Thursday, April 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమక్కలు, మామిడి వర్షార్పణం

మక్కలు, మామిడి వర్షార్పణం

- Advertisement -

భారీ గాలులకు మామిడికాయలు నేలమట్టం
వర్షానికి తడిసి ముద్దయిన మొక్కజొన్న, ధాన్యం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటలు అకాల వర్షానికి నేలపాలయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులకు మామిడికాయలు నేలమట్టమైతే.. గంటపాటు కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన మక్క నీటిపాలయింది. మార్కెట్లో దారి వెంట ఉంచిన మక్కలు గుగ్గిళ్లుగా మారాయి. పొద్దంతా వర్షం వచ్చే సూచనలేమీ లేకపోవడంతో రైతులు మొక్కలను కుప్పలుగా పోయలేదు. కానీ, రాత్రి ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. నాగర్‌ కర్నూల్‌ వనపర్తి జిల్లాలో మామిడి రైతులు నిలువునా మునిగారు. నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మంగళవారం 1,50,000 బస్తాల్లో మక్కలు నింపి ఉంచారు. మరో లక్ష 50 వేల క్వింటాళ్లు ఆరబోశారు. వీటితోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్లే రహదారులపై లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలను ఆరబోశారు. ఆరబోసిన మక్కలను కుప్పలుగా పోసే సమయం కూడా లేకుండా వర్షం అకస్మాత్తుగా కురిసింది. వ్యవసాయ మార్కెట్లో కాలు పెట్టే సందు లేకుండా మక్కలు ఆరబోశారు. వారం రోజులుగా సంచులను తీసుకెళ్లాలని రైతులు మొరపెట్టుకున్నా మార్క్‌ఫెడ్‌ అధికారులు పట్టించుకోలేదు. దాంతో వర్షానికి కండ్ల ముందే మక్కలు నీటిలో కలిసిపోయాయి. మరోవైపు అరకొరగా ఉన్న మామిడి కాయలు గాలులకు పూర్తిగా నేలరాలాయి. ముఖ్యంగా కౌలుదారులు తీవ్రంగా నష్టపోయారు. కొల్లాపూర్‌లో మామిడి చెట్ల కొమ్మలు కూడా విరిగాయి. కాయలన్నీ నేలమట్టమయ్యాయి. కొల్లాపూర్‌లోనే దాదాపు ఐదు కోట్ల పైగా నష్టం వాటిల్లిందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన చెందుతున్నారు.

మామిడి తోట రైతులను ఆదుకోవాలి
కొల్లాపూర్‌ మండలంలో అకాల వర్షాలకు, ఈదురు గాలులకు మామిడి తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రాంతంలో మార్కెట్‌ లేక.. మద్దతు ధర లేక మామిడి తోటల రైతులు మంచి ధర కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే అకాల వర్షం వారిని తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. ఈ రైతులకు ఎకరాకు లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. కొల్లాపూర్‌ ప్రాంతంలో మామిడికి మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి. మక్క రైతులనూ ఆదుకోవాలి. లేని యెడల రైతుల్ని సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం.
– రైతు సంఘం నాగర్‌కర్నూల్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు

రైతులు సంయమనం పాటించాలి
రైతులంతా ఒకేసారి మక్కలను మార్కెట్‌లోకి తేవడం వల్ల కాంటాలు పెట్టడానికి హమాలీల కొరత ఏర్పడింది. 1,50,000 బ్యాగులు మార్కెట్లో ఉన్నాయి. వాటిని తరలించడానికి హమాలీలు దొరకడం లేదు. గ్రామాల నుంచి హమాలీలను తెప్పించి లారీలు నింపేలా ప్రయత్నం చేస్తున్నాం. రైతులు సంయమనం పాటించాలి. రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు.
-నాగర్‌కర్నూల్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మెన్‌ రమణారావు

మాకు దిక్కెవరు..?
నాగర్‌కర్నూల్‌ మార్కెట్లోకి 15 రోజుల కిందట మక్కలు తెచ్చాం. అధికారులు వస్తున్నారు పోతున్నారు తప్ప కొనుగోళ్లు మాత్రం చేయలేదు. ఆరబోసిన మక్కలు రాత్రి వర్షానికి నీళ్లపాలయ్యాయి. ఇప్పుడు ఆ పంటను తీసుకుంటారా లేదా? ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
– రైతు లక్ష్మయ్య- దేశిటికాల

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -