Tuesday, July 28, 2026
E-PAPER
Homeఆటలుగాయాల బెడద!

గాయాల బెడద!

- Advertisement -

బుమ్రా, రానా, సుందర్‌, నితీశ్‌‌లకు గాయాలు
రవీంద్ర జడేజాకు ఫిట్‌‌నెస్‌ క్లియరెన్స్‌
నేడు శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు ఎంపిక

ఐపీఎల్‌ ‌ధమాకా, అనంతరం వరుసగా వైట్‌‌బాల్‌ ‌ఫార్మాట్‌ ‌సిరీస్‌‌లు ఆడిన టీమ్‌ ఇండియా.. ఎట్టకేలకు రెడ్‌‌బాల్ ఫార్మాట్‌‌లో మెరిసేందుకు సిద్ధమవుతోంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌‌షిప్‌లో భాగంగా శ్రీలంకతో భారత్‌ ‌రెండు టెస్టులు ఆడనుంది. మంగళవారం భారత జట్టును ఎంపిక చేయనుండగా, కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం ఆందోళనకరంగా మారింది.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఆగస్టు 15 నుంచి భారత్‌, శ్రీలంక టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. సుదీర్ఘ విరామం తర్వాత శ్రీలంక పర్యటనలో టీమ్‌ ఇండియా ఓ వార్మప్‌ ‌మ్యాచ్‌ (‌టూర్‌ ‌గేమ్‌) ఆడేందుకు షెడ్యూల్‌ ‌చేయగా, అసలు సమరంలో బరిలోకి దిగేందుకు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం ప్రస్తుతం ఆందోళక కలిగిస్తోంది. ఇటీవల భారత్‌-ఏ వరుసగా విదేశీ పర్యటనల్లో ఆడటంతో యువ ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌‌షిప్‌లో జరుగుతున్న ఈ సిరీస్‌‌లో రెండు టెస్టుల్లోనూ భారత్‌ ‌విజయం ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో సెలక్షన్‌ ‌కమిటీ జట్టును ఎంపిక చేసేందుకు అన్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తోంది. అజిత్‌ అగర్కార్‌ ‌సారథ్యంలోని సీనియర్‌ ‌సెలక్షన్‌ కమిటీకి బీసీసీఐ వైద్య బృందం నుంచి అందరి ఆటగాళ్ల ఫిట్‌‌నెస్‌ ‌నివేదికలు సోమవారం అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు భారత టెస్టు జట్టును ఎంపిక చేయనున్నారు.

​బుమ్రా ఆడతాడా?
ఐపీఎల్‌ ‌తర్వాత అఫ్గనిస్తాన్‌, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌‌లకు దూరంగా ఉన్న జశ్‌‌ప్రీత్‌ ‌బుమ్రా.. ఇంగ్లాండ్‌‌తో రెండు వన్డేలు ఆడాడు. రెండో వన్డేలో బుమ్రా ఎడమ కాలు మోకాలుకి ఇంపాక్ట్‌ ఇంజూరీ కావటంతో ముందు జాగ్రత్తగా మూడో వన్డేకు విశ్రాంతి తీసుకున్నాడు. రానున్న టెస్టు సీజన్‌ ‌నేపథ్యంలో బుమ్రాను బరిలోకి దింపుతారా? లేదంటే విశ్రాంతి కొనసాగిస్తారా? అనేది తేలాల్సి ఉంది. మరో పేసర్‌ ‌హర్షిత్‌ ‌రానా గాయంతో ఐపీఎల్‌ సీజన్‌‌కు దూరమై.. మళ్లీ జట్టుతో చేరినా మరోసారి గాయం బారిన పడ్డాడు. ఇంగ్లాండ్‌ ‌పర్యటనలో తొడ కండరాల గాయంతో బాధపడిన హర్షిత్‌ ‌రానా పూర్తిగా కోలుకుంటే శ్రీలంక పర్యటనకు వెళ్లటం ఖాయమే. స్పిన్‌ ఆల్‌‌రౌండర్‌ ‌వాషింగ్టన్‌ సుందర్‌ ‌సైతం ఇంగ్లాండ్‌ ‌పర్యటనలో గాయపడ్డాడు. వాషింగ్టన్‌ ‌సుందర్‌ ‌ఫిట్‌‌నెస్‌ ‌సాధించాడా? లేదా? అనేది తేలాల్సి ఉండగా.. హర్ష్‌ ‌దూబె, సరాన్షు జైన్‌ అతడి స్థానంపై కన్నేశారు. ఇటీవల శ్రీలంక-ఏతో నాలుగు రోజుల మ్యాచ్‌‌లో సరాన్షు జైన్‌ ఆరు వికెట్లు, అజేయంగా 70 పరుగులతో రాణించాడు. శ్రీలంక జట్టులో లెఫ్ట్‌ ‌హ్యాండర్స్‌ ఎక్కువగా ఉండటం సైతం ఆఫ్‌ ‌స్పిన్ ఆల్‌‌రౌండర్‌ ‌సరాన్షు జైన్‌ ఎంపికకు కలిసొచ్చే అంశం. పేస్‌ ఆల్‌‌రౌండర్‌ ‌నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి కండరాల గాయంతో ఇంగ్లాండ్‌ ‌సిరీస్‌ ‌మధ్యలో స్వదేశం వచ్చాడు.

సీనియర్‌ ‌స్పిన్నర్‌ ‌రవీంద్ర జడేజా పూర్తి ఫిట్‌‌నెస్‌ ‌సాధించినట్టు తెలుస్తోంది. దీంతో అతడు నేడు సెలక్షన్‌‌కు అందుబాటులో ఉండనున్నాడు. కుల్‌‌దీప్‌ ‌యాదవ్‌, అక్షర్‌ ‌పటేల్‌‌తో పాటు జడేజాను ఎంచుకుంటారా? లేదంటే యువ స్పిన్నర్‌‌కు అవకాశం ఇస్తారా? ఆసక్తికరం. బ్యాటింగ్‌ ‌లైనప్‌‌లో కెఎల్‌ ‌రాహుల్‌, యశస్వి జైస్వాల్‌ ఓపెనర్లుగా రానుండగా.. కెప్టెన్‌ ‌శుభ్‌‌మన్‌ ‌గిల్‌ ‌నం.4 స్థానంలో, సాయి సుదర్శన్‌ ‌నం.3 స్థానంలో ఉండనున్నారు. రిషబ్‌ ‌పంత్‌ ‌వికెట్‌ ‌కీపర్‌‌గా ఎంపిక కానుండగా, ధ్రువ్‌ ‌జురెల్‌ ‌రిజర్వ్‌ ‌వికెట్‌ ‌కీపర్‌‌గా జట్టుతో ఉండనున్నాడు. పేస్‌ ‌విభాగంలో ఫిట్‌‌నెస్‌ ‌సాధిస్తే బుమ్రాతో పాటు మహ్మద్‌ ‌సిరాజ్‌, ప్రసిద్‌ ‌కృష్ణ, గుర్నూర్‌ ‌బరార్‌‌లు ఉండనున్నారు.

భారత్‌, శ్రీలంక టెస్టు సిరీస్‌ ఆగస్టు 15న గాలెలో తొలి టెస్టుతో ఆరంభం కానుంది. రెండో టెస్టు కొలంబోలో 23 నుంచి 27 వరకు జరుగుతుంది. తొలి టెస్టుకు ముందు భారత జట్టు ఓ టూర్‌ ‌గేమ్‌‌లో ఆడనుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌‌షిప్‌ ‌పాయింట్ల పట్టికలో భారత్‌ ‌ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -