Saturday, August 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమోడీ-షాలను భయపెట్టిన సభాపర్వం

మోడీ-షాలను భయపెట్టిన సభాపర్వం

- Advertisement -

జంతర్‌‌మంతర్‌ ‌నిరసనలు ఆగినా ఆ ప్రతిధ్వనులు మాత్రం పాలకులను భయపెడుతూనే వున్నాయి. ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా పార్లమెంటు మొహం చూడటానికే జంకుతున్న పరిస్థితి. తనకు ఎనిమిది సెకండ్లలో నిద్ర పడుతుందని మోడీ ఎంపీలతో ఇష్టాగోష్టిలో చెప్పారు గానీ నిజానికి రాత్రివేళల్లోనే వరస వీడియోలు విడుదల చేసి తన ఆందోళన బయటపెట్టుకున్నారు. చివరకు విశ్వగురువు ఆదిగురువు ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ ‌భగవత్‌ ‌రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది. జంతర్‌ ‌మంతర్‌ ‌జాతి వ్యతిరేకులన్నట్టు బీజేపీ-ఆరెస్సెస్‌ ‌సోషల్‌‌మీడియా ప్రచారం సాగిస్తే, నిరసన తప్పు కాదని, ఆ యువత జాతి వ్యతిరేకులు కాదనీ గురూజీ సుభాషితాలు చెప్పారు. మరి తన శిష్యకోటికి ఈ మంచి మాటలు బోధించలేదా? అలాంటి వారిపై అమానుష నిర్బంధం గురించి ప్రశ్నలు మోహన్‌ ‌భగవత్‌ ఎందుకు దాటేశారు?‌ చిక్కుల్లో చిక్కిన మోడీని ఆదుకోవడానికీ, యువతను గందరగోళ పరచడానికి తప్ప! ఆ తర్వాతనైన పార్లమెంటులో ప్రభుత్వ ధోరణి మారిందా అంటే లేదు.

మోహన్‌ ‌భగవత్‌ ‌చెప్పినట్టు యువ నిరసనకారులు జాతిద్రోహులు కాదని, జరిగిన దాడులకు విచారిస్తున్నామని, క్షమాపణ చెప్పడానికి లేదా విచారం వెలిబుచ్చబడానికి షాకు అభ్యంతర మేమిటి? మోడీ కూడా రీల్స్‌‌లో చెబుతారు తప్ప సభకు లేదా మీడియాకు చెప్పరు. బయటవారి విష ప్రచారాలు షరామామూలుగా సాగుతుంటాయి. అంతేగాక అమిత్‌ ‌షా వచ్చి మాట్లాడితే మీరు తట్టుకోలేరని శుక్రవారం పార్లమెంటులో మంత్రి కిరణ్‌ ‌రిజిజు అయితే ఏకంగా బెదిరింపులకే దిగారు. మోడీ టీం కపటనాటకాలు అందుకు ఆరెస్సెస్‌ అధినేతల అండదండలు వీటిని బట్టే తెలుస్తాయి. సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్‌ ‌దీప్కే కూడా భగవత్‌ ‌మాటలను స్వాగతిస్తూ కొన్ని కోర్కెలు వినిపిం చారు. రాజకీయాలలోకి ఇప్పుడే వచ్చే ఆలోచన లేదంటూ పార్టీలపై వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు ఎక్కడ పోరాడినా మద్దతునిస్తామంటూ, వివిధ చోట్ల పరిస్థితులపై అధ్యయనం చేయడానికి పన్నెండుమందితో ఒక కమిటీని నియమించారు. మరోవైపున వారిపై మీడియాలో రకరకాల కథనాలు కొనసాగుతూనే వున్నాయి.

