30న మతోన్మాద వ్యతిరేక రాష్ట్ర సదస్సు

– 11 వామపక్ష పార్టీల ప్రకటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని 11 వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీలు విమర్శించాయి. ప్రజల దృష్టిని పక్కదోవ పట్టిస్తున్నదనీ, మతోన్మాద విధానాలను ముందుకు తెస్తున్నదనీ, నియంతృత్వ విధానాలను అమలు చేస్తున్నదని తెలిపాయి. బీజేపీ ప్రజా వ్యతిరేక, మతోన్మాద, కార్పొరేట్‌ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 30న ఉదయం పది గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును నిర్వహించాలని నిర్ణయించాయి.
ఈ మేరకు తమ్మినేని వీరభద్రం (సీపీఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), పోటు రంగారావు (సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌), జెవి చలపతిరావు (సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), సాదినేని వెంకటేశ్వరరావు (సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), గాదగోని రవి (ఎంసీపీఐయూ), సిహెచ్‌ మురహరి (ఎస్‌యూసీఐసీ), జానకి రాములు (ఆరెస్పీ), బి సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్‌), రమేష్‌రాజా (సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌), ప్రసాదన్న (సీపీఐఎంఎల్‌) సంయుక్తంగా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లోని గవర్నర్‌ వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటూ ఆయా ప్రభుత్వాలను బీజేపీ పడగొడుతున్నదని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నదని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ (సీఏఏ)ను తెచ్చిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత క్యాంపెయిన్‌కు కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love