ఈనెల 3నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

– అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
నవతెలంగాణ – సిరిసిల్ల
ఈ నెల 3వ తేదీ నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని తన ఛాంబర్లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడారు. ఆయా పరీక్షలకు జిల్లా నుంచి మొత్తం 120 విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షలు ఈ నెల 3 వ తేదీన మొదలై 11వ తేదీ దాకా కొనసాగనున్నట్లు తెలిపారు.  ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మంచినీరు, టాయిలెట్లు సక్రమంగా ఉండేలా చూడాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే సరిచూసుకోవాలని పేర్కోన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిలేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలని అన్నారు.  సెస్  అధికారులు విద్యుత్ సరఫరాలో  లోపం లేకుండా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షలకు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఎండా కాలం నేపథ్యంలో  పరీక్ష కేంద్రం లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు ఉండాలని సూచించారు. సమావేశంలో  డీఈఓ రమేష్ కుమార్, పర్యవేక్షకులు వేణు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love