Tuesday, April 28, 2026
E-PAPER
Homeఖమ్మంనారంవారిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

నారంవారిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్. ఎం. రామ్ ప్రసాద్, డాక్టర్. పి. ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని మంగళవారం నారంవారిగూడెం లో నిర్వహించారు. రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ పంటల దిగుబడులు, భూసార పరిరక్షణ, మార్కెట్‌ కు అనుగుణమైన సాగు విధానాలపై మార్గదర్శనం చేశారు.

డాక్టర్. ఎం. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ భూసార పరీక్షల ఆధారంగా నేల స్వభావానికి తగిన ఎరువుల మోతాదును ఉపయోగించాలని రైతులకు సూచించారు. సేంద్రియ వ్యవసాయం, పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యతను వివరించి, మట్టి నమూనాలను సేకరించే సరైన విధానాన్ని వివరించారు. ఆయిల్‌పామ్ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి నివారణ చర్యలపై సూచనలు అందించారు.

డాక్టర్. పి. ఝాన్సీ రాణి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్న వరి రకాల లక్షణాలు, వాటి దిగుబడి సామర్థ్యం, రైతులకు లభించే ఆర్థిక ప్రయోజనాల గురించి వివరించారు. మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు.

మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరావు రైతులకు ఫెర్టిలైజర్ యాప్ వినియోగం, ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు విధానం గురించి వివరించారు. వ్యవసాయ విస్తరణ అధికారి ఎ. సతీష్ మాట్లాడుతూ పీఎం కిసాన్, రైతు బంధు తదితర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. డాక్టర్. స్వప్న పశువుల్లో వచ్చే నట్టల వ్యాధి, గాలికుంటు వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలు, టీకాల ప్రాముఖ్యతపై రైతులకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగమణి, అంగన్‌ వాడీ టీచర్లు, విద్యార్థులు, రైతులు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -