Tuesday, July 28, 2026
E-PAPER
Homeజాతీయం775 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లో 2.49 లక్షల కేసులు పెండింగ్‌

775 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లో 2.49 లక్షల కేసులు పెండింగ్‌

- Advertisement -

మళ్లీ పేపర్‌ ‌లీక్‌‌లు కూడా వారికేనట!
ప్రధాని మోడీ నిర్ణయంపై ప్రతిపక్షాలు విస్మయం

తక్షణ న్యాయం అందించేందుకు ఉద్దేశించిన ‘ఫాస్ట్‌ ‌ట్రాక్‌’ కోర్టుల్లో (న్యాయస్థానాలు) విచారణలు నిదానంగా సాగుతున్నాయి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ‘నత్తకు నడకలు నేర్పిస్తున్నాయి.’ ప్రభుత్వాలను ఇరకాటంలోకి నెట్టే సంఘటనలు జరిగినప్పుడు ప్రజల్ని తాత్కాలికంగా శాంతపరిచేందుకు ‘ఫాస్ట్‌ ట్రాక్‌’ ఓ రాజకీయ ఆయుధంగా మారింది. తాజాగా నీట్‌ ‌పరీక్షా పేపర్ల లీకేజీల వ్యవహారాన్ని ‘ఫాస్ట్‌ ‌ట్రాక్‌’ కోర్టుకు అప్పగిస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు దేశంలోని ఫాస్ట్ ట్రాక్‌‌ కోర్టుల పనితీరును పరిశీలించే ప్రయత్నంలో అనేక విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 775 ఫాస్ట్‌ ‌ట్రాక్‌ ‌కోర్టుల్లో 2.49 లక్షల కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయంటే, ఆయా కేసుల విచారణల పట్ల పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పేపర్‌ లీక్‌లపై ఆందోళనలు ఉధృతమైన వేళ, నిందితులకు త్వరగా శిక్షలు పడేలా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే ఇప్పటికే దేశంలో పనిచేస్తున్న ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక కోర్టులు లక్షలాది పెండింగ్‌ కేసులతో సతమతమవు తున్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రధాని ప్రకటించినట్టుగా దేశంలో కొత్త కోర్టుల ఏర్పాటు నిజంగా పరిష్కార మార్గమా? లేక ప్రజాగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నమా? అనే ప్రశ్నలు న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, మాజీ ఉన్నతాధికారులు, మేధావులు లేవనెత్తుతున్నారు. న్యాయవ్య వస్థలో సమస్యలు, లోపాలను సరి చేయకుండా ఫాస్ట్‌‌ట్రాక్‌ ‌కోర్టులను ఏర్పాటు చేయడం ఎలాంటి ఫలితాలనూ ఇవ్వదని అంటున్నారు. అసలు పేపర్‌ లీకేజీలు జరగకుండా ఉండటంపై దృష్టి పెట్టాల్సిన కేంద్రం.. తప్పు జరిగిన తర్వాత శిక్షలు విధిం చే విషయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుండటం గమనార్హం.
​​ఆర్భాట ప్రకటన…అసలు వాస్తవం
‘యువత భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదు’ అంటూ ప్రధాని మోడీ జులై 23న పేపర్‌ లీక్‌ కేసుల
సవాలక్ష సమస్యల్లో నిదానంగా ‘ఫాస్ట్‌ ‌ట్రాక్‌’ విచారణలు విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే అదే రోజు రాజ్యసభలో కేంద్రం ఆసక్తికర గణాంకాలు వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం… ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి దేశంలోని 775 ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక కోర్టుల్లో (ఎఫ్‌‌టీఎస్‌‌సీలు) మొత్తం 2.49 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
​ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఉద్దేశం ఏమిటి?
జిల్లా, దిగువ స్థాయి కోర్టుల్లో పేరుకుపోయిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు 2000లో పదకొండో ఆర్థిక సంఘం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను సిఫారసు చేసింది. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు, 14వ ఆర్థిక సంఘం సూచనల ఆధారంగా 2019లో కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులను ప్రారంభించింది. 2019 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఈ కోర్టులు 3,66,124 కేసులను పరిష్కరించినట్టు న్యాయశాఖ గణాంకాలు చెప్తున్నాయి. అయినప్పటికీ ఇంకా పెండింగ్‌ కేసుల సంఖ్య కూడా భారీగానే ఉండటం ఆందోళన కలిగించే అంశం. ​

​ప్రజల దృష్టిని మళ్లించేందుకే..
ఫాస్ట్‌‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుపై ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సీనియర్‌ న్యాయవాది, మానవహక్కుల కార్యకర్త వృందా గ్రోవర్ తీవ్రంగా విమర్శించారు. యువత వీధుల్లోకి రావడానికి కారణమైన అసలు సమస్యకు ఇది దారి చూపదని అన్నారు. ఇది దేశ ప్రజల దృష్టిని మళ్లించే చర్యగా ఆమె అభివర్ణించారు. ‘ఫాస్ట్‌ట్రాక్‌’ అనే పేరున్నప్పటికీ.. వాస్తవంగా విచారణలు మాత్రం వేగంగా పూర్తవడం లేదని చెప్పారు. పోక్సో, లైంగికదాడి కేసుల కోసం ప్రత్యేక కోర్టులు ఉన్నప్పటికీ కేసుల పరిష్కారం ఏండ్ల తరబడి సాగుతోందని ఆమె గుర్తు చేశారు. లైంగికదాడి కేసుల్లో రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని చట్టం చెప్తోంది. అయితే వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేవు. దేశంలో ఇలాంటి పలు కేసులు అనేక సంవత్సరాలుగా కొనసా గుతున్నాయని వృందా గ్రోవర్ చెప్పారు. కఠినమైన చట్టాలే నేరాలను పూర్తిగా అడ్డుకోలేకపోతే, పేపర్‌ లీక్‌లను కేవలం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఎలా నిరోధిస్తాయని ఆమె ప్రశ్నించారు.
​దర్యాప్తులోనే అసలు సమస్య
‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌’కు చెందిన వలయ్‌ సింగ్‌ అభిప్రాయం ప్రకారం… కోర్టులు మాత్రమే ఉంటే సరిపోదు. వాటికి ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఉండాలి. పేపర్‌ లీక్‌ కేసులు డిజిటల్‌, సైబర్‌, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన క్లిష్టమైన విచారణలను జరిపేలా చేస్తాయి. ప్రస్తుతం దేశంలో పోలీసుల సైబర్‌ దర్యాప్తు సామర్థ్యం చాలా పరిమితంగా ఉంది. 2020లో సుమారు 50 వేల సైబర్‌ నేరాలు నమోదవగా.. 2024 నాటికి అవి లక్షకు పైగా పెరిగాయి అని ఆయన వివరించారు.

కేంద్రం చెప్పిన కారణాలు
‘ఫాస్ట్‌ ‌ట్రాక్‌’ కోర్టుల్లో విచారణలు ఆలస్యం కావడానికి కొన్ని ప్రధాన కారణాలను లోక్‌‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కోర్టు భవనాల కొరత, క్లిష్టమైన సాక్ష్యాలు, పోలీసు దర్యాప్తు ఆలస్యం, న్యాయవాదులు అందుబాటులో లేకపోవడం, సాక్షులు హాజరుకాకపోవడం, తరచూ వాయిదాలు వంటి అనేక కారణాలు ఉన్నాయని తెలిపింది. సాధారణ కోర్టుల తరహాలోనే విచారణలు సాగితే ఇక ‘ఫాస్ట్‌ ‌ట్రాక్‌’ ఎందుకనే ప్రశ్నకు సమాధానం లేదు.
​​ఒక కేసుకు సగటున 510 రోజులు
విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ 2022లో విడుదల చేసిన అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 486 పోక్సో కోర్టుల్లో ఒక కేసు పరిష్కారానికి సగటున 510 రోజులు పట్టింది. ఢిల్లీలో ఒక కేసు సగటు వ్యవధి 1284 రోజులు (సుమారు 42 నెలలు)గా ఉంది. అంటే చట్టం నిర్దేశించిన గడువులను కూడా ఈ కోర్టులు చేరుకోలేకపోయాయని తేలింది. ​

​ భారీ లోటు
దేశంలో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల కొరత, ఫోరెన్సిక్‌ నివేదికలకు నెలల తరబడి ఆలస్యం, చార్జ్‌షీట్ల దాఖలులో జాప్యం, సాంకేతిక సిబ్బంది కొరత వంటివి విచారణలను మందగిం పజేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్టు-2025’ ప్రకారం దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌లలో శాస్త్రీయ అధికారుల (సైంటిఫిక్‌ ఆఫీసర్స్‌) పోస్టుల్లో దాదాపు 50 శాతం ఖాళీలు ఉండటం గమనార్హం.
​​జిల్లా కోర్టుల్లో కోట్ల సంఖ్యలో పెండింగ్‌
భారత్‌‌లోని జిల్లా కోర్టుల్లో పెండింగ్‌ ‌కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. నేషనల్‌ ‌జ్యుడిషియల్‌ ‌డేటా గ్రిడ్‌ (ఎన్‌‌జేడీజీ) ప్రకారం.. ఈ ఏడాది జులై 23 నాటికి జిల్లా కోర్టుల్లో 1.39 కోట్ల క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో 35 శాతం కేసులు న్యాయవాదులు అందుబాటులో లేకపోవడం, 24 శాతం కేసుల్లో నిందితులు పరారీలో ఉండటం, 17 శాతం కేసులు సాక్షుల సమస్యల వల్ల, 11 శాతం ఇతర కారణాలతో నిలిచిపోయాయి.
​స్లోగా నడుస్తున్న ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు
ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు ఒక న్యాయమూర్తి, ఏడుగురు సిబ్బంది ఉండాలి. అయితే అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పనిచేస్తున్న సాధారణ కోర్టులకే ‘ఫాస్ట్‌ట్రాక్‌’ అనే పేరు పెట్టి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో ఒకే న్యాయమూర్తి రెండు కోర్టుల పనిని నిర్వహించాల్సి వస్తోంది. ఇది న్యాయమూర్తులపై అదనపు పని భారాన్ని పడేలా చేస్తుంది. ​
​ఇవి కావాలి…
ఫాస్ట్‌ ‌ట్రాక్‌ ‌కోర్టులు సమర్థవంతంగా పనిచేయాలంటే రాష్ట్రాల మధ్య సమన్వయం, సాంకేతిక నైపుణ్యం కలిగిన దర్యాప్తు అధికారులు, ఆధునిక సైబర్‌ ఫోరెన్సిక్‌ వ్యవస్థ, తగిన సంఖ్యలో న్యాయమూర్తులు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ఆధునిక డిజిటల్‌ మౌలిక సదుపాయాలు అత్యవసరమని విద్యావేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. వసతుల కొరత, లోపాలను సరి చేయకుండా కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -