పరువు నష్టం కేసులో ఎంపీకి 50 లక్షల జరిమానా..

నవతెలంగాణ-హైదరాబాద్ : పరువు నష్టం కేసులో 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురికి క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. క్షమాపణలను ప్రముఖ జాతీయ వార్తాపత్రికలో ప్రచురించాలని, ఆరు నెలల పాటు సోషల్‌ మీడియాలో కూడా ఉంచాలని సూచించింది. ఎనిమిది వారాల్లోగా ఈ ఉత్తర్వును పాటించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాగా, 2021 జూన్‌ 13, 26న సాకేత్ గోఖలే వివాదస్పద ట్వీట్లు పోస్ట్‌ చేశారు. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి తన ఆదాయానికి మించి స్విట్జర్లాండ్‌లో ఆస్తిని కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆమె భర్త, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గురించి కూడా ఆ ట్వీట్లలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది లక్ష్మీ పురి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఎంసీ ఎంపీ సాకేత్‌ గోఖలేపై పరువునష్టం దావా వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Spread the love