”ప్రతిఘటిస్తున్నంతవరకూ నువ్వు ఓడిపోయినట్లు కాదు” అంటాడు హసన్‌మమ్దాన్. ఆయన ప్రజాదరణ పొందిన కవి. లెబనాన్ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. ఆ మాటలు మనకు ప్రాత:స్మరణీయులు. ఆశ్యర్యమేమంటే ఆయన మాటల్ని నేటికీ ఆ పార్టీ సభ్యులు అమలు చేస్తూండటం. ”లెబనాన్‌లోని ప్రతి పోరాటయోధుడ్ని చూసి అలెగ్జాండర్ ది గ్రేట్ ఈర్షపడ్తాడు” అంటాడు 20వ శతాబ్దపు అత్యుత్తమ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్. మేడే సంగతులు 1886 చికాగోలో కాకుండా ఇజ్రాయిల్ దాష్టీకాన్ని ఎదిరిస్తున్న 2026 లెబనాన్‌తో ప్రారంభించడమెందుకు? చికాగో కార్మికుల వీరత్వం, 8 గంటల పనిదినం కోసం వారి రక్తతర్పణం, ఉరికంబాలెక్కిన వారి త్యాగధనం ఆచరణీయం! చికాగోలో సరిగ్గా 140 ఏండ్ల క్రితం అగ్నిపర్వతం బద్ధలైనమాట నిజం. ఆ లావా ఖండాంతరాల్లోకి విస్తరిస్తున్నదన్న మాట కూడా అంతేనిజం. అది నేడు నోయిడాలో ఫెళఫెళ విరుచుకుపడ్డమాట మరో పచ్చి నిజం. అందుకే, 2026 మేడే సంగతులు మన దేశంలో ఇక్కడే ప్రారంభించాను.
క్రియా – ప్రతి క్రియా!
భారతదేశానికి సంబంధించినంత వరకు 2014లో మోడీ ప్రతిష్టాపనతో ఒక పనైపోయిందనుకున్నారు భారత కార్పొరేట్లు. 2019లో వేజ్‌కోడ్ తన మందబలంతో నెగ్గించుకున్న బీజేపీ 2020 కరోనా సమయంలో ఉద్యమాలకు అనుకూలంగా ఉండదని మొత్తం ప్రతిపక్షాన్ని బయటికి నెట్టి మిగిలిన మూడు కోడ్‌లూ ఆమోదించుకుంది. ఇల్లలకంగానే పండుగ కాదని మనకు తెలుసు. గ్రేటర్ నోయిడా, గురుగ్రాం, యావత్ ఎన్‌సీఆర్ ప్రాంతంలో 40 వేల నుంచి 50 వేల మంది రోడ్లపైకి వచ్చారు. యజమానులకు సవాలు విసిరారు. నెలకు 10-12 వేల రూపాయల జీతం, 10-13 గంటల పనిదినం ఓవర్‌టైమ్ చేస్తే రెట్టింపు వేతనం లేదు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సాంఘిక భద్రత కరువే. బోనస్ అసలే లేదు.
కార్మికుల బతుకులు యూజ్ అండ్ థ్రో గ్లాసుల్లాగా ఉన్నాయి. వారి కడుపు మంటతో ఆ పారిశ్రామికవాడ భగ్గుమంది. కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ దీని కేంద్రం. సీఐటీయూ అధ్యక్షుడన్నట్లు ”అది ధైర్య సాహసాలతో కూడిన వర్గ పోరాటం”. ఏప్రిల్ ఒకటి నుండి కోడ్‌లు అమల్లోకొచ్చినాయనే భయంలేదు. యూపీ, హర్యానాల్లోని 67.8శాతం శాశ్వత కార్మికులకు రాతపూర్వకమైన వేతన ఒప్పందాల్లేవు. 62.4శాతం మంది కార్మికులు వేతనంతో కూడిన సెలవులకు అర్హులు కాదు. 59.2శాతం మందికి ఎటువంటి సాంఘిక భద్రతా లేదు. అనేక ఉత్తర, పశ్చిమ భారత రాష్ట్రాలు, గుజరాత్‌లో సూరత్, అహ్మదాబాద్, వడోదర, జామ్‌నగర్ వంటి అన్ని చోట్ల కార్మికుల పరిస్థితి ఇదే. ఈ ప్రాంతంలోని అత్యధికులు వలస కార్మికులు, పొయ్యి మీదనే కాదు, పొయ్యి కిందికి కూడా ఇబ్బందులున్నవారు. బ్లాక్‌లో గ్యాస్ సిలిండర్ రూ.600 అదనంగా పెట్టి కొనాల్సిందే. ఆహారధాన్యాల ధరలూ వీరికి అందుబాటులో లేవు. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు. 2014 నుండి కనీస వేతనాలు పెంచని యూపీ సర్కార్ ఇపుడు పెంచినట్లు చేసింది. రూ.11,313 నుంచి రూ.13,690కి పెరిగాయి.
