నవతెలంగాణ-హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 65 (NH 65) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం చోటుచేసుకున్న వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా మారింది. మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో నేషనల్ హైవేపై యూ టర్న్ తీసుకుంటున్న ఒక ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ సడన్‌గా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు విడిచారు. దీంతో ఈ ఒక్క ప్రమాదంలోనే మొత్తం ఏడుగురు మరణించగా, మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మృతులంతా కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరా ప్రాంతానికి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు.
కోహీర్ మండలం వెంకటాపూర్ కూడలి సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై ఓ కారు రోడ్డు డివైడర్ పైనుంచి అవతల వైపు ఎగిరి పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.



