Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహెచ్‌పీఎస్‌ ఫీజుల పెంపుపై తల్లిదండ్రుల నిరసన

హెచ్‌పీఎస్‌ ఫీజుల పెంపుపై తల్లిదండ్రుల నిరసన

- Advertisement -

141 శాతం పెంపుపై ఆగ్రహం
నవతెలంగాణ- ఉప్పల్‌

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా రామంతపూర్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాలుగేండ్లలో ఏకంగా 141 శాతం వరకు ఫీజులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ వందలాది తల్లిదండ్రులు పాఠశాల ప్రధాన ద్వారం వద్ద భారీ నిరసన చేపట్టారు. ”చర్చల పేరుతో కాలయాపన చేస్తూ మమ్మల్ని మోసం చేస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆందోళనకు బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు గంధం నాగేశ్వర్‌రావు, సూరం శంకర్‌, ప్రశాంత్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఏడాదికిపైగా పాఠశాల యాజమాన్యంతో చర్చలు జరిపినా ఎలాంటి పరిష్కారమూ రాకపోవడంతో తల్లిదండ్రులు వీధుల్లోకి రావాల్సి వచ్చిందని తెలిపారు. వెంటనే తల్లిదండ్రుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో సుమారు రూ.83,630గా ఉన్న వార్షిక ఫీజు 2025 నాటికి రూ.2 లక్షలు దాటినట్టు చెప్పారు. ఈ భారీ పెంపు తమపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పలు డిమాండ్లను ముందుకు తెచ్చారు. రాబోయే ఐదేండ్లపాటు ఫీజులను యథాతథంగా ఉంచాలని, ఫీజు పెంపు ఉండదని యాజమాన్యం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. హామీ వచ్చే వరకు మొదటి విడత ఫీజుల చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చట్టబద్ధంగా ఏర్పాటు కావాల్సిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, పాఠశాల ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కల్పించాలని డిమాండ్‌ చేశారు. విద్యా ప్రమాణాలు క్షీణించాయని ఆరోపిస్తూ ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడిని తొలగించాలని కూడా కోరారు. యాజమాన్యం స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -