Magazines

గోబెల్స్ ప్రైజ్‌!

4 రోజుల క్రితం

Goebbels
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 4 నిమిషాల చదవడం

అది జర్మనీలోని బెర్లిన్ నగరంలోని ఒక పెద్ద ఆడిటోరియం! అందులో చాలా హడావుడి జరుగుతోంది! పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు! ఆ ఏర్పాట్లన్నీ అవార్డులు ప్రదానం చేయటానికి. అన్నట్లు ఆ అవార్డులు ఇవ్వటం ఇదే మొదటిసారి! అన్నట్లు అసలు విషయం ఏమిటంటే! ప్రపంచంలోని అత్యుత్తమ అవార్డుగా నోబెల్ ప్రైజ్‌గా అందరూ గుర్తిస్తున్నారు! భౌతిక, రసాయన శాస్త్రాలు, శాంతి, సేవ మొదలగు రంగాల్లో నోబుల్‌ ప్రైజులు ఇస్తున్నారు! ఆ ప్రైజులకు ఉన్నంత విలువ, గౌరవం మరే ఆవార్డుకు లేవన్నది జగమెరిగిన సత్యం! ఇంకా ఇతరేతర ఆవార్డులు ఉన్నప్పటికి నోబెల్ ప్రైజుల లెవెల్ వేరుగా ఉంది కదా! ఇదంతా జర్మనీలోని కొందరికి కడుపు మంటగా ఉంది! వాలెవరో కాదు! హిట్లర్ ప్రభుత్వంలోని ప్రచార శాఖ మంత్రియైన గోబెల్స్ వారసులు! సత్యాన్వేషకులు ఫిజిక్స్, కెమిస్ట్రీలలో పరిశోధనలు చేసి నోబెల్‌ ప్రైజులు అందుకుంటుంటే గోబెల్స్ వారసులు తెగబాధ పడిపోతున్నారు! తమ తాతగారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వారిని ఎవరూ గుర్తించటం లేదు! ఇక ప్రైజులు ఇచ్చే ప్రసక్తి ఎక్కడ ఉంటుంది?

గోబెల్స్ వారసులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, కొన్ని నిర్ణయాలు చేశారు! గోబెల్స్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న వారిని గుర్తించి నోబెల్ ప్రైజులాగా గోబెల్ ప్రైజు ఇవ్వాలని, ప్రైజు మనీని రెండింతలు అంటే కనీసం ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాలని, మరికొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు! ఆ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు! ఆ కమిటీ 2026 సంవత్సరానికి గోబెల్ ప్రైజు విజేతలను ఎంపిక చేసింది! అదిగో ఆ విజేతలకు ప్రైజు ఇవ్వటానికి బెర్లిన్‌లోనే సభ ఏర్పాటు చేశారు! రండి ఆ సభలోకి వెళదాం! ఆడిటోరియం యావత్తు మిరిమిట్లు గొలిపే కాంతులతో వెలిగిపోతున్నది. నిర్వాహకులు, ఆహూతులను సాదరంగా ఆహ్వనించి వారికోసమే కేటాయించిన ఆసనాలలో సగౌరవంగా కూర్చేబెడుతున్నారు! చాలామంది దేశాధినేతలు, ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన దేశాధినేతలను కూడా ఆహ్వానించారు! కనుక వారు అందరూ విచ్చేశారు! సభ ప్రారంభం అయ్యింది! నిర్వాహకుల్లో ఒకరు వేదిక మీదికి వచ్చారు!

‘‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్! గోబెల్స్ ప్రైజు మొదటి ప్రదానోత్సవానికి విచ్చేసిన మీకు స్వాగతం! సుస్వాగతం! గోబెల్స్ ఆశయానికి అనుగుణంగా పనిచేస్తున్న వారిని గుర్తించి, గౌరవించాలని, అందులో భాగంగా గోబెల్స్ ప్రైజీ ఇవ్వాలని మా కమిటీ నిర్ణయించింది! దీనికి ఎవ్వరూ నామినేషన్స్ పంపాల్సిన ఆవసరం లేదు! ప్రపంచ వ్యాపితంగా మాకున్న నెట్‌వర్క్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తాము! 2026 సంవత్సరానికి అర్హులైన వారిని షార్ట్ లిస్ట్ చేశాము! అందులో మొదటి ముగ్గురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము!’’ అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. ‘‘నోబెల్ ప్రైజు ఎవరికి ఇవ్వాలో ఒక కమిటీ నిర్ణయిస్తుంది! ఆ నిర్ణయంపై అనేకసార్లు భిన్నాభిప్రాయాలు వచ్చిన సంగతి మీకు తెలుసు! అందుకే గోబెల్స్ ప్రైజు ఎంపిక పారదర్శంగా జరగాలని నిర్ణయించాము! షార్ట్ లిస్టు చేసిన ముగ్గురే తమలో ఎవరికి గోబెల్స్ ప్రైజు ఇవ్వాలో నిర్ణయిస్తారు! అయితే ఆ ముగ్గురిని ఎందుకు షార్ట్ చేశామో అని మాత్రమే మేము చెబుతాము!’’ అన్నారు నిర్వాహకులు. అంతా ఆశ్చర్యపోయారు! ఏ ప్రైజూ, ఏ ఆవార్డు ఇలా నిర్ణయించబడలేదు! పోటీదారులే తమతో ఒకరిని విజేతగా నిర్ణయించటం అసాధారణం!

