Tuesday, April 28, 2026
E-PAPER
Homeక్రైమ్అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా అరెస్ట్

అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా అరెస్ట్

- Advertisement -

– పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
– వెల్లడించిన డీఎస్పీ సతీష్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు అంతరాష్ట్ర దొంగనోట్ల చలామణి ముఠాను ఛేదించారు. సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15 న అశ్వారావుపేట సంత మార్కెట్‌ లో ఓ ఫర్నిచర్ వ్యాపారి వద్ద రూ.14,500 విలువైన సోఫా కొనుగోలు చేసిన నిందితులు, అసలు నోట్ల మధ్యలో రూ.5,500 విలువైన 11 నకిలీ రూ.500 నోట్లు ఇచ్చి మోసానికి పాల్పడ్డారు. అనంతరం ఆ వ్యాపారి నగదును ఎస్‌బీఐ బ్యాంకులో జమ చేయగా, బ్యాంకు అధికారులు అవి నకిలీ నోట్లు అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఠా గుట్టురట్టు
ఏప్రిల్ 23న కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నిందితులు అశ్వారావుపేటలోని నాయుడు ముత్యాలరావు ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం అందింది. మంగళవారం ఉదయం పోలీసులు ఆ ఇంటిపై దాడి చేయగా, నిందితులు మిగిలి ఉన్న నకిలీ నోట్లను తగులబెడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీసుల దర్యాప్తులో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలానికి చెందిన కోడెల్లి చిన్న ఈ నకిలీ కరెన్సీ సరఫరా చేసినట్లు, మిగిలిన ఇద్దరు నిందితులు మధ్యవర్తులుగా వ్యవహరించి స్థానిక మార్కెట్‌లో చలామణి చేసినట్లు తేలింది.

అరెస్టైన నిందితులు:
కోడెల్లి చిన్న (ఎ1) – ఘంటావారిగూడెం, నల్లజర్ల మండలం, తూర్పుగోదావరి జిల్లా (ప్రధాన సరఫరాదారు)
కూనపాముల దుర్గాప్రసాద్ (ఎ2) – లచ్చాపురం, దమ్మపేట మండలం (మధ్యవర్తి)
నాయుడు ముత్యాలరావు (ఎ3) – మల్కారం, దమ్మపేట మండలం (స్థానిక పంపిణీదారు)

పరారీలో ఉన్న నిందితులు:
సుంకర ఫణి – టి.లక్ష్మీపురం, నల్లజర్ల మండలం. ఇతడే కోడెల్లి చిన్నకు రూ.75 వేల నకిలీ నోట్లు సరఫరా చేసిన ప్రధాన నిందితుడు. ఒక లక్షకు మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తానని నమ్మబలికి, మధ్యలో వైట్ పేపర్లు పెట్టి మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. సుంకర ఆంజనేయులు – సుంకర ఫణి తండ్రి. నకిలీ నోట్ల తయారీ, సరఫరా నెట్‌వర్క్‌లో కీలక పాత్రధారి. సురేష్ రెడ్డి – బాపట్లకు చెందిన వ్యక్తి. సుంకర ఫణి పంపిన నకిలీ నోట్లను నల్లజర్ల వద్ద కోడెల్లి చిన్నకు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్నవి
రూ.500 విలువైన 11 నకిలీ నోట్ల, నేరానికి ఉపయోగించిన 3 ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు (వీవో, రియల్‌మీ, ఒప్పో) నకిలీ నోట్లతో కొనుగోలు చేసిన సోఫా సెట్ రూ.2,000 అసలు నగదు,కాల్చివేసిన నకిలీ నోట్ల బూడిద, సగం కాలిన నోట్ల ముక్కలు, లావాదేవీలకు సంబంధించిన ఫోన్‌పే స్క్రీన్‌షాట్లు.

పోలీసుల హెచ్చరిక:
వ్యాపారులు, సామాన్య ప్రజలు నగదు లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా రూ.500 నోట్లను స్వీకరించే సమయంలో వాటి భద్రతా లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించాలని ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా నకిలీ నోట్లు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -