ఢిల్లీలో ఓటుహక్కుపై భారీ కోత
70 నియోజకవర్గాల్లో 68 చోట్ల గెలుపు మెజారిటీ
కంటే అధికంగా ఓటర్ల తొలగింపు
‘సర్’ ప్రారంభానికి కొద్ది నెలల ముందే
అసాధారణంగా పెరిగిన డిలీషన్లు
ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ప్రశ్నలు
ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్ర అంటూ
వెల్లువెత్తుతున్న విమర్శలు
ఢిల్లీలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రారంభానికి ముందే ఏకంగా 11 లక్షల మందికి పైగా ఓటర్లు జాబితా నుంచి తొలగించబడటం తీవ్ర కలకలం రేపుతోంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో 70 నియోజకవర్గాల్లో 68 చోట్ల గెలుపు మెజారిటీ కంటే తొలగించిన ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో ప్రజల ఓటుహక్కును హరించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : ఢిల్లీలో సర్ ప్రారంభానికి ముందే 11 లక్షల మందికి పైగా ఓటర్లు జాబితా నుంచి తొలగించబడినట్టు తాజా నివేదిక వెల్లడించింది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 68 చోట్ల తొలగించిన ఓటర్ల సంఖ్య గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన గెలుపు మెజారిటీ కంటే అధికంగా ఉంది. ఈ పరిణామాలు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపై తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఓటర్ అధికార్ మంచ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) విడుదల చేసిన రికార్డులతో పాటు సబర్ ఇన్స్టిట్యూట్ గణాంకాలను ఆధారంగా చేసుకుని ఈ అధ్యయనం చేపట్టారు.ఈ నివేదిక ప్రకారం.. 2025 జనవరి 31 నాటికి ఢిల్లీలో 1,56,14,000 మంది ఓటర్లు ఉండగా.. 2026 జూన్ 30 నాటికి ఈ సంఖ్య 1,45,10,299కు పడిపోయింది. అంటే సర్ ప్రారంభమయ్యేలోపే 11,03,701 మంది ఓటర్లు జాబితా నుంచి తొలగించబడ్డారు. సాధారణంగా ఓటరు జాబితా సవరణల మధ్య ప్రతి నెలా పేర్ల చేర్పులు, తొలగింపులు జరుగుతుంటాయి. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఈ వివరాలను ఢిల్లీ సీఈఓ విడుదల చేస్తుంటారు. అయితే సర్ ప్రారంభానికి రెండు నుంచి మూడు నెలల ముందు ఓటర్ల తొలగింపు అసాధారణంగా పెరిగిందని నివేదిక పేర్కొంది.
‘ఈసీ సమాధానం చెప్పాలి’
గతేడాది ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 70 నియోజకవర్గాల్లో నికరంగా 1,00,613 మంది ఓటర్లు పెరిగారు. కానీ ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో ఏకంగా 11,70,885 మంది ఓటర్లు తగ్గిపోయారు. ముఖ్యంగా ఏప్రిల్లోనే 3,39,509 మంది ఓటర్ల పేర్లు తొలగించబడటం గమనార్హం. ఈ సంఖ్య అంతకుముందు ఆరు నెలల సగటు నెలవారీ తొలగింపుల కంటే దాదాపు 20 రెట్లు అధికం. అలాగే గతేడాది జులై నుంచి డిసెంబర్ వరకు జరిగిన మొత్తం ఓటర్ల తొలగింపుల కంటే ఇది మూడు రెట్లకు పైగా ఉండటం గమనార్హం. ఒక్కసారిగా ఇంత భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే ప్రశ్నకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజాస్వామ్య వాదులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పది కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటర్ల తొలగింపు రేటు 40 శాతానికి మించి ఉన్నట్టు అధ్యయనం గుర్తించింది.
ప్రజాస్వామ్యానికి ప్రమాదం : యోగేంద్ర యాదవ్
సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ ఎన్నికల ప్రక్రియపై తీవ్ర విమర్శలు చేశారు. సర్ ప్రక్రియ ముగిసే నాటికి దేశంలో 103 కోట్ల మంది వయోజనులు ఉన్నప్పటికీ, ఓటర్ల సంఖ్య 88 కోట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో దేశంలో 99 కోట్ల మంది వయోజనులు ఉండగా.. 98 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కోట్లాది మంది వయోజనులు ఓటరు జాబితాలకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. ”ఇది సాధారణంగా జరిగే విషయం కాదు. ముందస్తు ప్రణాళిక లేకుండా, వ్యవస్థ మొత్తం ప్రమేయం లేకుండా ఇంత భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపు జరగదు. ముఖ్యంగా సర్ ప్రారంభానికి ముందే జరిగిన భారీ తొలగింపులపై దర్యాప్తు జరగాలి. ఇది నేరపూరిత కుట్రగా విచారించాల్సిన అంశం. ప్రజలను ఓటుహక్కుకు దూరం చేయడమే సర్ లక్ష్యంగా కనిపిస్తోంది” అని యోగేంద్ర యాదవ్ ఆరోపించారు.
ఆ ఐదు రాష్ట్రాలు…
సర్ వడో దశ ముసాయిదా ఓటరు జాబితాల్లో అత్యధిక తొలగింపులు జరిగిన ఐదు రాష్ట్రాల్లో గత మూడేండ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలే ఉన్నాయి. మహారాష్ట్ర, ఏపీలో 2024లో, కర్నాటక, తెలంగాణలో 2023లో, ఢిల్లీలో 2025లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ పరిణామం రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఎన్నికలు జరిగిన కొద్ది కాలానికే అదే రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపులు వెలుగులోకి రావడం యాదృచ్ఛికమా? లేక ఓటరు జాబితాల నిర్వహణలో తీవ్రమైన లోపాలున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతేడాది జరిగిన ఢిల్లీ ఎన్నికల సంగతేంటి? : సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్
సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ కూడా ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. గతేడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 1.56 కోట్ల మంది ఓటర్లతో జరిగాయనీ, ఇప్పుడు దాదాపు 91 లక్షల మంది ఓటర్లు తొలగించబడటం లేదా వారికి నోటీసులు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ”ఇప్పుడు ఎన్నికల సంఘమే తన ఓటరు జాబితాలో ఇన్ని తప్పులు ఉన్నాయని చెప్తుంటే.. గతేడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విశ్వసనీయత ఎంత? ప్రజలు ఈ ప్రక్రియను ఎలా నమ్మాలి? ఇన్ని లోపాలు బయటపడితే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?” అని ఆమె ప్రశ్నించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే.
ఓటుహక్కుపై పెరుగుతున్న ఆందోళన
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని గొప్పలు చెప్పుకునే దేశంలో ఓటుహక్కు పరిరక్షణ అత్యంత కీలకమైన అంశం. ఓటరు జాబితాల నుంచి పేర్లు తొలగించడం అనేది కేవలం సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు. ఒక పౌరుడి రాజకీయ హక్కును నేరుగా ప్రభావితం చేసే చర్య. అయితే ప్రస్తుతం దేశంలో ఎన్నికల సంఘం స్వతంత్రత, ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై ఇప్పటికే అనేక ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ఢిల్లీలో ఈ భారీ తొలగింపుల అంశం మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బీజేపీ పాలనలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో ఎన్నికల సంస్థల స్వతంత్రతపై ప్రతిపక్షాలు, పౌరసంఘాలు పదేపదే సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.



