విగ్రహాల మార్పుపై.. కిరణ్ రిజిజుతో ఖర్గే వాగ్వాదం

నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మాగాంధీ, బీఆర్‌ అంబేద్కర్‌తో సహా జాతీయ నేతల విగ్రహాలను వెనుక వైపునకు తరలించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. సోమవారం ఉదయం రాజ్యసభలో ఈ విషయాన్ని విపక్షాలు లేవనెత్తాయి. అయితే ఈ విగ్రహాలను సరైన నిర్దేశిత ప్రదేశంలో ఉంచలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అందుకే ప్రేరణ స్థలంలోకి వాటిని తరలిస్తున్నట్లు చెప్పారు. కాగా, మల్లికార్జున్ ఖర్గే దీనికి కౌంటర్‌ ఇచ్చారు. కిరణ్ రిజిజుతో వాగ్వాదానికి దిగారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని ప్రతి విగ్రహం ఉన్న స్థానం అపారమైనది, ప్రాముఖ్యత కలిగి ఉందని తెలిపారు. జాతీయ నాయకులు, ఎంపీల చిత్రపటాలు, విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక కమిటీ ఉంటుందని అన్నారు. ఉభయ సభల ఎంపీలు ఉండే ఈ కమిటీని 2019 నుంచి పునరుద్ధరించలేదని విమర్శించారు. అసలు ఈ కమిటీ ఉందన్న సంగతి ఆయన (కిరణ్‌ రిజిజు)కు తెలియదని ఖర్గే ఎద్దేవా చేశారు. ముందుగా కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాతే విగ్రహాల తరలింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఎక్స్‌లో పేర్కొన్నారు.

Spread the love