ఆ బిల్లు కోసమే హడావుడి
వాటిని అలావుంచి మళ్లీ పార్లమెంటుకు వస్తే అమిత్‌ ‌షా ప్రతిపక్షాల మాటనే కాదు, సభాపతి ఉపరాష్ర్టపతి రాధాకృష్ణన్‌ ‌మాటను కూడా పెడచెవిన పెట్టడం విపరీతం. పలు వాయిదాల తర్వాత ఆయన సభ్యుల మాటను మీరు అమిత్‌ ‌షాకు చెప్పండంటూ రిజిజును పురమాయించారు. కానీ ఫలితం లేకపోగా ఎదురుదెబ్బ తగిలింది, సభలో ఏ విషయం ఏమంత్రి మాట్లాడాలో ప్రతిపక్షాలు చెప్పలేవని తోసిపుచ్చారు. అనుకున్న సమయంలో అమిత్‌ ‌షా వచ్చి మాట్లాడితే ప్రతిపక్షాలు తట్టుకోలేవని బెదిరించారు. గతంలో పెద్దనోట్ల రద్దు, రైతు ఉద్యమం, కాశ్మీర్‌ 370‌ రద్దు వంటి అంశాలపై ప్రధాని మోడీ మాట్లాడకుండా దాటేసిన తీరు ఇప్పుడు పునరావృతమవుతున్నది. కానీ మరో వైపున ఆయన ఎంపీలతో విడిగా సమావేశాలు జరిపి సందేశాలిస్తున్నారు, సంకేతాలు వదులుతున్నారు. ఢిల్లీ చాలా ప్రమాదకరమైన చోటు మీరు జాగ్రత్తగా వుండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సభలో పరీక్షల లీకుల నిరోధం, వందేమాతరం బిల్లులు ఆమోదింపచేసుకుని, మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అనే నియోజవకర్గాల పెంపు బిల్లు ఆమోదింపచేసుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. ఇందుకోసం ప్రతిపక్ష నేత రాహుల్‌‌గాంధీతో చర్చలు జరిపి ఒప్పించేందుకు విఫలయత్నం చేశారు. అయోధ్య రామాలయ నిధుల గల్లంతు, విద్యార్థుల నిరసనపై హింసాకాండకు అమిత్‌ ‌షా క్షమాపణ చెప్పేవరకూ వేరే చర్చకు అవకాశం లేదని ప్రతిపక్షాలు తేల్చిచెప్పడంతో సభలో కొత్తదాడి చేసి మొత్తంగా వాయిదా వేశారు.

లీకులకు శిక్షలు పెంచే బిల్లుతో పాటు వందేమాతరం బిల్లు వంటివి ఆమోదించుకోవడంలోనూ చాలా రాజకీయం వుంది. రేపు ఆగష్టు 15న ఎర్రకోట కార్యక్రమంలో వందేమాతరం మొత్తం పాడి తమ దేశభక్తిని చాటుకునే కొత్త తంతు మొదలు పెట్టబోతున్నారు. వాస్తవానికి నియోజకవర్గాల పెంపు బిల్లుపై దాగుడు మూతలు మోడీ సర్కారు ఇరకాటాన్నే గాక ఆతృతను కూడా బయట పెడుతున్నాయి. 2024లోనే మెజార్టీ రాని బీజేపీ ఫిరాయింపులు, అవకాశవాద మద్దతుతో వెంటనే దాన్ని ఆమోదింపచేసు కోవాలనుకుంటున్నది. దాన్ని ఆమోదించుకోవడమే తమ పట్టును ప్రతిబింబిస్తుందని ఒకవైపు, ఆ విధంగానైనా గెలిచేచోట్ల సీట్లు పెరిగితే 2029లో గట్టెక్కగలమనే దింపుడు కళ్లం ఆశ మరోవైపు ఇందుకు కారణమవుతున్నాయి. రాజకీయ గణితం ప్రకారం అలాగే జరగాలని ఏమీ లేదు. తెలుగు రాష్ర్టాల ప్రాంతీయ పార్టీలు అవకాశ వాదంతో తమకూ సీట్లు పెరుగుతాయని వంతపాడుతున్నాయి గానీ డిఎంకె వంటివి వ్యతిరేకమనే చెబుతున్నాయి. చివరకు ఎవరు ఎటు ఓటేస్తారో ఇంకా అనిశ్చితం. సీట్ల పెంపు లేకుండా మూడోవంతు రిజర్వేషన్‌ వరకూ ఆమోదం తీసుకోమంటే సిద్ధపడక పోవడంలోనే కేంద్రం నిజస్వరూపం తెలుస్తున్నది.

