ముద్దరకాలం ముంచుకొచ్చింది
సుద్దులన్నీ సంకనెక్కే సమయం
సర్రున జారుతా వచ్చేసింది
మధ్యంతరమో
అభ్యంతరమో ఏరుకలే గానీ
సన్నాహాలన్నీ పడగలిప్పుతుంటే
సమస్యంతా ఆడనే కూలబడింది
ఓటెయ్యాలోచ్ అంటూ
సంతోషం ఉట్టినెక్కి ఎక్కిరిస్తాంటే
గాలి కబుర్లన్నీ
గోచీలకు తగులుకుంటున్నాయి
పాత అజెండా పేజీలన్నీ
పూర్తి కాకముందే
కొత్త పలుకులు
రంగులద్దుకున్నాయి
గడపగడపకో జెండా పాతేసి
అడుగడుగునా పథకాల్ని చల్లేస్తామని
మడుగులొత్తే కాలం
కడగడపలోకొచ్చి కూర్చుంది
ఓటెయ్యాలోచ్ అంటూనే
ఉరకలేసే ఉత్సాహాన్ని
పచ్చనోటులో చుట్టేసి విసిరేసింది
ఇప్పుడు కాలానికేసి చూడాలి
ఖద్దరు కార్ల చక్రాలకేసి పొంచాలి
గల్లి గల్లీలోన గిల్లిపొయ్యే
ఓట్ల ఉరకలన్నీ గమనించాలి
తూట్లుపడ్డ తుండుగుడ్డలేసి
తూగుతూ కదలాలి
ఓటెయ్యాలోచ్ అంటూ
మడతపడిన అంగీలను విదిలించి
ఆకలి పేగుల్ని మడతెట్టి
పరుగులు పెట్టాలి
ఓట్లకాలం నోట్ల లెక్కన
ఎగిరొచ్చే సమయం వచ్చేస్తుంది సుమీ
– నరెద్దుల రాజారెడ్డి సెల్: 9666016636