ప్రేమించానని వెంటపడటం.. తిరస్కరించిందని కక్ష పెంచుకో వడం.. చివరకు ప్రాణాలు తీసేందుకు తెగించడం! ఇది ప్రేమనా? ఏ సంస్కృతి నేర్పిన వికృత మనస్తత్వం? అమ్మాయి తన ఇష్టాన్ని చెప్పే హక్కును కూడా సహించలేని పురుషాధిక్య అహంకారం చిన్న వయసులోనే హింసాత్మక రూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఇందుకు నిదర్శనం. ప్రేమ పేరుతో వేధిస్తున్న 21 ఏళ్ల యువకుడు తన ప్రతిపాదనను తిరస్కరించిందన్న కక్షతో పాఠశాల తరగతి గదిలోకి వెళ్లి చెట్లను నరికే యంత్రంతో బాలికపై దాడికి తెగబడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నిం చిన మరో విద్యార్థినీ గాయపరిచాడు. చిన్నారులు చదువుకోవాల్సిన బడిలోనే ఇలాంటి దారుణం జరగడం సమాజం ఎటువైపు వెళ్తోందో తెలియజేస్తోంది.
ఇంతటి ఉన్మాదం చిన్న వయసులోనే ఎలా పెరుగుతోంది? ప్రేమంటే ఎదుటి వారి ఇష్టాన్ని గౌరవించడం అన్న కనీస అవగాహన ఎందుకు కొరవడు తోంది? ఒక అమ్మాయి ప్రేమను నిరాకరిస్తే అది ఆమె హక్కు. దాన్ని అవమానంగా భావించి ప్రతీకారానికి దిగడం వెనుక పురుషాధిక్య భావజాలం ఉంది. అమ్మాయి తన మాట వినాలని, తనను తిరస్కరించే అధికారం ఆమెకు లేదనే ఆధిపత్య ధోరణి పెరుగు తోంది. ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం, బెదిరించడం ప్రేమ కాదు.. నేరపూరితం. ఇలాంటి హింసాత్మక ధోరణులకు కారణాలనేకం. సినిమాలు, సామాజిక మాధ్యమాల ప్రభావాన్నీ విస్మరించలేం. కొన్ని చిత్రాల్లో హింసను హీరోయిజంగా, కత్తులు పట్టి దాడి చేయడాన్ని వీరత్వంగా చూపిస్తున్నారు. విలన్లను చంపడం, ప్రత్యర్థులను భయపెట్టడం గొప్పతనంగా చిత్రిస్తున్నారు. విచక్షణ పెరగని వయసులో ఇలాంటి సన్నివేశాలను అనుకరించే ప్రమాదం ఉంది. ఢిల్లీలో ముగ్గురు మైనర్లు ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో ‘పుష్ప’, ‘భౌకాల్’ చూసి వాటి ప్రభావానికి లోనైనట్లు పోలీసుల విచారణలో చెప్పి నట్టు వార్తలొచ్చాయి. అయితే సినిమాలే నేరాలకు ఏకైక కారణం కాదు. వాటితోపాటు సామాజిక వాతావ రణాన్నీ పరిశీలిం చాలి.
మద్యం, మత్తు పదార్థాల వినియోగం కూడా హింసాత్మక ప్రవర్తనకు దోహద పడుతున్నాయి. మత్తులో విచక్షణ, ఆత్మనియంత్రణ తగ్గి కోపోద్రిక్తత, దాడి చేసే ప్రవృత్తి పెరిగే ప్రమాదం ఉంది. యువతలో చిన్న వయసులోనే మద్యపాన అలవాట్లు పెరగడం మరింత ఆందోళన కరం. ఒకవైపు మద్యానికి దూరంగా ఉండాలని ప్రచారం చేస్తూనే, మరోవైపు ప్రభుత్వాలు ఆదాయం కోసం మద్యం విక్రయాలపై ఆధారపడుతున్నాయి. మద్యం నియంత్రణ, అక్రమ విక్రయాల కట్టడి, మత్తు పదార్థాల సరఫరా నిరోధంపై పాలకులకు చిత్తశుద్ధి అవసరం. అలాగే పిల్లలకు ఫోన్లు, సౌకర్యాలు కల్పించడంతోనే తల్లిదండ్రుల బాధ్యత ముగియదు. వారు ఏ కంటెంట్‌ను చూస్తున్నారన్నది కూడా కీలకమే. వారి స్నేహాలు, ఆలోచనలు, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని గమనించాలి. ఆడపిల్లల పట్ల గౌరవం, తిరస్కరణను అంగీకరించే సంస్కారం నేర్పాలి. అయితే కుటుంబాలపైనే బాధ్యత నెట్టేయలేం. నిరుద్యోగం, అసమానతలు, లింగ వివక్ష, హింసను సాధారణంగా చూపించే సామాజిక ధోరణి కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. కులం, మతం పేరుతో దాడులు, మహిళలపై వేధింపులు, చిన్న వివాదాలకే హత్యలకు తెగబడటం సమాజంలో హింస ఎంతగా వేళ్లూనుకుందో చెబుతున్నాయి.
ముఖ్యంగా చిన్నారులు, యువతలో మానసిక ఒత్తిడి, నిరాశ, కోపాన్ని ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించేందుకు పాఠశాల స్థాయిలోనే కౌన్సెలింగ్ అవసరం. తోటి విద్యార్థులపై వేధింపులు, ప్రేమ పేరుతో వెంటపడటం వంటి వాటిని చిన్న విషయాలుగా తీసుకోకూడదు. ప్రారంభ దశలోనే గుర్తించి అడ్డుకుంటే పెద్ద నేరాలకు వెళ్లకుండా నిరోధించవచ్చు. సమాజంలో జరుగుతున్న హింసను వినోదంగా చూడటం, నేరస్తులను అభిమానించడం కూడా మారాలి. బాధితులను నిందించే వైఖరికి బదులు వారికి అండగా నిలిచే సామాజిక చైతన్యం పెరగాలి.
మహిళల భద్రతపై ప్రకటనలు చేయడం కాదు, వేధింపుల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లో లింగ సమానత్వం, విలువల విద్య, కౌన్సెలింగ్ ఉండాలి. షీ టీమ్స్, మహిళా పోలీసు విభాగాలు చురుగ్గా పనిచేయాలి. బాలల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, జరగకుండా నిరోధించే వ్యవస్థను పాలకులు నిర్మించాలి. ప్రేమను స్వాధీనంగా, తిరస్కరణను అవమానంగా, హింసను హీరోయిజంగా భావించే మనస్తత్వం మారాలి. అమ్మాయి ‘వద్దు’ అన్నప్పుడు ఆ మాటను గౌరవించడం నేర్పలేని సమాజం నాగరికత సాధించినట్టు కాదు. పిల్లలకు ఆధిపత్యం కాదు సమానత్వం, హింస కాదు మానవత్వం నేర్పినప్పుడే ఇలాంటి ఉన్మాదానికి అడ్డుకట్ట వేయగలం.






కామెంట్లు (0)