దాంతో కార్మికులు రగులుతున్నారు. ట్రంప్ టారిఫ్‌లతో కొంత, ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంతో మరికొంత నిత్య జీవితావసర సరుకుల ధరలన్నీ చుక్కల్లోకి చేరాయి. గతంలో రైతులు ఢిల్లీని ముట్టడించారు.ఇపుడు ఢిల్లీ చుట్టూ కార్మిక విస్ఫోటనం! లేబర్ కోడ్‌లు డెబ్బయి శాతం ఫ్యాక్టరీలనూ, తొంభై శాతం సంఘటితరంగ కార్మికులను కార్మిక చట్టాల పరిధి నుండి బయటికి నెట్టేశాయి. కార్పొరేట్ల ఆనంద డోలికలు ఆగిపోకపోయినా నిదానించడానికి కారణం దోపిడీ వేట ‘చదరంగం’ కాదు. సిపాయిలకు ఈ రూట్, గుర్రాలకు ఈ రూట్ అంటూ ఉండదు. ఈ సమ్మెను వర్ణిస్తూ సీఐటీయూ అధ్యక్షులు సుదీప్‌దత్తా కార్మికుల జీవితాలతో కార్పొరేట్ల ఆట, సయ్యాట అసాధ్యమన్నారు. మొన్న ఫిబ్రవరి 12 అఖిల భారత సమ్మె ”ఆర్థిక డిమాండ్లపై చేసింది కాదు. అది రాజకీయ సమ్మె” అన్నారు. ఎందుకంటే మోడీ సర్కార్ కేవలం యజమానుల లాభాలు మాత్రమే చూస్తోంది. మల్టీ స్పిండిల్ మెషిన్లో, రోబోట్లో వాడి పెట్టుబడిదారుల బొజ్జలు మాత్రమే నింపితే దేశంలో తయారయ్యే సరుకులు కొనుగోలు చేసేది ఎవరు? అందుకే కనీసావసరాలైన తిండి, బట్ట, ఇళ్లకు డిమాండు కరువైంది.
దేశంలో, పేదరికం, తగ్గిపోయిందని ఒక పక్క ప్రచారం చేస్తూ ప్రధానమంత్రి ‘గరీబ్ అన్న యోజన’ కింద ఒక్కొక్క మనిషికి ఐదు కిలోల చొప్పున ప్రతి నెలా 81 కోట్ల మందికి ఇస్తామని చెప్పడమే సర్కారీ ఆర్థికవేత్తలు చెప్పేది తప్పుడు లెక్కలని వారికి వారే అంగీకరించినట్లయింది. ‘ప్రధానమంత్రి ఆవాజ్ ఆయోజన’ రెండుకోట్ల ఇండ్లు కడతామనేది సిమెంట్లు, ఫ్లైయాష్‌తో చేసిన ఇటుకలువంటి ఇతర సరుకులు అమ్ముడవ్వాలికదా!? లేబర్‌కోడ్స్ నోటిఫై అయిన మరుక్షణం ప్రారంభమై 2025 నవంబర్, డిసెంబరు మాసాల్లో సాగిన మోడీ నామ సంకీర్తనలు నిశ్శబ్దమై పోయినాయి. వారికే విషయమర్థమై భజన ఆపేశారో, శ్రోతలు నోట్లో ఉమ్మేయడంతో ఆపేశారో తెలీదు గుడ్డలూడదీసి నిలబెట్టారు కార్మికులు! ‘యూనియన్ల స్థాపనను అసాధ్యం చేస్తూ, ఈ కోడ్‌లు సమ్మెలను దాదాపు నిషేధిస్తాయి” అరవై రోజుల ముందే యాజమాన్యానికి తెలియజేయడం వంటి వాటివల్ల! అని భయపడ్డాం. నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రాంతోపాటు ఎన్‌సిఆర్‌లో ఏ నోటీసులిచ్చారు ఆ కార్మికులు? పైన చెప్పినట్లు కడుపుమండింది. రోడ్డెక్కారు! అనేక పారిశ్రామిక ప్రాంతాల్లో దేశంలో పరిస్థితిదే!.
”నీ ప్రత్యర్థి తప్పులు చేస్తుంటే అతన్ని డిస్టర్బ్ చేయకు” -నెపోలియన్.
