Magazines

అమెరికాపై ఇరాన్‌ క్షిపణుల సత్తా - ఎమెన్‌‌లో హౌతీల పట్టు!

27 నిమిషాల క్రితం

missile
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 6 నిమిషాల చదవడం

డబ్బు, పరువూ పోయే శనిపట్టే అన్నట్లుగా ఉంది ఇరాన్ వ్యవహారంలో అమెరికా పరిస్థితి. ఇజ్రాయిల్‌తో కలసి ఫిబ్రవరి 28నుంచి ఉత్తిపుణ్యానికే దాడులకు తెగబడిన డోనాల్డ్ ట్రంప్ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా నవంబరు మూడున జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీని ఓటర్లు చావుదెబ్బ తీశారు. తమ ఇంథన ధరలను పెంచటం తప్ప ఇరాన్ పోరు దేశానికి తెచ్చిందేమీ లేదని జనం భావించారు. ఆ పార్టీ కంటే డెమోక్రాట్లకు పద్నాలుగు శాతం ఓట్లు అధికంగా రావటం ఇటీవలి దశాబ్దాల్లో ఒక రికార్డు. ఎన్నికలు ముగిసిన తరువాత టెహరాన్‌పై తడాఖా చూపుతా అన్నాడు ట్రంప్, ఫలితాలు కూడా వచ్చాయి. తాజా పరిణామాలను చూస్తే మరిన్ని ఆంక్షల కారణంగా బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తున్నది. హార్ముజ్ జలసంధిలో అది నాటిన మందుపాతరలతో లేదా దాడులతో గానీ అనేక నౌకలు దెబ్బతింటున్నాయి. తమ దగ్గర ఉన్న అస్త్ర శస్త్రాలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రయోగిస్తామని ఇరాన్ నాయకత్వం ఎప్పటినుంచో చెబుతోంది.

అది ప్రయోగిస్తున్న ఖండాంతర, ఇతర క్షిపణులు, డ్రోన్లు ఎక్కడి నుంచి తయారవుతున్నాయో శత్రువులకు అంతుబట్టటం లేదు. ఆయుధపాటవం, తయారీ సామర్ధ్యం మొత్తాన్ని ధ్వంసం చేశామని ట్రంప్ పదేపదే చెప్పాడు. తాజా వార్తల ప్రకారం ఫిబ్రవరి 28కి ముందు నెలకు వంద ఖండాంతర క్షిపణులను తయారు చేస్తే ఇప్పుడు యాభై ఉత్పత్తి అవుతున్నట్లు పశ్చిమదేశాల నిఘా సంస్థలు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్‌‌ను లొంగదీసుకోవటం సంగతి తరువాత దాని ఆయుధాల వివరాలను పసిగట్టటం పెద్ద సమస్యగా మారిందంటే అతిశయోక్తి కాదు. నిజానికి దాడులకు ముందు, తరువాత ఎన్ని తయారు చేస్తున్నదో, ఇప్పుడు ఎన్ని నిల్వలు ఉన్నాయో కూడా ఎవరూ చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఎరక్కపోయి ఇరుక్కుపోయామన్నట్లుగా అగ్రరాజ్యం పరిస్థితి ఉంది. స్వంత జనాలూ నమ్మటం లేదు, అమెరికా రక్షణపై ఆశలు పెట్టుకున్న గల్ఫ్, ఇతర దేశాలూ అయోమయంలో పడి, కొత్తగా దాడులు చేయవద్దంటూ ట్రంప్‌పై వత్తిడి తెస్తున్నాయి.

మరోవైపు ఎమెన్‌లో హౌతీలు రోజురోజుకూ పట్టుబిగిస్తున్నారు. సౌదీ అరేబియా చేస్తున్న వైమానిక దాడులకు ప్రతిగా వారు కూడా క్షిపణులు ప్రయోగిస్తున్నారు. మరోసారి ఇరాన్‌పై దాడులు చేయాల్సినంత తీవ్రంగా పరిస్థితి లేదని త్వరలో ఇజ్రాయిల్ పీఠాన్ని ఎక్కుతారని భావిస్తున్న ప్రతిపక్ష నేత ఎయిసెన్‌కోట్ ప్రకటించాడు. మరిన్ని ఆర్థిక, ఇతర ఆంక్షలు తప్ప అదనంగా దాడులు చేయాల్సిన అవసరం లేదని డోనాల్డ్ ట్రంప్ కూడా కొద్ది రోజుల క్రితం చెప్పాడు. తమపై దాడులు, ఇతరత్రా కలిగించిన నష్టానికి గాను అమెరికా 290 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఇరాన్ కోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఇరాన్ వద్ద ఇంకా కనీసం పదిహేడు వందల ఖండాంతర క్షిపణులు, వేలాది ఇతర రకాలు, డ్రోన్లు ఉన్నట్లు తాజాగా పశ్చిమ దేశాల నిఘావర్గాలు పేర్కొన్నాయి. అమెరికా నిఘా విశ్లేషణ ప్రకారం అయితే పదిహేను వందల నుంచి రెండున్నరవేల వరకు ఉన్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ రాసింది. ఇరాన్, కరీబియన్ దేశాలపై దాడులకు బాధ్యుడిగా అభిశంసన ప్రక్రియను ఎదుర్కొంటారని భావిస్తున్న రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్ ఈ వార్తల తరువాత కూడా తాము ఎనభై శాతం ఇరాన్ అణు పరిశ్రమలను ధ్వంసం చేసినట్లు చెప్పుకున్నాడు.

దానికి చెంపపెట్టుగా రహస్య ప్రాంతాల్లో తాము తయారు చేస్తున్న ఆయుధాలు, క్షిపణి నగరం ఇదంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జిసి) కొన్ని వీడియోలను విడుదల చేసింది. రానున్న రోజుల్లో ఒకదాని తరువాత మరొక ఆశ్చర్యాలను వెల్లడిస్తామని ఉన్నత సైనికాధికారి జనరల్ అలీ అబ్దుల్లా చెప్పాడు. సిఐఏ మాజీ విశ్లేషకుడు జిమ్ లామ్స్‌న్ చెబుతున్నదాని ప్రకారం ఇరాన్ కొత్తవాటిని తయారు చేయటంతో పాటు కొన్నింటికి మరమ్మతులు చేస్తున్నది, వేలాది క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. దాడులకు ముందు రెండున్నరవేల ఖండాంతర క్షిపణులు ఉన్నట్లు ఇజ్రాయెల్ అంచనావేసింది. ఏప్రిల్ నెలలో అమెరికా పార్లమెంటరీ కమిటీ ముందు మాట్లాడిన అమెరికా రక్షణ శాఖ నిఘా విభాగ అధిపతి జేమ్స్ ఆడమ్స్ కూడా వేలాది ఆయుధాలున్నట్లు చెప్పాడు. దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 4,900 షాహెద్, 2,200 ఖండాంతర క్షిపణులను ప్రయోగించి నట్లు బ్లూమ్‌బెర్గ్ మీడియా చెబుతున్నది. టెహరాన్ నాశనం అమెరికా లక్ష్యమైతే, సాధ్యమైనంతగా అమెరికా స్థావరాలను దెబ్బతీయటం, ఆర్థికంగా భారీ నష్టాలను కలిగించే లక్ష్యంతో ఇరాన్ ఆత్మరక్షణ ప్రతిఘటన దాడులు చేస్తున్నది.

ఆంక్షల కారణంగా ఇరాన్ తన మిత్రదేశాల నుంచి భారీ మొత్తంలో క్షిపణులు,డ్రోన్ల విడిభాగాలను దిగుమతి చేసుకొని వాటిని అస్త్రాలుగా మార్చుతున్నదని పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి. రష్యా సరఫరా చేసిందన్నది వాటి ఆరోపణ. వాటిలో కొన్నింటిని విడదీసి అదేమాదిరి కొత్త వాటిని స్వయంగా తయారు చేస్తున్న దని(రివర్స్ ఇంజనీరింగ్) చెబుతున్నారు. ఎప్పటినుంచో తీవ్రమైన ఆంక్షలు, ఏక్షణమైనా తమపై దాడులు జరగవచ్చన్న అంచనాతో ఇరాన్ తమ స్వంత సాంకేతిక పరిజ్ఞానాన్ని గత కొన్నేండ్లుగా మెరుగుపరుచు కుంటున్నది. రహస్యంగా భూగర్భంలో ఆయుధ తయారీ, అణుశుద్ది కేంద్రాలను ఏర్పాటు చేసుకోకుండా ఇన్ని నెలలపాటు ప్రతిఘటన కానసాగించటం అసాధ్యం. ఎప్పుడైతే 1979లో ఇస్లామిక్ విప్లవంలో భాగంగా అమెరికా తొత్తు రాచరిక పాలనను అంతం చేసిందో అప్పటి నుంచి అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అప్పటినుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నది. సోవియట్ యూనియన్ సరఫరా చేసిన స్కడ్ క్షిపణులను లిబియా, సిరియాల నుంచి సేకరించి వాటిని అనుకరించి తన స్వంత ఆయుధాలను తయారు చేసుకుం టున్నది.


అలాగే అమెరికాను గట్టిగా వ్యతిరేకించే ఉత్తర కొరియా, చైనా నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది కొన్ని ఆధునిక అస్త్రాలను రూపొందించుకుందని చెబుతున్నారు. గతంలో ద్రవరూపంలో ఉండే ఇంథనాన్ని క్షిపణి ప్రయోగాలకు వాడేవారు. అది మండటానికి కొన్ని గంటలు అవసరమయ్యేది, ఈలోగా శత్రువు పసిగట్టి వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఘన ఇంథనాన్ని వాడుతున్నం దున కొన్ని నిమిషాల్లోనే క్షిపణులు దూసుకుపోతున్నాయి. ఘన ఇంథన తయారీకి అవసరమైన రసాయనాలు, ఇతరాలను విదేశాల నుంచి పారిశ్రామిక అవసరాల పేరుతో దిగుమతి చేసుకుంటున్నది.ఈ ఏర్పాట్లన్నింటినీ ఇంతవరకు ఎవరూ పసిగట్టలేని భూగర్భంలో ఏర్పాటు చేసుకుంది. ఫలానా చోట ఉన్నాయనే అంచనాతో అమెరికా, ఇజ్రాయిల్ దాడులు జరపటం తప్ప వాటిని ధ్వంసం చేయలేకపోయాయి. గత ఎనిమిది నెలలుగా సాగుతున్న పరిణామాల పూర్వరంగంలో మరింత జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకుంటున్నది. దానిలో భాగంగానే ఇటీవలనే ఒకేసారి ద్రవ ఇంథనంతో రెండు క్షిపణులను ప్రయోగించే వాహనాన్ని సమకూర్చుకుంది. ‘మీ మిలిటరీ స్థావరాలను మీరే రక్షించుకోలేకపోతున్నారు, ఇంకా మాకేం రక్షణ కల్పిస్తారు, జరిగిందేదో జరిగింది, ఇరాన్ మీద కొత్తగా దాడులు చేయకండి మహాప్రభో’ అని గల్ఫ్‌దేశాలు ట్రంప్ మీద వత్తిడి తెస్తున్నాయి.


అమెరికాతో చేతులు కలిపిన పాపానికి ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయపడుతున్నాయి. చమురు అమ్మకం, టూరిజం, రియెలెస్టేట్ బిజినెస్‌లతో కాలం గడపక అమెరికాను నెత్తినపెట్టుకొని తిప్పలు కొని తెచ్చుకుంటున్నట్లు అక్కడి జనాలు భావిస్తున్నారు. అమెరికా మిలిటరీ కేంద్రాలు అక్కడ కొనసాగటం గురించి పునరాలోచనలో పాలకులు పడ్డారు. అయితే ఈ దేశాలన్నీ ఇంకేమాత్రం ఒకే మాటపై నిలిచే అవకాశాలు లేవని చెప్పవచ్చు. ఈ కేంద్రాలు తమకు వ్యూహాత్మకంగా కీలకమని భావిస్తున్న అమెరికా అవే రానున్నరోజుల్లో మరింతగా దాడులకు గురయ్యే అవకాశం, ఆ ప్రాంతంపై గతం మాదిరి పట్టు ఉండదని గ్రహించటం మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి మార్పు తన జీవిత కాలంలో చూస్తానని అనుకోలేదని ఒక ప్రొఫెసర్ వ్యాఖ్యానించాడు. పశ్చిమా సియాలో అమెరికా అండతో హవా నడపాలని చూసిన సౌదీ అరేబియాకు ఎమెన్ హౌతీలు చుక్కలు చూపుతున్నారు. గత రోజులు గతించాయని గ్రహించే రోజు కూడా దగ్గరలో ఉన్నట్లు కనిపిస్తోంది. మరో నాటోగా చిత్రించిన మక్కా సంయుక్త ఒప్పందం వలన ప్రయోజనం లేదని ఇప్పటికే తేలింది.


ఒప్పంద భాగస్వాములపై ఎవరైనా దాడిచేస్తే ఇతరులు రక్షణకు రావాలని సౌదీ, తుర్కియే, పాకిస్తాన్ ఆ ఒప్పందాన్ని చేసుకున్నాయి. గత కొద్దినెలలుగా హౌతీలను దెబ్బతీసే పేరుతో ఎమెన్‌పై సౌదీ అరేబియా వైమానిక దాడులు జరుపుతున్నది గనుక ఇతర దేశాలు జోక్యం చేసుకొనే అవకాశం లేదు. దానికి ప్రతిగా హౌతీలు తమ ప్రాంతాల నుంచి క్షిపణులు ప్రయోగిస్తున్నారు గనుక సౌదీ గడ్డమీద జరుగుతున్న యుద్ధంగా పరిగణించటానికి వీల్లేదు. హిందూమతంగా వర్ణితమౌతున్నదానిలో శైవులు, వైష్ణవులు, మరికొన్ని సమూహాలు ఉన్నట్లుగానే ఇస్లాంలో షియాలు ఒకరు. వారిలో కూడా మూడు ఉప సమూహాలు. వాటిలో ఒకటైన జైదీలు ఎమెన్‌లో తమ వైభవాన్ని పునరుద్ధరించాలనే పేరుతో అన్సార్ అల్లా (దైవ సహాయకులు) అనే పేరుతో మత పెద్ద హుస్సేన్ అల్ హౌతీ ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. దాన్ని అనుసరించేవారిని హౌతీలు అని పిలుస్తున్నారు. ఎమెన్‌లో వారు తిరుగుబాటుదారులుగా మారారు. ఇరాన్ మద్దతు పొందారు. వారిని అణచివేసేందుకు ఎమెన్ పాలకులు, అమెరికా, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ మద్దతు తీసుకున్నారు. ఎమెన్‌లో 2011 నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ప్రారంభమయ్యాయి.


దీన్ని ఎమెన్ విప్లవంగా వర్ణించారు. నాటి నుంచి నేటి వరకు హౌతీలు అనేక విజయాలు సాధిస్తూ రాజధాని సనా నగరంతో సహా అనేక ప్రాంతాలను స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. గతంలో దక్షిణ ఎమెన్ ప్రాంతానికి రక్షకురాలిగా సౌదీ అరేబియా ఉండేది. అందువలన అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా తిరుగుబాటును అణచేందుకు అది రంగంలోకి దిగింది. నిజానికి ఎర్ర సముద్ర ప్రాంతంలో సముద్రమార్గాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకోవటం అసలైన లక్ష్యం. ఏడెన్, బాబ్ ఎల్ మండాబ్ జలసంది అరేబియా సముద్రాన్ని కలుపుతాయి. ఈ కారణంగా అమెరికా కూడా పాగావేసేం దుకు చూసింది. వర్తమాన విషయాలకు వస్తే హౌతీలు ఒక్కొక్క రేవు, ఒక్కో పట్టణాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ రాజధాని ఏడెన్ ప్రాంతాన్ని పట్టుకొనేందుకు ముందుకు కదులుతున్నారు. జూలై నుంచి ఇప్పటి వరకు సౌదీ అరేబియా ఎమెన్‌లో హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై 5,183సార్లు సౌదీ విమానాలు దాడులు చేశాయి.


అయినా ఫలితం లేకపోగా సౌదీ చమురు, విద్యుత్ కేంద్రాలపై హౌతీల దాడులు పెరిగాయి. మక్కా, మదీనాలవైపు క్షిపణులు దూసుకు వచ్చినట్లు ప్రచారం చేసి ముస్లింలలో వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చూశారు. సౌదీ దాడులతో తమకేమీ సంబంధం లేదని, బాబ్ ఎల్‌మండాబ్ జలసంధిని మూసివేయద్దని అమెరికన్లు హౌతీలతో రాజీబేరాలకు దిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వ దళాలు అనేక ప్రాంతాల నుంచి వెనక్కు పోతుండటం, హౌతీల పురోగమనంతో ఎమెన్‌లో ఉన్న ప్రభుత్వ పతనం తప్పదని భావిస్తున్నారు. అదే జరిగితే పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలో పరిణామాలు అనేక మలుపులు తిరుగుతాయి!


ఎం. కోటేశ్వరరావు 8331013288

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్