– శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘటన
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబారుకి అక్రమంగా తరలిస్తున్న డైమండ్స్, నగదును డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబారు వెళ్లడానికి ఇద్దరు ప్రయాణికులు ప్రయత్నించారు. వజ్రాలు తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితులు ఎయిర్‌పోర్టుకు రాగానే బోర్డింగ్ ఏరియా దగ్గర ఇద్దరు ప్రయాణికులను అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రయాణికుల సామాను తనిఖీ చేశారు. వారి బ్యాగుల్లో చాక్లెట్ ప్యాకెట్లలో సీల్ చేసిన తెల్లటి కాగితాల్లో చుట్టి జిప్ చేసిన విలువైన రాళ్లు, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, కెమికల్ వేపర్ డిపోజిషన్ (సీవీడీ) డైమండ్స్/నేచురల్ డైమండ్స్‌ను గుర్తించారు. సుమారు రూ.6.03 కోట్ల విలువైన 5569.64 సీటీఎస్ సహజ వజ్రాలు, విదేశీ కరెన్సీ రూ.9,83,509తో పాటు, లక్ష రూపాయల భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.