ఏదేమైనా గోబెల్స్ ప్రైజు తీరే వేరుగా ఉంది! అనుకుంటూ మరోసారి చప్పట్లు కొట్టారు! ‘‘ఇప్పుడు షార్ట్ లిస్టు చేసిన ముగ్గురిని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము! ఈ సందర్భంగా వారు సాధించిన ఘనతలను మీ దృష్టికి తీసుకుని వస్తాము! వారు సాధించిన ఘనతలు గోబెల్స్ ఆశయాలకు లోబడి ఉన్నాయని మరోసారి ఉద్ఘాటిస్తున్నాము! ఇజ్రాయిల్‌ మాజీ ప్రధాని నెతన్యాహు, యూదులను కాపాడటానికి, పాలస్తీనాకు న్యాయం చేయడానికి ఇరాన్‌ మీద యుద్ధం చేశారు! అందుకే ఆయన షార్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నారు! రెండవ వ్యక్తి అమెరికా అధ్యక్ష‍ులు డోనాల్డ్ ట్రంప్‌! ఇరాన్‌ మీద నెతన్యాహు చేస్తున్న ధర్మయుద్ధానికి అన్ని విధాలుగా సహకరించడమే కాకుండా, ఇరాన్‌ ఆక్రమంగా తయారుచేస్తున్న అణ్వాయుధాలను నిర్వీర్యం చేయటానికి స్వయంగా ఇరాన్‌ మీద యుద్ధం చేశారు! అందుకే ఆయన కూడా షార్ట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు! అందుకే వారిద్దరినీ వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము!’’ అని నిర్వాహకులు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ‘‘మీరంతా మూడవ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు! ఆయనెవరో కాదు!

భారత ప్రధాని నరేంద్రమోడీ! మిగతా ఇద్దరూ శాంతి కోసం, వారి వారి దేశాల ప్రజల ప్రాణాలు కాపాడుకోవటం కోసం యుద్ధాలు చేశారు! కాని మోడీ మాత్రం యావత్‌ ప్రపంచానికి ఎంతగానో ఉపయోగపడే మూడు చౌకైన ఆవిష్కరణలు చేశారు! మొదటిది, డ్రైనేజీ గట్టర్‌ నుంచి గ్యాస్ వస్తుందని, దానితో చాయ్ తయారు చేయవచ్చుననీ కనుక్కున్నారు! రెండవది, ఆకాశంలో మబ్బులు వస్తే, ఆ మబ్బుల మాటున యుద్ధ విమానాలు ప్రయాణిస్తే, రాడార్లు వాటిని పసిగట్టలేవనీ కనుక్కోవటమే కాదు! భారత్‌ - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో దాన్ని నిరూపించారు! మూడవది, తాజా ఆవిష్కరణ! మట్టిని మొబైల్ ఫోను మీద వేస్తే, ఆ మట్టిలో ఏ ఖనిజాలు, రసాయనాలు, లవణాలు ఉన్నాయో తెలుసుకునే టెక్నాలజీని కనుక్కున్నారు! అంతేకాదు! ఆ మట్టి కింద బొగ్గు, బంగారం, ఆయిల్ లాంటి నిక్షేపాలు ఉన్నదీలేనిదీ తెలుసుకునే విధంగా ఆ టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేస్తున్నారు!

ఇంకా చెప్పాలంటే వీటిని మొబైల్ మీద పోస్తే ఆ వివరాలన్నీ తెలిసిపోతాయి. అందుకే ఆయన్ను కూడా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము! ఇప్పుడు ఈ ముగ్గురూ తమలో గోబెల్స్ ప్రైజుకి అర్హులెవరో వారే ఫైనల్ చేస్తారు!’’ అని ప్రకటించారు నిర్వాహకులు. నెతన్యాహు, ట్రంప్, మోడీ ముగ్గురూ వేదిక మీదికి వచ్చారు! ఎవరెవరు ఎక్కడ నిలబడాలో సూచించే చీటీలు వేదిక వెనక బ్యానర్‌కు అంటించి ఉన్నాయి! మొదటి ఇద్దరూ తమపేర్లు ఉన్న చీటీల ముందు నిలబడ్డారు! మోడీజీ మాత్రం బ్యానర్‌ మీద తన పేరున్న చీటీ తీసి తన జేబుకి అంటించుకు న్నారు! ఈలోగా నెతన్యాహు, ట్రంప్ ఇద్దరూ చర్చించుకుని గోబెల్స్ ప్రైజును మోడీజీ చేతుల్లో పెట్టారు! అంతేకాదు ఇరవై కోట్ల రూపాయల చెక్కును, ప్రశంసాపత్రాన్ని కూడా మోడీజీకి అందజేశారు!


- ఉషాకిరణ్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్