ప్రాచీనకాలంలో నదీ జలాల కోసం రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగేవి. ఆధునిక కాలానికి వచ్చినా నీటి కోసం పోరాటాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కృష్ణా జలాల పంపకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పల్నాడు వాటర్‌గ్రిడ్ వివాదం మరో జలయుద్ధానికి తెరలేపింది.వేల కోట్ల రూపాయలతో ఏపీ సర్కార్ పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు తాగు నీరివ్వడానికి నాగార్జునసాగర్ కుడిగట్టున ఇంటేక్ ట్యాంకు నిర్మాణంతో ఈ వివాదం ప్రారంభమైంది. తెలంగాణ ఇందుకు తీవ్ర అభ్యంతరం చెబుతున్నది. ఈ ఇంటేక్ ట్యాంక్ 510 అడుగుల కంటే తక్కువ, అంటే 493.47 అడుగుల వద్దే నిర్మిస్తుండటం సమస్యను సృష్టిస్తున్నది. నాగార్జునసాగర్‌లో హైదరాబాద్‌కు నీరు ఎత్తిపోయ డానికి కనీసం 510 అడుగులు కావాలి. ఏపీ 493 వద్దే నీరు తీసుకుంటే, హైదరాబాద్‌కు నీరు రాకుండా పోతుంది. ఇది కొత్త ప్రాజెక్టు, కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు అనేది తెలంగాణ వాదన.
కాగా ఏపీ ‘మాకు ఇందులో కొత్తగా ఇచ్చేదేమీ లేదు. మాకున్న కేటాయింపులే వాడుతున్నాం. ఇది జల్ జీవన్ మిషన్ కింద తాగునీరు తీసుకుంటున్నాం తప్పితే, దొంగతనం కాదు’ అని అంటున్నది. ఇక్కడే అసలు రాజకీయ రగడకు శ్రీకారం చుట్టబడింది. అదే జల జగడానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. కాగా ఈ ప్రాజెక్టుకు రెండేండ్ల క్రితమే ఏపీ శ్రీకారం చుట్టి ఇరవై శాతం పని పూర్తిచేసింది. ఇన్నాళ్లు ఎందుకు నిద్రపోయారంటూ ఒకరినొకరు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రశ్నించుకోవడం పట్ల రాజకీయ దుమారం చెలరేగింది.
అయితే, ‘జీవో నెంబరు 56 ద్వారా ఈ ప్రాజెక్టు 2022లో జగన్, కేసీఆర్ హయాంలోనే వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకోలేదని’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న. ‘2015లో కేసీఆర్, హరీశ్‌రావు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు ఒప్పుకున్నారు. మన బేసిన్ వాటా ఎక్కువ ఉన్నా, తక్కువకు ఒప్పుకు న్నారనేది’ సీఎం వాదన.
‘కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీ సర్కార్ ఒత్తిడికి తలొగ్గింది. నీటి దొంగతనాన్ని చూస్తూ ఊరుకుం దనేది’ బీఆర్ఎస్ విమర్శ. ఒకవైపు ఏపీకి, తెలంగాణకు జలజగడం నడుస్తుంటే, మరోవైపు తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు తాగునీటి రణానికి దిగాయి. అసలు సంగతి నీరు లేకపోడం. నాగార్జునసాగర్‌లో ఇప్పుడున్నది 45 టీఎంసీలే. అందులో హైదరాబాద్‌కు 15 టీఎంసీలు, ఆవిరికి ఐదు టీఎంసీలు పోతే మిగిలేది 25 టీఎంసీలే. ఏపీ 19 టీఎంసీలు అడుగుతుండగా, తెలంగాణ 21 టీఎంసీలు కావాలంటున్నది. రెండు రాష్ట్రాల అవసరాలకు తగినంతగా నీరు సాగర్‌లో లేకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన కేఆర్ఎంబీ సమావేశం సైతం ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. ఉన్నతాధికారులతో కూడిన సమావేశాలు పదే పదే జరుగుతున్నా, ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుంటే కేంద్రం మాత్రం చోద్యం చూస్తున్నది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గూ అన్నట్టుగా వ్యవహరిస్తూ సమస్యను పొడిగిస్తున్నది.
ఇది కేవలం పల్నాడు గురించే కాకుండా రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు లైనింగ్, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి, సీడబ్ల్యూసీకి, ఏపీకి తెలంగాణ ప్రభుత్వం వందలాది లేఖలు రాసినా ప్రయోజనం లేదు. అలాగే ఏపీ సైతం అభ్యంతరాలు పెట్టింది. పల్నాడుతోపాటు హైదరాబాద్‌కూ తాగునీరు అవసరమే. ఒకరి దాహం తీర్చడానికి ఇంకొకరి గొంతును ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటితోపాటు ఇతర అవసరాలు తీర్చడానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. పల్నాడు వాటర్‌గ్రిడ్ నిర్మాణం నిజమైతే, తక్షణమే ఆపాల్సిందే. వెంటనే డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ తనిఖీ చేయాలి. ఈ అంశాన్నీ ఇటు కేఆర్ఎంబీ, అటు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మాత్రమే తేల్చగలవు. కేంద్రమూ ఒక చేయి వేయాలి. 2015లో చేసింది తాత్కాలిక ఒప్పందమే. తెలంగాణ 555 టీఎంసీలు అడుగు తున్నది. దీనిపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
రాజకీయ విమర్శలుగాక కార్యాచరణ కావాలి. కేసీఆర్‌ది తప్పా, రేవంత్ రెడ్డి ఒప్పా అనేది కాకుండా న్యాయమైన నీటివాటాలను తేల్చాలి. ఆ పనిని కేంద్రం చేయకుండా ఏండ్ల తరబడి జాప్యం చేస్తూ నిర్లక్ష్యానికి ఒడిగట్టింది. కృష్ణా నది రెండు రాష్ట్రాలది. దాన్ని ఓట్ల కోసం వాడుకుంటే, చివరికి రెండు రాష్ట్రాలూ దాహంతోనే అల్లాడుతూ కొట్టుకునే ప్రమాదముంది. నీటి వాటాలతోపాటు విభజన అంశాలను పరిష్కరించకుండా పెండింగ్‌లో పెట్టి కేంద్రం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే సాగుతున్నది. వినతులు, విజ్ఞప్తులతో కాకుండా అధికార, ప్రతిపక్షాలు కలిసి బీజేపీపై పోరాటానికి సిద్ధపడాలి. అదే సమస్య పరిష్కారానికి సరైన మార్గం.






కామెంట్లు (0)