Magazines

పెద్దనోట్ల రద్దు.. పదేండ్ల వైఫల్యం!

4 గంటల క్రితం

Demonetisation... A decade of failure!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 3 నిమిషాల చదవడం

దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేస్తామంటూ పదేండ్ల క్రితం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రజలకు మిగిల్చింది తీరని కష్టాలు.. ఆర్థిక వ్యవస్థకు మానని గాయాలు. నల్లధనాన్ని వెలికితీస్తామని, నకిలీ కరెన్సీని నిర్మూలిస్తామని, ఉగ్రవాదానికి ఆర్థిక వనరులను అడ్డుకుంటామని, అవినీతిని అంతం చేస్తామని ప్రకటించిన పాలకులు ఆ లక్ష్యాల్లో సాధించినదేమిటన్న ప్రశ్నకు నేటికీ సమాధానం లేదు.

2016 నవంబర్‌ 8న రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి అవి చెల్లవని చెప్పడంతో దేశంలో ఒక్కసారిగా ఆర్థిక కల్లోలం మొదలైంది. అప్పటికి చలా మణిలో ఉన్న కరెన్సీలో ఈ నోట్ల వాటా 86.9 శాతం. సుమారు రూ.15.44 లక్షల కోట్ల విలువైన నోట్లను రద్దు చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలను ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదన్న విమర్శలొ చ్చాయి. అప్పటి రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సైతం తక్షణ ఆర్థిక నష్టాలు, ప్రజల ఇబ్బందులు పెరుగుతాయని, నల్ల ధనాన్ని అరికట్టడానికి మెరుగైన మార్గాలు న్నాయని హెచ్చరించారు. అయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. నల్లధనం మొత్తం బయటపడు తుందన్న వాదనకు భిన్నంగా రద్దయిన నోట్లలో 99.3శాతం తిరిగి బ్యాం కులకు చేరాయి. కేవలం రూ.10,720 కోట్ల విలువైన నోట్లు మాత్రమే తిరిగి రాలేదు. నల్లధనంలో అధిక భాగం భూములు, బంగారం, బినామీ ఆస్తులు, విదేశీ ఖాతాల్లో ఉంటుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం విస్మరించింది. నకిలీ కరెన్సీని అరికట్టామన్న హామీ కూడా నెరవేరలేదు. కొత్త నోట్లలోనూ నకిలీలు వెలుగుచూశాయి.

ఉగ్రవాదానికి నిధుల సరఫరాను నిలువరిస్తామన్న లక్ష్యం కూడా నెరవేరలేదు. 2025 ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం దేశ భద్రతకు ఉగ్రవాదం ఇప్పటికీ సవాలుగా ఉందని గుర్తుచేసింది. అవినీతిని అంతం చేస్తామన్న హామీ కూడా ఆచరణలో కనిపించలేదు. రాజకీయ విరాళాల విషయం లో ఎన్నికల బాండ్ల వివాదం ఇందుకు ఉదాహరణ. అంతిమంగా పెద్దనోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థపై భారీ భారాన్ని మోపింది. నగదు కొరతతో కొనుగోలు శక్తి, మార్కెట్లో డిమాండ్‌ పడిపోయాయి. ఉత్పత్తి, అమ్మ కాలు మందగించి తయారీ, రవాణా, సర ఫరా రంగాలు దెబ్బతిన్నాయి. ఆర్థిక వృద్ధిపై ప్రతి కూల ప్రభావంపడింది. కొత్త కరెన్సీ ముద్రణ, రవాణా, పంపిణీ, ఏటీఎంల మార్పులకు భారీ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఉత్పత్తి, ఉపాధి నష్టాలు దీనికి అదనం.

పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు బ్యాంకులు, ఏటీఎంల ముందు రోజుల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చింది. చేతిలో డబ్బున్నా సొంత అవసరాలకు వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. పెండ్లిళ్లు, వైద్యం, రోజువారీ అవసరాలకు నగదు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలలో నిలబడుతూ పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలొచ్చినా, మరణాలపై సమగ్ర లెక్కలు లేవని ప్రభుత్వం పార్లమెంటులో చెప్పడం బాధ్యతారాహిత్యమే. నగదు కొరత వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారాలు, అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కోట్లాది మంది కార్మికులు ఉపాధి కోల్పోగా, చిన్న వ్యాపారాలు కుదేలయ్యాయి. మరోవైపు నగదు నిల్వలు, సాంకేతిక వసతులు, ఆర్థిక స్థోమత కలిగిన పెద్ద కార్పొరేట్‌ సంస్థలు ఈ సంక్షోభాన్ని తట్టుకోగలిగాయి. చిన్న వ్యాపారులు, స్థానిక ఉత్పత్తిదారులు బలహీనపడటంతో పెద్ద సంస్థలకు పోటీ తగ్గి, వ్యాపార విస్తరణకు అవకాశాలు ఏర్పడ్డాయి. డిజిటల్‌ చెల్లింపుల విస్తరణతో ఆ రంగంలోని సంస్థలు, బ్యాంకులకు కొత్త వ్యాపార అవకాశాలు లభించాయి. పెద్ద నోట్ల రద్దు భారం ఎక్కువగా చిన్న వ్యాపారులు, కార్మికులు మోయగా, పెద్ద సంస్థలకు సాపేక్ష ప్రయోజనం చేకూరింది.

పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ చెల్లింపులు, యూపీఐ లావాదేవీలు పెరిగిన మాట వాస్తవమే. అయితే స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌, డిజిటల్‌ మౌలిక సదుపాయాల విస్తరణ కూడా ఇందుకు కారణం. దీన్ని నోట్ల రద్దు విజయంగా చూపడం సరికాదు. ఇప్పుడు ఆ లావాదేవీలపైన కూడా ఛార్జీలు విధించాలని చూడటం సరికాదు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నెరవేరకపోగా, చలామణిలో నగదు రూ.43 లక్షల కోట్లకు పైగా చేరింది. పదేండ్లు గడిచినా నోట్ల రద్దు వల్ల దేశానికి, ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏమిటన్నది నేటికీ చర్చగానే ఉన్నది. నల్లధనం నిర్మూలన, అవినీతి అంతం, నకిలీ కరెన్సీ నియంత్రణ, ఉగ్రవాదానికి నిధుల అడ్డుకట్ట వంటి లక్ష్యాలు ఆశించిన ఫలితాలనివ్వలేదు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి సాధించిందేమిటన్నది ఇప్పటివరకు స్పష్టత లేదు. ఆర్థిక విధానాలు ప్రజల జీవితాలను మెరుగుపర్చాలి తప్ప, ప్రజలనే ప్రయోగశాలగా మార్చకూడదు. పెద్దనోట్ల రద్దు నేర్పిన ప్రధాన గుణపాఠం ఇదే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్