ప్రమాదమేమిటి?
​ఇంతకూ ఈ సమావేశాలలో సీట్ల పెంపు బిల్లు వస్తుందా లేదా అనేది సస్పెన్స్‌‌లో వుండగా విదేవీ విరాళాల నియంత్రణ చట్టం(ఎప్‌‌సిఆర్‌ఎ)ను మాత్రం ఎలాగైనా నెగ్గించుకోవాలని మోడీ సర్కారు తొండరపడుతున్నది. మానవ హక్కులు, లౌకికతత్వం వంటి వాటికోసం పోరాడే వందలాది ఎన్‌‌జివోలనూ, క్రైస్తవ మతసంస్థలనూ అదుపుచేయడానికే ఉద్దేశించిన బిల్లు ప్రపంచవ్యాపితంగానే చర్చకు కారణమైంది. అమెరికా సెనేటర్‌ రైక్‌, కాంగ్రెస్‌ ‌సభ్యుడైన రిపబ్లికన్‌ ‌‌రైలే మూర్‌ ‌వంటివారు దీన్ని బాహాటంగానే తప్పుపట్టారు. ఒకటవ శతాబ్దం నుంచి భారత దేశంలో క్రైస్తవ మతం ప్రవేశిం చిందనీ అలాంటిచోట ఆ మతంపై నియంత్రణ ఏమిటని ప్రశ్నించారు. కొందరు విదేశీ ప్రతినిధులేగాక మిజోరాం ముఖ్య మంత్రి లాల్‌ ‌ధూమా కూడా సందేహాలతో అమిత్‌ ‌షాను కలుసుకుని ఆ పైన 12న బిల్లు వస్తుందని ప్రకటించారు. కేంద్రమే ఈ బిల్లుపై స్పష్టత ఇవ్వనపుడు ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేయడమేమిటని కాంగ్రెస్‌ ఆక్షేపించింది. సీపీఐ(ఎం) వ్యతిరేకించగా ప్రధాన కార్యదర్శి ఎంఎ. బేబీ మోడీకి లేఖ రాశారు. ఆ పార్టీ ఎంపీలు జాన్‌ ‌బ్రిట్టాస్‌, శివదాసన్‌‌లు ఇప్పటికే బిల్లుపై వివరమైన ప్రకటనలే చేశారు. అసలు ఇండియా వేదిక సభ్యులు గట్టిగా నిలవరించాలని నిర్ణయించు కున్నారు. ఆఖరుకు బీజేపీ మేఘలయ ఎమ్మెల్యే ఎఎల్‌ ‌హక్‌ ‌కూడా ఈ బిల్లుపై స్పష్టత రావలసి వుందని తేల్చిచెప్పారు. పౌర సమాజం చొరవనూ, ఉద్యమాలనూ అడ్డుకోవడం, వివిధ మతాలకు ఆటంకం కల్పించడమే బిల్లు లక్ష్యమని సీపీఐ(ఎం) విమర్శించింది.

విదేశీ నిధుల నియంత్రణ పేరిట ఏర్పాటు చేసే వ్యవస్థ నిరంకుశంగా అడ్డుకునే ప్రమాదం వుంటుంది. రాష్టాలతో నిమిత్తం లేకుండా కేంద్రమే ఇష్టానుసారం దర్యాప్తుల పేరుతో చొరబడుతుంది. విచక్షణాధికారాలు ఇవ్వడం వల్ల నిరంకుశ అధికారాలు కేంద్రం చేజిక్కించుకుంటుంది. ఇప్పటికే 20,711 సంస్థల రిజిస్ర్టేషన్లు రద్దు చేయబడ్డాయి. మైనార్టీ మతాలపై ఆంక్షలు కఠిన షరతులు బిగించబడతాయి. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఇంకా పెరుగుతుంది. ఇంత విస్తృత ప్రభావం చూపే ఈ బిల్లుపై కనీసచర్చలు లేకుండా ఏప్రిల్‌‌లో ముందుకు తెచ్చారు. ఇప్పుడు ఎలాగో ఆమోదింప చేసుకోజూస్తున్నా రు. అందుకే సోమవారం పున: ప్రారంభమయ్యే ఉభయ సభల సమావేశాలు చాలా వాడిగావేడిగా కొనసాగనున్నాయి. మన దేశానికి సంబంధించిన చట్టాలలో విదేశాలకు అమెరికాకు సంబంధమేమిటన్న ప్రశ్న సరైందే గానీ అంతర్జాతీయ వ్యవహారాలలోనే అమెరికాకు తోకగా వ్యవహరించినప్పుడు ఈ స్వతంత్రేఛ్చ ఏమైనట్టు? ఇప్పుడు కూడా అంతర్జాతీయ సమాజం మన రాజ్యాంగం అనుమతించే నిబంధనలపై చర్చ చేయడం తప్పదు కదా? ఇక్కడ ఇంకో పెద్ద రాజకీయాంశం వుంది. ఆరెస్సెస్‌ ‌దేశంలో అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ అని మోడీనే ఎర్రకోటపై నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనే చెప్పారు.

