్ వారు సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డికి పిండ ప్రదానం చేయడం మంచి సంస్కృతి అవుతుందా..? అని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కలిసి మాట్లాడారు. కేసీఆర్ బాత్రూంలో జారిపడితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రీన్ ఛానల్ ద్వారా వైద్యం చేయించిన విషయం మరిచిపోయారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే దగ్గరికెళ్లి మాట్లాడిన ఘనత రేవంత్ రెడ్డిదని, అలాంటిది కాంగ్రెస్ పై నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి చెడుగా ఆలోచిస్తుంది అతనికి దగ్గరగా ఉన్నవాళ్లేనని ఆరోపించారు. సాక్షాత్తు కేసీఆర్ కూతురు.. కేసీఆర్ దగ్గరగా ఉన్నవాళ్లే ఆయన చనిపోవాలని చూస్తున్నారని ఆరోపించినట్టు గుర్తు చేశారు. హరీశ్ రావుకు ఎప్పటి నుంచో క్షుద్ర పూజలు చేయించే అలవాటు ఉందన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండొద్దని కోరుకునేది మీ ఇంటి సభ్యులు మాత్రమే అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం విషయంలో కాంగ్రెస్ పై నిందలు వేయొద్దని కోరారు. ఆయనపై తమకు అపారమైన గౌరవం ఉందని, ముఖ్యమంత్రి తర్వాత అంత సెక్యూరిటీని కేసీఆర్‌కు 55 మందిని ఇస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ విషయంలో మాట్లాడిన తీరు సరికాదన్నారు.
దళితులు ధర్నా చేస్తే, ఆ ప్రాంతం మైల పడుతుందా.. ? : ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్
దళితులు ధర్నా చేస్తే, ఆ ప్రాంతం మైల పడుతుందా.. ? పసుపు నీళ్లతో శుద్ధి చేస్తారా..? అని బీఆర్ఎస్ నేతల తీరుపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచీ బీఆర్ఎస్ పార్టీ విధానమే దళితులను మోసం చేయడం, అవమానించడం, అవహేళన చేయడం అన్నారు. ఆ పార్టీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేక విధానం ఉందన్నారు. ఏకంగా శాసన సభాపతినే పరుష పదజాలంతో దూషించారని, ఇది యావత్ తెలంగాణ సమాజం ఆవేదన, ఆగ్రహం అన్నారు. తమ జాతికి చెందిన స్పీకర్నే తిట్టడాన్ని తట్టుకోలేక దళిత సోదరులు డప్పు దరువులతో కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తే, ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేయడమంటే జాతి వివక్షత, అంటరాన్నితనాన్ని చూపినట్టే కదా అన్నారు. ఈ విషయమై ఫామ్ హౌస్ లో పడుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళిత సమాజమే బీఆర్ఎస్ ను వెలివేసి, అంటరాని పార్టీగా గుర్తిస్తుందన్నారు. కేసీఆర్ క్యాబినెట్ లో దళిత నేత డిప్యూటీ సీఎంగా ఉంటే తీసేశారని, దళిత నేత భట్టిని కాంగ్రెస్ ప్రతిపక్షనేతగా చేస్తే, ఆ హోదా కూడా లేకుండా చేశారని గుర్తు చేశారు. నిరసన వ్యక్తం చేశారు అన్న కారణంతో.. దళిత నాయకులు, ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఆనాడు సభ నుంచి సస్పెండ్ చేశారని, నేడు అత్యున్నత పదవిలో ఉన్న శాసనసభాపతిని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. దళితుడు స్పీకర్ కావడంతో కేసీఆర్ దొర అనే అహంకారంతోనే అసెంబ్లీకి రావడం లేదన్నారు. వెంటనే కేసీఆర్ క్షమాపణ చెప్పి, తాత మధును పార్టీ నుంచి బహిష్కరించాలని, లేదంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ను బొందపెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
అధికారం లేకపోతే బతకలేని పరిస్థితి :
ఎమ్మెల్యే రాందాస్ నాయక్
అధికారం లేకపోతే బీఆర్ఎస్ నాయకులకు బతకలేని పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ విమర్శించారు. దళిత, గిరిజన, బహుజన సమాజంపై బీఆర్ఎస్ దాడి చేయడం సరికాదన్నారు. దోచుకున్నది దాచుకోవడానికి ఈ దాడి చేశారన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరును ఖండిస్తున్నాం :
ఎమ్మెల్యే నవీన్‌కుమార్ యాదవ్
బీఆర్ఎస్ నేతలకు మహిళలు, దళితులు, శాసన సభ, స్పీకర్ పట్ల గౌరవం లేదని ఎమ్మెల్యే నవీన్‌కుమార్ యాదవ్ అన్నారు. ఫాం హౌస్ చుట్టూ పసుపు నీళ్లతో శుద్ధి చేయడం చాలా అవమానకరం అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును ఖండిస్తున్నామని, దళిత స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని కోరారు.
సభకు అడ్డంకులు సృష్టిస్తున్న బీఆర్ఎస్ :
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
సభను సజావుగా నడవనీయొద్దని బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు.
ఎప్పుడో మరిచిపోయిన అంటరానితనాన్ని మళ్లీ బీఆర్ఎస్ నాయకులు తెరపైకి తీసుకొస్తున్నారన్నారు.
దుర్మార్గాలను కప్పిపుచ్చుకోడానికే డ్రామాలు :
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
చేసిన దుర్మార్గాలు కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నాయకులు గుండాల్లాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు బ్లాక్ టికెట్లు అమ్ముకునే వారిలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇంత నీచంగా సభ ఉంటుందా..? అని కొత్తగా వచ్చిన తమకు బీఆర్ఎస్ నాయకుల్ని చూస్తే అనిపిస్తున్నదన్నారు. మహిళలను ముందు పెట్టి బీఆర్ఎస్ శిఖండి రాజకీయాలు చేయాలని చూస్తున్నదన్నారు. తెలంగాణనను మరో బీహార్ చేయాలని చూస్తున్నారన్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులను టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. విధ్వంసం సృష్టించడానికి పన్నిన కుట్రలో భాగమే అసెంబ్లీ ముందు జరిగిందన్నారు. గతంలో మీరు మమ్మల్ని ఇంటి నుంచి బయటకు రానీయకపోయినా.. మేం మీకు నిరసనలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నామని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డికి పిండ ప్రదానం చేయడం సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