పైది ఒక యుద్ధతంత్రం. ప్రస్తుతం మనం కార్పొరేట్ శక్తులతో యుద్ధమేగా చేస్తున్నాం!? ఫిబ్రవరి 12 సమ్మెకు ముందు సుదీప్‌దత్తా రాసిన వ్యాసంలో ”కొత్త రోజుల్లోకి కాలు మోపుతున్నాం. చట్టబద్ధతని దాటి ముందుకు పోవాలని మనకు తెలుసు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ధిక్కరించి ప్రజాతంత్ర హక్కులను కాపాడుకుంటామని దిక్కులు పిక్కటిల్లేలా అరుద్దాం. ఉచ్ఛదశ పోరాటాల్లోకి ప్రవేశిస్తున్నాం. రెండునెలలు కాకముందే ఎంత విస్ఫోటనం?! 1886 పునరావృతం అయినట్లులేదా? 1978లో జనతాపార్టీ హయాంలో ఐఆర్ బిల్లు కార్మిక సంఘాల ఉధృతికి చెత్తబుట్టలోకి చేరినా, పట్టువదలని కార్పొరేట్లు 1998-2004 మధ్య వాజ్‌పారు సర్కార్‌ని వత్తిడి చేసి రెండవ జాతీయ లేబర్ కమిషనర్‌తో సిఫార్సులు 2002లో చేయించారు. ప్రస్తుత కోడ్స్ పుస్తకంలో 2002 రెండవ జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సుల్లోని సారాంశాన్ని ”ప్రస్తుత కార్మిక చట్టాలన్నిటినీ విడివిడిగా కట్టగట్టి స్థూలంగా 1.పారిశ్రామిక సంబంధాలు, 2.వేతనాలు, 3.సాంఘిక భద్రత, 4. భద్రత, 5.సంక్షేమం పని పరిస్థితులుగా విడగొట్టాలని ప్రతి కోడ్ ప్రారంభంలో రాశారు. ప్రస్తుతం చివరి రెంటినీ కలిపి ఒక కోడ్‌గా చేశారు. మిగతావన్నీ యథాతథంగా ఉన్నాయి.
కార్పొరేట్ల సేవలో కోడ్‌లపేర సాగుతున్న నరమేధాన్ని భారతీయులు శాశ్వతంగా అంగీకరిస్తారనుకున్నారు బీజేపీ నేతలు.
బంగ్లాదేశ్, నేపాల్‌లలో తిరగబడ్డ యువత లాంటి వారు కాదు ఈ యువ కార్మికులు. అందుకే ‘జెన్‌జీ’లా వీరి సబ్జెక్ట్ అవినీతి కాదు. ఆ ‘ట్రిక్’ని అన్నాహజారే, షీలాభిడే వంటి వారిని ఉపయోగించి మోడీ పదేండ్ల క్రితమే ఆనాటి కాంగ్రెస్ అవినీతిపై ‘విజయవంతం’గా పోరాడి కుర్చీ ఎక్కేశాడు. కానీ నోయిడా కార్మికులు ఏనుగు కుంభస్థలాన్నే కొట్టారు. కార్పొరేట్ల లాభాలపై గురిపెట్టారు. తమపై సాగే దోపిడీ ఇంకెన్నాళ్లని అడుగుతున్నారు. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ (ఓఎస్‌హెచ్)లో సబ్ క్లాజ్ 6లో పేర్కొన్నట్టు ‘నిర్దిష్ట’ వయోపరిమితి దాటిన తర్వాత (ఎంతో రాయలేదు) ‘కొన్ని’ పరిశ్రమల్లో (ఏ పరిశ్రమలో లేదు) ఫ్రీగా హెల్త్ చెకప్ చేస్తారట! భజంత్రీలు మాత్రం ఫ్రీగా వైద్యం చేస్తారన్నంత భజన చేశారు 2025 చివర్లో! ఇంత జాగ్రత్తగా చట్టాలు రాసేవారు పొరపాట్లు రాస్తారనుకోలేం. అంత:రాష్ట్ర వలస కార్మికుల్లో (హిమ్ సెల్ఫ్) మగవారి గురించే ఉంది. జతల్లెక్కన కార్మికుల్ని టోకుగా పోగేసి, రాష్ట్రాలు దాటించే కాంట్రాక్టర్లు (ఉదా: ఒరిస్సా, శ్రీకాకుళం కార్మికులు ఇటుక బట్టీల్లో, భవన నిర్మాణ రంగంలో తెలంగాణ అంతా ఉన్నారు) చట్టంలో ”హర్‌సేల్ఫ్” లేదని యాజమాన్యాలు పేచీ పెట్టచ్చు. సబ్ క్లాజ్ 13లో ఒక రాష్ట్రంలో లైసెన్స్ తీసుకుని దేశంలో ఎక్కడైనా కాంట్రాక్టు కార్మికుల్ని వాడుకోవచ్చని రాశాడు. కోర్ యాక్టివిటీని స్పష్టంగా రాసినదాన్ని బట్టి జిహెచ్‌ఎంసిలో చెత్త ఊడ్చే కాంట్రాక్టు కార్మికులు, లారీల్లో చెత్త డంపింగ్ యార్డ్‌కు తరలించే కార్మికులూ కోర్ కార్మికులే.
ఈ కోడ్‌కు, కార్పొరేట్ రాజకీయానికీ ఉన్న అంత:సంబంధం ఓఎస్‌హెచ్ కోడ్‌లో స్పష్టంగా అర్థమవుతుంది. ఇరవైమంది కంటే ఎక్కువ కార్మికులున్న మైన్‌లో వివాదమొస్తే పరిష్కారం చేసే పని శాంతిభద్రతల యంత్రాంగానిదట (జిల్లాకు మేజిస్ట్రేట్, డీఎస్‌పీలు) ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో మైన్ ఉంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే మేజిస్ట్రేట్‌దట! ఓఎస్‌హెచ్ కోడ్‌ను జల్లెడపట్టే కొద్దీ ఇలాంటివి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మిగతా మూడు కోడ్‌లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. కార్పొరేట్లు తమ బొజ్జలు నింపుకునే పనిలో ప్రభుత్వాలను ఉపయోగించి ఈ కోడ్‌లకు తెగించారు. అందుకు ప్రతిగా బీజేపీ భోషాణాలు నింపుతున్నారు. 2021-22లో రూ.1917 కోట్లకు పైగా తన ఆదాయమున్నట్లు బీజేపీ ప్రకటించుకుంది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీంను సుప్రీంకోర్టు రద్దుచేసుండకపోతే బీజేపీ బొక్కసాలు, భోషాణలు పొంగిపొర్లుండేవి.
కార్పొరేట్లను కాచుకునేదే మతోన్మాదం
మనదేశంలో మతోన్మాదం ఒక రాజకీయ వ్యూహం. రామజన్మభూమి, గోరక్షణ వంటివి బీజేపీని అందలమెక్కించాయని మనకు తెలుసు. దౌలత్‌ఖాన్, సిద్ధిహిలాల్, నూర్‌బేగ్, ఇబ్రహీమ్‌ఖాన్, సుల్తాన్‌ఖాన్ వంటి ఎందరో ముస్లిం సైన్యాధ్యక్షుల్ని, నౌకాదళాధిపతుల్ని నియమించుకున్న శివాజీని ముస్లిం వ్యతిరేకంగా చిత్రించడం వంటివి గత 70/80 ఏండ్లకిపైగా సాగుతోంది.
కొన్ని మతాల్ని లక్ష్యంగా పెట్టుకుని, కొన్ని సింబల్స్ ఎంపిక చేసుకుని హిందూత్వ శక్తులు మన దేశంలో పెరిగాయి. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిరుద్యోగం పైపైకే పోతోంది. ఏ హిందువుల అభ్యున్నతి కోసం బీజేపీ పాటుపడుతున్నదని చెప్పుకుంటుందో దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులే ఈ ఆర్థిక విధానాలవల్ల, మిగతా అన్ని మతాలతోపాటు చితికిపోతున్నారు. ఇపుడీ లేబర్‌చట్టాలపై నోయిడాలో తిరగబడింది కూడా మెజారిటీ హిందూ కార్మికులే కదా. పశుమాంస ఎగుమతిదారులో బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియాలు మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమంటే మన బీఫ్ ఎగుమతిదారులంతా బీజేపీ నాయకులే! గూగుల్ తల్లినడుగుతే గుట్టు రట్టవుతుంది. తేలిగ్గా ఊదేయగలమని చెప్పలేంగానీ, చైతన్యవంతంగా ప్రతి కోడ్ అనుపానులు అర్థం చేసుకుని ఒక నిరంతర పోరాటం చేయడమే ఈ మేడే కర్తవ్యం.
”నువ్వు గెలిచావా ఓడావా కాదు, అసలు నువ్వు యుద్ధం చేశావా లేదా ముఖ్యం” అన్న ‘చే’ మాటలే మన మార్గం.
ఆర్.సుధాభాస్కర్