మరి అది ఎక్కడ రిజిస్టరైంది, నిధులు ఎలా వస్తాయంటే చెప్పరు. వీరూ అడగరు, పైగా ఎదురు దాడి చేస్తారు. నిజానికి సంఘ పరివార్‌ అనే ఆరెస్సెస్‌కు వున్నన్ని ప్రత్యక్ష, పరోక్ష రహస్య అనుబంధ సంస్థలు మరెవరికీ వుండవు. విహెచ్‌‌పి అనేది పేరులోనే విశ్వవ్యాపితమైంది. మరి వారికి నిధులు ఎలా వస్తాయి? ఏం చేస్తున్నారు? అయోధ్యలో రామమందిర నిర్మాణం ముందునుంచి చూస్తున్నది ఆరెస్సెస్‌, ‌విహెచ్‌పిలే కదా? మరి జవాబుదారీ తనమేది? ఇక్కడ మాత్రం ఎన్టీవోలు మైనార్టీ సంస్థల లెక్కలు లోతుగా తవ్వితీసినిధులే గాక స్థిరాస్తులు కూడా స్తంభింపచేసే అధికారం కొత్త తనిఖీ సంస్థకు కల్పించబోతున్నారు. స్వచ్చంద సంస్థలు, ధార్మిక సంస్థలు విద్యావైద్య సేవలందించడం మనకు తెలుసు. ఈ నిబంధనల పేరట వాటి నిధులు స్తంభింపచేస్తే అభాగ్యులైన రోగులు పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి అభ్యంతరాలకు గురైన సంస్థలేవైనా కొత్తగా అనుమతి పత్రం తెచ్చుకోలేకపోతే వాటి ఆస్తులు పూర్తిగా సర్కారుకు దఖలు పడతాయి ఈ నిరంకుశ నిబంధనలు.

స్వేచ్ఛ సేవలపై దాడి
ఆచరణలో ఎవరిపై ఎలా ప్రయోగించబడతాయో ప్రజలు గ్రహించలేరా? పైగా ఇది వస్తే మీ ఆటకట్టిస్తామని కొన్ని చోట్ల ఇప్పటికే పరివార్‌ ‌సభ్యులు బెదిరింపులు సాగిస్తున్నారు. ఏవేవో పేర్లతో మీడియాలో రెచ్చగొట్టే చర్చలు చేస్తున్నారు. ఒక విధంగా ఇది దేశం వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా మతాల వారి వివాదాలు ఉద్రిక్తతలు పెంచే ప్రమాదం కూడా పొంచి వుంది. విదేశాలతో సంబంధాలపై ప్రభావం సరేసరి, ఇంతకు ముందే కొత్త వక్ఫ్‌ ‌చట్టం ముస్లిం మతా వలంబులను కష్టపెడుతుంటే ఇప్పుడీ బిల్లు పులిమీద పుట్రలా తయారవబోతుంది. ఎన్‌‌డిఎ భాగస్వామ ులైన పార్టీలు కూడా దీన్నిపూర్తిగా ఆమోదించలేకపోతున్నాయి. ఈ భయం పట్టుకుంది గనకనే మోడీ వరసగా చీలిపోయిన ప్రాంతీయ పార్టీల నేతలతో, ఎంపీలతో సమావేశాలు జరిపి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవేవీ బీజేపీ తప్పులను కప్పిపుచ్చలేవు.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -