నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఐదు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద 104 ఉద్యోగులు ధర్నా నిర్వహించనున్నారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని యూనియన్ కార్యాలయంలో సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదా నాయక్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న 104 ఉద్యోగులకు ఐదు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గడప గడపకు ఉచిత వైద్యం పేరుతో గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్న ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు గడవక అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించి, రెగ్యులర్ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, సర్వీస్ వెయిటేజ్ కల్పించాలని డిమాండ్ చేశారు. బదిలీలకు అవకాశం కల్పించాలనీ, ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు పి. శ్రీనివాస్, సీహెచ్. అనిల్ కుమార్, ఎం.రాజా గౌడ్ ,కే. మధుసూదన్. బి.బుచ్చిరాజు, జి.సాయి బాబా, రాజ బాబు తదితరులు పాల్గొన్నారు.