కూరెళ్ల నాకు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తెలుసు. తెలవడం అంటే ఆర్టిస్టుగానే. నేనూ బొమ్మలేస్తాను. బొమ్మలేయడంలో నేనే సీనియర్ను. కానీ నిరంతరసాధనలో గొప్పగా బొమ్మలు గీయడంలో శ్రీనే ముందుంటాడు. తొంభైలలో నేను కొంతకాలం ‘చెకుముకి’ బాలల పత్రిక నిర్వహిస్తున్న ప్పుడు దానికి బొమ్మలు కూరెళ్లే వేసేవాడు. ప్రభుత్వం విద్యార్థులకోసం పుస్తకాలు తయారు చేస్తున్నప్పుడు శ్రీను, నేను బొమ్మలు వేసాం. ఆ తర్వాత పాఠ్యపుస్తక చిత్రకారు డిగా ప్రసిద్ధి పొందాడు శ్రీను. చిత్రాలు గీయడంలో ఆ చేయి ఎక్కడా ఆగలేదు. గోదావరి, కృష్ణ నదుల్లా అందమైన మెలికల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సాక్షరతా ఉద్యమంలో తన రేఖలతో వయోజనులకు అక్షరంపై ఆసక్తిని పెంపొందించాడు. రచయితల, కవుల రచనల అంతరాత్మను పట్టుకుని అనేక సంపుటాలకు ముఖచిత్రాలను అందించాడు. ప్రసిద్ధుల కవితలకు బొమ్మలతో అర్థాలు వివరించాడు.
ఇక తప్పక గుర్తుచేసుకోవాల్సిన ఘట్టమొకటుంది. మేము నిర్వహించే తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్ సందర్భంగా 2016లో తెలంగాణలో సాహితీ ప్రముఖుల చిత్రాలను కాన్వాస్‌పై గీయమని మేము కోరగానే, అతి తక్కువ సమయంలోనే ఇరవై చిత్రాలు అత్యంత సజీవంగా, వారి రచనా వస్తువుల నేపథ్యాలతో సహా పెయింటింగ్స్ వేసి ఇచ్చాడు. ఇవి ఒట్టి బొమ్మలే కాదు, సాహిత్య చరిత్రకు, చైతన్యానికి అద్దం పట్టేవి. అలా రూపకట్టాడు కూరెళ్ల. చిత్రకారునికి కేవలం చిత్రాలు గీయటం, రంగులు వేయటంలో మాత్రమే నైపుణ్యముంటే, బొమ్మలు గొప్పగా ఉండవచ్చు. కానీ చారిత్రక నేపథ్యం, సాహిత్య సృజనసారం, సామాజిక ప్రభావం అన్నీ తెలిసి చిత్రించిన బొమ్మలు సజీవంగా వీక్షకులతో సంభాషిస్తాయి. భావ గంభీరతతో అలరారుతాయి. కూరెళ్ల చిత్రాలు అలా వుంటాయి. అంటే అంత అవగాహన గల సృజనశీలి శ్రీను.
కరోనా కాలం అనుకుంటా! కవుల, రచయితల చిత్రాలే కాదు, తెలుగు నేలపై ప్రసిద్ధుల బొమ్మలను రోజుకొ కటి చొప్పున గీసి మనకందించాడు. సృజనాత్మకతతో పాటు శ్రద్ధ, శ్రమ జోడించడం ఆయన ప్రత్యేకత. కూరెళ్ల ఇన్ని ప్రత్యేకతలతో రూపుదిద్దుకోవటానికి, ఆయన పుట్టినప్రాంత వాతావరణం కూడా ఒకటి. నల్లగొండ కార్టూనిస్టులకు, ఆర్టిస్టులకు ప్రసిద్ధమయినది. శంకర్, కంభాలపల్లి శేఖర్‌లతో పాటు, వారికి ముందూ ఎంతో మంది అద్భుతమయిన కళాకారులను కన్న నేల అది. ఇకపోతే జన్మపర వారసత్వం తల్లిదండ్రుల రూపంలో స్పష్టంగానే కనపడుతుంది. సృజనశీల వృత్తి సమూహాల నుండి వచ్చే నైపుణ్యాలు, వాటిని అందిపుచ్చుకుని మెరుగులు దిద్దుకోవటం, ఆధునికమవ్వటం కూరెళ్ల చేసిన మహత్తర కృషి.
నిజంగా రంగులకు, రేఖలకు ఒక నిశ్శబ్ద భాష ఉంటుంది. దాన్ని నేర్చుకున్నవాళ్లే చిత్రాల్లో జీవం పోయగలు గుతారు. ఇది చాలా కష్టమైన మేధో సాధన. ఎందుకంటే వంద పేజీల సాహిత్య పుస్తక భావనను ఒక్క బొమ్మలో పలికించగలడు చిత్రకారుడు. ఆ భాషా అభ్యాసంలో కూరెళ్ల శ్రీను నివాసముం టున్నాడు.ఆయన గీసిన చిత్రాలపై విశ్లేషణ చేయటంలేదుకానీ స్థూలంగా తన మనసుకు, చేతికి ఒక మహత్తర నైపుణ్య సమన్వయాన్ని సాధిస్తున్నాడు శ్రీను. మన నేలపై చిత్రకళా విమర్శ పెద్దగా లేదు కానీ అత్యంత అవసరమై ఉన్నది. ఎందుకంటే ఆ రంగంలో ఉన్నత విమర్శ ఉంటేనే కృషి చేస్తున్న వారికి సరైన గుర్తింపు రావటానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, కళాకారులు మరింత నైపుణ్యాలు, పరిణితి సాధించడానికీ వీలవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కళావిమర్శ పెరగవలసి ఉంది. ఇకపోతే, సాధారణంగా, చాలావరకు కళాకారులు మానవీయ హృదయులై ఉంటారు. కూరెళ్ల ఆ హృదయంతో పాటుగా ప్రగతిశీల భావాలతో చైతన్యయుతమైన ఆలోచనలు కలిగి ఉన్నవాడు. అందుకు తను పుట్టిన నేల ప్రభావమూ కారణం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వమూ ఉంది.
మృదుస్వభావి, స్నేహశీలి అయిన కూరెళ్ల, ఇప్పటి వరకు తన వృత్తి విధులను సమర్థంగా నిర్వహిస్తూనే కళా నిబద్ధతను చాటుకున్నాడు. కళాకారుడిగా అసలు విశ్వరూపం చూపించే సమయం ఇప్పుడొస్తున్నదని నేను భావిస్తున్నాను. భావిసమాజానికి ఉపయుక్తమైన భావనల ఆధారంగా, ఎప్పటికీ నిలిచిపోయే కృషిని చేయాలని కోరుకుంటున్నాను. మరింత ఉన్నతంగా ఎదిగి తెలంగాణ నేలకు గర్వకారణంగా నిలవాలని, ప్రజా సాంస్కృతిక ప్రయాణంలో ముందుండాలని కోరుకుంటున్నాను.
కటుకోజ్వల ఆనందాచారి, 9948787660
కళాభాషను పట్టుకున్న కూరెళ్ల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



